హనీ...ట్రాప్!
ABN, First Publish Date - 2020-08-29T09:12:07+05:30
కలెక్టర్ అంటే చాలా కీలకం! ఆధునిక ప్రజాస్వామ్యంలో జిల్లాకు వారే సార్వభౌమాధికారులు! ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధులు! ఇంత ముఖ్యమైన స్థానంలో ఉన్న వారు స్వీయ క్రమశిక్షణతో మెలగాలి!
- ఇద్దరు కలెక్టర్ల కహానీ
- ఒక ఐఏఎస్‌పై ప్రలోభాల వల
- తెలియకుండానే ఊబిలో అధికారి
- అవినీతి, అక్రమాల్లో ఆరితేరిన
- మహిళ చేతిలో చిక్కి విలవిల
- ఆ ఐఏఎస్‌లపై సర్కారుకు కీలక నివేదికలు
- మరో ఐఏఎస్‌ది స్వీయ నిర్వాకం
- మహిళా అధికారులతో అతి చనువు
- ఒక అధికారిణి కుటుంబంలో చిచ్చు
- భర్తతో విడాకులు ఇప్పించే యత్నం
- ప్రభుత్వానికి ఉప్పందినా మారని తీరు
- కేసు పెడతానన్న మరో మహిళ
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కలెక్టర్ అంటే చాలా కీలకం! ఆధునిక ప్రజాస్వామ్యంలో జిల్లాకు వారే సార్వభౌమాధికారులు! ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధులు! ఇంత ముఖ్యమైన స్థానంలో ఉన్న వారు స్వీయ క్రమశిక్షణతో మెలగాలి! ఇతరులు విసిరే ప్రలోభాల వలకు దొరక్కుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో నైతిక-రుజువర్తన పాటించాలి. కానీ... రెండు జిల్లాల కలెక్టర్లు ఈ విషయంలో అడ్డంగా బుక్కయ్యారు. వారిలో ఒకరు... కోస్తా జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి. నిజానికి... ఆయన సౌమ్యుడు. నిజాయితీపరుడు కూడా! కీలకమైన జిల్లాలో కత్తిమీద సాములాగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ... ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. అదే జిల్లాలో మరో ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న మహిళ సదరు కలెక్టర్ పాలిట మహమ్మారిలా మారింది. ఆ జిల్లాలో ఆమె పేరు తెలియని అధికారులు ఉండరు.
ముఖ్యంగా ఆమె పనిచేస్తున్న శాఖలో ఆమె హాట్ టాపిక్. పైరవీలు చేయడం, విచ్చలవిడి అవినీతి, పైఅధికారులను మభ్యపెట్టి అడ్డమైన పనులు చేయించుకోవడంలో ఆమెది అందెవేసిన చెయ్యిగా చెబుతారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగని కలెక్టర్ పైకి ఆమెను అస్త్రంగా ప్రయోగించినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయం గ్రహించేలోపే కలెక్టర్ ఆ వ్యవహారంలో పూర్తిగా కూరుకుపోయారని చెబుతున్నారు. కలెక్టర్ ద్వారా ఆ మహిళ కొందరు ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేయిస్తున్నారన్న సమాచారం బయటికి రావడంతో వ్యవహారం మొత్తం రచ్చకెక్కింది. ఈ విషయంపై ప్రభుత్వానికి రహస్య నివేదిక అందినట్లు సమాచారం. సదరు కలెక్టర్ తాము ‘ఆశిస్తున్నట్లు’గా పని చేయడంలేదని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే కాస్త గుర్రుగా ఉన్నారు. కానీ ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో ఆయననే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ అస్త్రం దొరకడంతో బదిలీ వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కలెక్టర్‌ది ఇంకో చరిత్ర...
కోస్తా జిల్లాకు చెందిన కలెక్టర్ తనకు తెలియకుండానే ఊబిలో ఇరుక్కుపోగా... రాయలసీమలోని ఒక జిల్లా కలెక్టర్ తనంతట తానే ‘హద్దు’ మీరి వ్యవహరిస్తారని చెబుతారు. ఆయన ఎక్కడ పని చేసినా మహిళల విషయంలో అతి చనువు ప్రదర్శిస్తారని పేరుంది. ఈయన కలెక్టర్ కాకముందు పలు జిల్లాల్లో పనిచేసినప్పుడు మహిళా అధికారుల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల కలెక్టర్‌గా ఆ జిల్లాకు వెళ్లిన తర్వాత తనకు బాగా సన్నిహితమైన మహిళా అధికారికి తన జిల్లాలోనే పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఈ విషయం వివాదం కావడం, ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆ బదిలీని నిలిపివేసింది. ఆ స్థానంలో మరో మహిళా అధికారికి పోస్టింగ్ ఇచ్చారు.
అయినప్పటికీ ఆ కలెక్టర్ మారలేదు. కొత్తగా వచ్చిన అధికారిణితోనూ సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. కలిసి భోజనం చేయడం, ఒకే కారులో వెళ్లడం, సమావేశాలకు ఉమ్మడిగా హాజరు కావడం... వంటివి షరా మామూలుగా మారింది. ఏ శాఖ సమావేశమైనా సరే... చివరికి పోలీసు అధికారులతో భేటీ అయినా ఆ మహిళాధికారి పక్కనే ఉండాలని పట్టుబట్టేవారు. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే ఆ మహిళాధికారి కుటుంబంలో చిచ్చురేగింది. దీన్ని అదనుగా తీసుకొని ఏకంగా ఆమెకు భర్త నుంచి విడాకులు ఇప్పించేందుకు కలెక్టర్ ప్రయత్నించారని విమర్శలున్నాయి. విషయం మరీ రచ్చకెక్కడంతో జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దీనిపై నివేదిక తెప్పించుకుని... ఆ మహిళా అధికారిని మరో ప్రాంతానికి బదిలీ చేసినట్లు తెలిసింది.
ఇంత జరిగినప్పటికీ ఆ కలెక్టర్ మారలేదు. తర్వాత కొద్దిరోజులకే మరో మహిళా అధికారి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో కీలకమైన ప్రభుత్వ సేవల విభాగంలో పనిచేసే ఆ అధికారిణి సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. కలెక్టర్‌పై కేసు పెట్టేందుకు కూడా ఆమె సిద్ధమైనట్లు సమాచారం. దీనిపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతుండగానే... ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, కేసు పెట్టొద్దని కలెక్టర్ ఆమెను వేడుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కూడా ప్రభుత్వానికి నివేదిక వెళ్లినట్లు తెలిసింది. త్వరలో ఈ కలెక్టర్‌పైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Updated Date - 2020-08-29T09:12:07+05:30 IST