Share News

క్షేత్రస్థాయిలో కరెంటు యంత్రాంగం

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:47 AM

‘వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదు. విద్యుత్‌ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పొద్దు.

క్షేత్రస్థాయిలో కరెంటు యంత్రాంగం
Yadadri Thermal Power Plant

  • సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర హెచ్చరికతో కదలిక

  • యాదాద్రి ప్లాంటులో జెన్‌కో సీఎండీ హరీశ్‌,

  • ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ మకాం

  • కరెంటు ఉత్పత్తి పెంచేందుకు చర్యలు

  • ఈ నెల 30వ తేదీ వరకూ అక్కడే మరో ఐదుగురు ఐఏఎస్‌లు

  • రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఉదయం 7-8 గంటల మధ్య సమీక్షలు,

  • అనంతరం పొలాల వద్దకు అధికారులు,

  • సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే 24 గంటల్లోనే మార్పు

  • తక్కువ నీటితో పండే పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం: జితేష్‌ పాటిల్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్‌ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదు. విద్యుత్‌ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పొద్దు. అంతరాయాలు ఇలాగే కొనసాగితే ఉన్నతాధికారులను కూడా సస్పెండ్‌ చేస్తా’నంటూ ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విద్యుత్‌శాఖ యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. విద్యుత్‌ సంస్థల అధిపతుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ కదిలారు. జెన్‌కో సీఎండీ ఎస్‌ హరీశ్‌ బుధవారం నుంచి యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌(వైటీపీఎ్‌స)లోనే మకాం వేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ కూడా రెండురోజులుగా అక్కడే ఉన్నారు.


వైటీపీఎ్‌సలో ఐదు యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్‌ సామర్థ్యం 800 మెగావాట్లు. నాలుగు యూనిట్లలో వాణిజ్య ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభం కాగా, యూనిట్‌-5లోనూ వారం రోజుల్లో మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వైటీపీఎస్‌ ప్రస్తుతం నిర్మాణ దశలోనే ఉంది. పలు సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ ఈ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు యూనిట్లలో జరుగుతున్న ఉత్పత్తి (పీఎల్‌ఎఫ్‌) కూడా వాటి పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా లేదు. జెన్‌కోకు చెందిన అన్ని ప్లాంట్ల కన్నా యాదాద్రి ప్లాంట్‌లోనే పీఎల్‌ఎఫ్‌ అత్యల్పంగా ఉంది. నిర్మాణ సమస్యలను పరిష్కరించే పీఎల్‌ఎ్‌ఫను పెంచే పనిలో యంత్రాంగం పడింది. బీహెచ్‌ఈఎల్‌ సిబ్బందితో కలిసి ప్లాంట్‌లోని సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరించడానికి వీలుగా నవీన్‌మిట్టల్‌, ఎస్‌ హరీశ్‌ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు ఈ నెల 30వ తేదీ దాకా వైటీపీఎ్‌సలోనే ఉంటూ పనులను పర్యవేక్షించనున్నారు.


పొలాల వద్దకు విద్యుత్‌ సిబ్బంది

ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పంట పొలాల వద్ద పర్యటించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి పాటిల్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వరి కోతలు పూర్తయ్యే వరకు ఉదయం 7-8 గంటల వరకు జిల్లాల వారీగా ఉన్నతాధికారులతో సమీక్షలు జరుపుతామని, ఆ తర్వాత 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ అధికారులు, సిబ్బంది పొలాల వద్ద పర్యటిస్తారన్నారు. ఎల్‌నినో ప్రభావం నుంచి బయటపడేందుకు తక్కువ నీటితో పండించే పంటలపై అవగాహన కల్పిస్తామన్నారు. సంగారెడ్డి, మెదక్‌, నల్లగొండతోపాటు పలు జిల్లాల్లో వరిసాగు చివరిదశకు చేరుకున్నందున విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా, తరుచూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటునట్లు తెలిపారు.


వానలు సరిగా పడకపోవటంతో, రాబోయే రోజుల్లో పశుగ్రాసంపై తీవ్రప్రభావం ఉండే అవకాశం ఉందని, దీనికి తగినట్లుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పొలాలకు నీళ్ల కోసం బోర్లు, పంపుసెట్లను గంటల కొద్ది నిర్విరామంగా నడిపించడంతో పలు ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్‌ పడుతోందన్నారు. అయినప్పటికీ పంటలు ఎండిపోకుండా తమవైపు నుంచి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని, ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే 24 గంటల్లో వాటిని మార్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు జితేష్‌ పాటిల్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

లేని గర్భిణులను ఎలా తేవాలి?

ఎల్‌నినో దెబ్బకు పొదుపు మంత్రం

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 04:47 AM