Central Minister G Kishan Reddy: వారి వ్యూహం.. ఓట్ల కొనుగోళ్లే
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:08 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోళ్లే కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల వ్యూహమని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు....
సీఎం రేవంత్, కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు
జూబ్లీహిల్స్ కాస్మొపాలిటన్ నియోజకవర్గం
అక్కడ ‘సెంటిమెంట్’ కుదరదు.. బీఆర్‌ఎ్‌సది పగటి కలే
రేవంత్‌రెడ్డి చేరే పార్టీల్లో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది
జూబ్లీహిల్స్‌లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోళ్లే కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల వ్యూహమని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియ అధికార పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రధాన ప్రతిపక్షంలో కేటీఆర్ స్థాయిలో జరుగుతోందన్నారు. ‘ఒక్కో ఓటుకు ఎంత ఇవ్వాలి? ఏ పోలింగ్ బూత్‌లో ఎంత ఖర్చు పెట్టాలి? అన్నదే ఆ పార్టీల ప్రధాన వ్యూహం. అందుకే వారు ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో డబ్బుల పంపిణీ కూడా ప్రారంభమైంది’ అని తెలిపారు. దుందుడుకు భాషతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లుగా గత ఎన్నికల్లో తాను కూడా అలాగే అధికార పీఠం దక్కించుకున్నానని రేవంత్ భావిస్తున్నారని.. ఈ ఉప ఎన్నికలో కూడా ప్రజలను రెచ్చగొట్టేలా అదే భాషను రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో కేటీఆర్ కూడా తక్కువేం కాదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కిషన్‌రెడ్డి, ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు..
ఈ ఎన్నికలో సీఎం రేవంత్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
రేవంత్‌రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి. ఆయన ఇప్పటికే టీఆర్‌ఎ్‌సలో, బీజేపీలో, టీడీపీలో పని చేశారు. ఇప్పుడు కాంగ్రె్‌సలో ఉన్నారు. ఇక ఆయన చేరాల్సిన పార్టీల్లో మజ్లిస్ మాత్రమే మిగిలి ఉంది. విచిత్రం కాకపోతే... ఆయన కాంగ్రె్‌సలో చేరడమేంటి? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడమేంటి? ఇప్పుడు సీఎం కావడమేంటి?.. గడిచిన రెండేళ్లలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి రేవంత్‌రెడ్డి రావాల్సిన అవసరమే లేదు.
లోక్‌సభ ఎన్నికల కంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మీరు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లున్నారు!
అవును.. ఈ ఉప ఎన్నిక నా పార్లమెంటు సెగ్మెంటులో జరుగుతుండడం కూడా దానికి ఒక కారణం. గత లోక్‌సభ ఎన్నికల్లో నా సెగ్మెంటు కంటే ఇతర సెగ్మెంట్లలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్రంలో ప్రచారానికి వచ్చినప్పుడు వారితో వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మొత్తం పరిపాలనను గాలికొదిలేసి ఇక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు.. మేం కూడా పనిచేయాలి కదా!
సెంటిమెంటు తమకు కలిసొస్తుందని బీఆర్‌ఎస్ చెబుతోంది. మీ అభిప్రాయం
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాస్మొపాలిటన్ ప్రాంతం. ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలకు సంబంధించినవారు ఇక్కడ ఉన్నారు. సెంటిమెంటు పనిచేయదు. ఒక అపార్టుమెంటులో ఉన్నవాళ్లే ఎవరు ఎవరికి ఓటేస్తారో తెలియదు. సెంటిమెంటు పనిచేస్తుందనుకుంటే అది పగటి కలే.
మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు?
ముక్కోణపు పోటీయే. కాంగ్రెస్ పార్టీ ఇజ్జతే ముస్లింలు. వారి ఓట్లనే రేవంత్ నమ్ముకున్నరు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలువలేదు. కార్పొరేటర్‌గానీ, ఎమ్మెల్యేగానీ ఇక్కడ ఎప్పుడూ మాకు లేరు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఏమీ చేయలేదని ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీకి అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు. మీకు ఓటేస్తాంగానీ అధికారంలోకి ఎప్పుడొస్తారని ఓటర్లు మమ్మల్ని అడుగుతున్నరు. బీజేపీలో అందరం కలిసికట్టుగా పని చేస్తున్నాం. కాషాయజెండా ఎగరటం ఖాయం.
ఓట్లు చీలి బీజేపీకి అనుకూలం అవుతుందని మీరు చెబుతున్నారు. ఏ సమీకరణాల దృష్ట్యా ఈ అంచనాకు వచ్చారు?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌గా పోటీ నడిచింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రె్‌సగా ఉంది. ఇప్పుడు ముక్కోణపు పోటీ. ఈ పరిస్థితుల్లో వివిధ వర్గాల ఓట్ల చీలిక ఖాయం. మజ్లిస్ వైఖరి కూడా కీలకమే అవుతుంది. గత ఎన్నికల్లో మా అభ్యర్థి ఓడిపోయారన్న సానుభూతి కూడా మాకు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల పట్ల స్థానికుల్లో వ్యతిరేకత ఉంది.
బీఆర్‌ఎ్‌సకు కూడా ముస్లింల ఓట్లు పెద్ద మొత్తంలో పడే అవకాశం ఉందన్న వాదనపై మీ అభిప్రాయం.
కాంగ్రె్‌సకు మద్దతు ప్రకటించిన ఎంఐఎంపై ముస్లింలలోనే చాలామందిలో వ్యతిరేకత ఉంది. గతంలో పోలింగ్ సరళి పరిశీలిస్తే ముస్లింల ఓట్లు చీలిన సందర్భం లేదు. ఈసారి ఏమవుతుందో చూద్దాం.
ఇద్దరు కేంద్రమంత్రులున్నా బీజేపీ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు తీసుకురాలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై ఏమంటారు?
కాంగ్రె్‌సకు 8 మంది ఎంపీలు ఉన్నరు. వాళ్లేం చేశారు? కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు గడచిన 12 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల నిధులు ఇచ్చిందో గణాంకాలతో సహా పలుమార్లు వివరించాం. అయినా, పదేపదే నిరాధార ఆరోపణలు చేసేవారి పట్ల స్పందించడం వృథా.
ఈ ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది?
ఈ ఎన్నికకు రాష్ట్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది..?
బీజేపీ ప్రాధాన్యతను తెలిపే అంశం ఇది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ గతంలో కలిసి పనిచేశాయి. కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. కేసీఆర్, రేవంత్‌లు ఇద్దరూ టీడీపీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ల డీఎన్‌ఏ ఒక్కటే. వారి విధానం ఒకటే. అయినా, వాళ్లే ఉల్టా మాట్లాడుతున్నరు. అవినీతి కేసుల్లో రేవంత్, బీఆర్‌ఎస్ నేతలను కొట్టినట్లు చేస్తరు కానీ చర్యలు ఉండవు. ఇది కూడా రాహుల్ ఆదేశాల మేరకే జరుగుతోంది.