అయోధ్యకు ఉగ్ర ముప్పు.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
ABN , First Publish Date - 2020-07-30T21:35:10+05:30 IST
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసి ఏడాది కావస్తున్నందున ఆగస్టు 5న జరిగే ..
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసి ఏడాది కావస్తున్నందున ఆగస్టు 5న జరిగే వార్షికోత్సవాలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తాజాగా హెచ్చరించాయి. ఆప్ఘనిస్థాన్‌లో శిక్షణ పొందిన పాక్ ఉగ్రవాదులు గత మేలో జరిగిన ఈదుల్ ఫితర్ వేడుకల్లో దాడులు జరపడంలో విఫలం కావడంతో ఆగస్టు 5న దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కూడా భూమిపూజ జరుగనుండటంతో దాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
ఇంటెలిజెన్స్ తాజా సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే వేడుకలను కూడా టార్గెట్ చేశారు. ఇంటెలిజెన్స్ తాజా సమాచారంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు.
'సుమారు 20 మంది తాలిబన్ ఉగ్రవాదులకు జలాలాబాద్‌లో పాక్ ఆర్మీ శిక్షణ ఇస్తోంది. ఈదుల్ ఫితర్ తర్వాత మే 26-29 తేదీల మధ్య దాడులు జరపాలని ఉగ్రవాదులు ఇటీవల పథక రచన చేశారు. అయితే భద్రతా బలగాల అప్రమత్తతతో దాడులు నిర్వహంచలేకపోయారు' అని ఇంటెలిజెన్స్ అడ్వయిజరీ పేర్కొంది. శిక్షణ పొందిన 20 నుంచి 25 మంది ఉగ్రవాదులను అంతర్జాతీయ సరిహద్దులు/లైన్ ఆఫ్ కంట్రోల్ (జమ్మూకశ్మీర్ వెంబడి) ద్వారా భారత్‌లోకి చొప్పించాలని, ఐదారుగురు ఉగ్రవాదులను ఇండో-నేపాల్ సరిహద్దు ద్వారా భారత భూభాగంలోకి పంపాలని ప్రణాళిక రచిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం చెబుతోంది.
ఆర్టికల్ 370 రద్దు చేసిన రోజు, ఆగస్టు 5వ తేదీ ఒకేరోజు కావడంతో ఆ రోజున కానీ, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజు కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశాలున్నాయని, అయోధ్యలో రామాలయ భూమిపూజ కూడా ఆగస్టు 5న ఉండటంతో ఉగ్రవాదులు ఆరోజును టార్గెట్ చేసుకునే అవకాశాలు లేకపోలేదని ఇంటెలిజెన్స్ అడ్వయిజరీ చెబుతోంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులకు అవకాశమున్న ప్రాంతాల్లో భద్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.