చమురు ధరలు డౌన్...

ABN , First Publish Date - 2020-10-31T00:33:53+05:30 IST

అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు ఉధృతి, మరికొన్ని దేశాలు మరోసారి లాక్‌డౌన్ దిశగా ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో చమురు ధరలు క్షీణించాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చమురు ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో చమురు ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. కాగా... తాజాగా కరోనా రెండో దశ పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.

చమురు ధరలు డౌన్...

వాషింగ్టన్ : అమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా కేసులు ఉధృతి, మరికొన్ని దేశాలు మరోసారి లాక్‌డౌన్ దిశగా ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో చమురు ధరలు క్షీణించాయి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చమురు ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో చమురు ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. కాగా... తాజాగా కరోనా రెండో దశ పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో జూన్ ప్రారంభం నుండి చమురు ధరలు కనిష్టానికి పడిపోయాయి.  అమెరికా క్రూడ్ ఫ్యూచర్ గురువారం ఓ దశలో 6.6 శాతం మేర క్షీణించింది.


ఆ తర్వాత 3.3 శాతం క్షీణించి బ్యారెల్‌కు 36.17 డాలర్ల వద్ద ముగిసింది. జూన్ ఒకటి నుండి ఇది కనిష్టం. ఇక... 2020 లో బ్యారెల్‌కు 60 డాలర్ల వద్ద ప్రారంభమైన ధర ఏప్రిల్ లో జీరో కంటే దిగువకు పడిపోయింది. కరోనా కేసుల కారణంగా క్రూడాయిల్ ధరలు 2021 రెండో అర్ధ సంవత్సరంలో తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


ఇదిలా ఉంటే... ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ అక్టోబర్ 30(శనివారం) నుండి నేషనల్ లాక్ డౌన్ ప్రకటించారు. జర్మన్ ఛాన్సులర్ ఏంజిలా మెర్కెల్ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒక నెల పాక్షిక లాక్ డౌన్ ను ప్రకటించారు. అటు బ్రిటన్ కూడా లాక్‌డౌన్ ప్రకటించింది.


మళ్లీ ఆ స్థాయికి... 

కరోనా రెండో వేవ్ వణికిస్తోన్న నేపధ్యంలో ముడిచమురు ధరలు పతనమవుతున్నాయి. రెండు రోజులుగా ముడిచమురు ఫ్యూచర్స్ ట్రేడర్స్ భారీ అమ్మకాలకు తెరదీశారని తెలుస్తోంది. దీంతో రెండు రోజుల క్రితం 5 శాతం పతనమైన బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు నిన్న అదే స్థాయిలో క్షీణించాయి. ఓ దశలో నైమెక్స్ బ్యారెల్ ​5.3 శాతం పతనమై 35.11 డాలర్లకు చేరడం నాలుగు నెలల కనిష్టం. బ్రెంట్ బ్యారెల్ సైతం ఐదు శాతం క్షీణించి 36 డాలర్లను తాకింది.


బ్రెంట్ ధరలు ఈ ఏడాది మే నెలలో 37 డాలర్ల దిగువకు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి చేరాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ 3.96 శాతం క్షీణించి 35.91 డాలర్లు పలికింది. ఉత్పత్తి కోత అక్టోబర్ 23 వ తేదీతో ముగిసిన వారంలో ఇంధన నిల్వలు అంచనాలకు మించి 4.3 మిలియన్ బ్యారెళ్లకు చేరినట్లు యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్(ఈఐఏ) పేర్కొంది.


యూఎస్ బ్యూరో ఆఫ్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకారం గల్ఫ్ ఆఫ్ మెక్సీకో క్రూడ్ ప్రొడక్షన్ 66.6 శాతం క్లోజ్ అయింది. ఇదిలా ఉంటే... చమురు ధరలకు డిమాండ్ పెరిగేలా రష్యా, ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో కోతలు అమలు చేస్తున్నాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో రోజుకు 7.7 మిలియన్ బ్యారెళ్ల మేర కోతలను అమలు చేస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఉత్పత్తిలో కోతలు 2021 జనవరి వరకు అమలులో ఉంటాయి. 


Updated Date - 2020-10-31T00:33:53+05:30 IST