హనుమా చూసితివా?
ABN, First Publish Date - 2020-12-30T05:27:49+05:30
అధికారపార్టీ కార్యకర్తలు ఆంజనేయస్వామి మాన్యంపై..
రూ.3 కోట్ల విలువైన మాన్యం ఆక్రమణ
బండలు పాతిన అధికారపార్టీ కార్యకర్తలు
ఆ గ్రామ వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే..!
భూములను కాపాడాలంటున్న పూజారి
మంత్రాలయం(కర్నూలు): అధికారపార్టీ కార్యకర్తలు ఆంజనేయస్వామి మాన్యంపై కన్నేశారు. వంద మంది ఆ భూముల్లో బండలు పాతేశారు. సుమారు ఆరు ఎకరాలు ఆక్రమించేశారు. తమ నాయకుల ఆదేశంతోనే ఇలా చేశామని గొప్పలు పోతున్నారు. మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఆంజనేయస్వామికి 15 సర్వే నెంబర్లో 37.43 ఎకరాలు ఉన్నాయి. రాయచూరు రోడ్డులోని 167 హైవే రోడ్డుకు ఆనుకుని 255-1, 255-3 సర్వే నెంబర్లో 6.06 ఎకరాలు ఉన్నాయి. ఈ ఆరు ఎకరాల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 కోట్లపైనే ఉంటుందని అంచనా. ఈ భూమిపైనే ఆ గ్రామంలోని వైసీపీలోని రెండు వర్గాల నాయకుల కన్ను పడింది. అయితే ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా గ్రామస్థులకు నాలుగు చోట్ల ఇంటి స్థలాలను ఎంపిక చేసింది. ఇంటి స్థలాల కోసం 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంత్రాలయం రోడ్డులోని 84-ఏలో ఉన్న 3 ఎకరాల్లో 118 ప్లాట్లను, గంగమ్మ గుడి వద్ద 82 సర్వే నెంబరులోని 2ఎకరాల్లో 58 ప్లాట్లను, 238 సర్వే నెంబర్‌లో 20 ప్లాట్లు, శ్మశానం వద్ద మరికొన్ని ప్లాట్లను సిద్ధం చేసింది. కొందరు వైసీపీ కార్యకర్తలు ఆ ప్లాట్లు తమకు అనుకూలంగా లేవంటూ మంగళవారం 167 హైవే రోడ్డుకు పక్కనే ఉన్న ఆంజనేయస్వామి మాన్యాన్ని ఆక్రమించుకున్నారు. తమ నాయకులు చెప్పారంటూ సుమారు వందమంది ఆ భూమిలో బండలు పాతారు. ఇదేమిటని కొందరు ప్రశ్నిస్తే.. ఆ నాయకుడు ప్లాట్లను తొలగిస్తే తాము కూడా తొలగిస్తామంటూ ఒకరిపై ఒకరు చెప్పుకున్నారు.
స్వామి భూములను కాపాడండి
ఈ భూములు స్వామికి చెందినవి. సుమారు 6 ఎకరాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. స్వామి భూములను అధికారులే కాపాడాలి.
- నెంబి రాఘన్నస్వామి, అంజనేయస్వామి పూజారి, మాధవరం
పూజారి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
మాధవరం గ్రామంలో దేవాలయ భూములు కబ్జాకు గురైనట్లు మాకు సమాచారం లేదు. ఆ భూములు దేవదాయ శాఖ పరిధిలోకి వస్తాయి. ఆలయ పూజారి ఫిర్యాదు చేస్తే ఎండోమెంట్ వారి సహకారంతో ఆక్రమణలు తొలగిస్తాం.
- చంద్రశేఖర్, మంత్రాలయం తహసీల్దార్
Updated Date - 2020-12-30T05:27:49+05:30 IST