నాకెవరూ లంచం ఇవ్వలేదు
ABN, First Publish Date - 2020-02-07T22:16:50+05:30
వెల్‌కం టూ ఓపెన్ హార్ట్.. ఖాన్ గారూ.. సహజంగా పోలీస్ ఆఫీసర్లు రిజర్వ్‌డ్‌గా ఉంటారు. మీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారెందుకని? నాది ఈ ప్రాంతమే కాబట్టి భాషా, సంస్కృతులతో సమస్య లేదు. కాబట్టి ప్రజల్లో కలిసిపోవడం తేలికైంది.
అలాంటి సంకేతాలను ఆదిలోనే తుంచేశాను
జీవితమే ఒక ఆట
బాధ.. నష్టాలను డబ్బుతో కొలవడం కూడదు
20-6-2011న ఓపెన్ హార్ట్‌లో హైదరాబాద్ కొత్వాల్ ఏకే ఖాన్
వెల్‌కం టూ ఓపెన్ హార్ట్.. ఖాన్ గారూ.. సహజంగా పోలీస్ ఆఫీసర్లు రిజర్వ్‌డ్‌గా ఉంటారు. మీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారెందుకని?
నాది ఈ ప్రాంతమే కాబట్టి భాషా, సంస్కృతులతో సమస్య లేదు. కాబట్టి ప్రజల్లో కలిసిపోవడం తేలికైంది. వారితో సత్సంబంధాలు లేకుండా మాకు అవసరమైన సమాచారం అందదు. నాది అనంతపురం జిల్లా పెనుగొండ అయినా.. నా చిన్నప్పుడు ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం అంతగా లేదు. మా నాన్నగారి ఉద్యోగం కారణంగా రాష్ట్రంలో జిల్లా కేంద్రాల్లోనే నా విద్యాభ్యాసం గడిచింది. నేను ప్రొఫసర్ కావాలనుకున్నాను కానీ యాదృచ్ఛికంగా ఐపీఎస్ అయ్యాను. హోం స్టేట్‌లోనే పోస్టింగ్ రావడం వలన.. ఐఆర్‌టీఎస్‌లో అవకాశం వదులుకుని పోలీస్ శాఖలో జాయినయ్యాను. ఈ ఉద్యోగంలో ప్రజలకు మేలు లేదా కీడు.. ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. మొదట్లో ఈ ఉద్యోగంలో సిబ్బందికి నాయకత్వం వహిస్తుంటే.. చాలా ఉద్వేగంగా అనిపించింది. తరువాత కాలంలో ఎంత బాగా చేస్తున్నాను అనే ఆలోచన మనసులోకి వచ్చింది. పోలీసుగా రోడ్డున పోయే జనాన్ని గన్‌మెన్లు అదిలిస్తుంటే వద్దనే చెబుతాను. అయితే.. ఆడపిల్లలపై అత్యాచారాల విషయంలో వాళ్లకే లాఠీ ఇచ్చి నిందితులను ‘ఏం చేస్తావో.. చెయ్’ అన్న సందర్భాలున్నాయి. సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుళ్లను కొట్టినప్పుడు వారిపై చట్ట విరుద్ధంగా చర్య తీసుకున్నాను. అప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. నిందితులను సమర్థించిన ప్రముఖుడితో నేను మాట్లాడినప్పుడు ఆయన నన్ను మెచ్చుకున్నారు. సీనియారిటీ పెరిగే కొద్దీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అలవాటైంది.
మీరు సర్వీస్‌లో చేరినప్పుడు ఐపీఎస్ అధికారులకు ఉన్న గౌరవం ఇప్పుడుందా?
అవకాశాలు కొద్దిగా ఉన్నందు వలనే అప్పట్లో ఆ గౌరవం. ఇప్పుడు అవకాశాలు పెరగడంతో.. చాలా మంది సివిల్ సర్వీసెస్‌ను ఆప్ట్ చేయడం లేదు. మా పిల్లలే అందుకు ఉదాహరణ. అయితే.. ఐపీఎస్‌లలో ఎదగడానికి రాజీపడే వారు ఉన్నారు. ఇలాంటి వారు అప్పట్లో తక్కువ.. ఇప్పుడు ఎక్కువయ్యారు. విలువల్లో పతనం ఉంది. అందరూ అనుకున్నట్లుగా మా డ్యూటీలో అన్ని కేసుల్లోనూ రాజకీయ జోక్యం ఉండదు. కేవలం ఐదు శాతం కేసుల్లోనే ఉండే ప్రజా ప్రతినిధుల జోక్యాన్ని మనకు తెలియని సమాచారాన్ని వారు అందిస్తున్నట్లుగా భావించాలి. రోడ్ యాక్సిడెంట్లలో డ్రైవర్లు, మహిళల అరెస్ట్‌ల విషయంలో చట్ట ప్రకారం బెయిల్ ఇవ్వకపోతే ప్రజా ప్రతినిధుల జోక్యాన్ని సహించవచ్చు. రౌడీలను నియంత్రించే విషయంలో ప్రజాప్రతినిధుల జోక్యానికి తలొగ్గితే తప్పే. నా దగ్గర పని చేసే అధికారులకు అనవసర జోక్యాల విషయంలో రాజీ పడవద్దనే చెబుతాను. నేను నా దగ్గరకు వచ్చిన వారి సామాజిక, ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా గౌరవిస్తాను. బాధ లేదా నష్టాలను డబ్బుతో కొలవడం తప్పు. నష్టం విలువ ఎక్కువ ఉంటే పెద్ద స్థాయి అధికారితో దర్యాప్తు జరిపిస్తుంటారు. నాఅభిప్రాయం ప్రకారం అది సరికాదు. ఒకసారి బాగా ధనవంతుడైన ఒక వ్యాపారి దగ్గర దోపిడీకి గురైన రూ.27 లక్షలు రికవరీ చేశాం. వాళ్లు ఆ డబ్బు పోయినందుకు పెద్దగా బాధపడలేదు.. దొరికితే బాగా సంతోషించలేదు. మరో కేసులో ఒక పేద వృద్ధురాలు గుడిసెలో ఉన్న సామానంతా పోయింది. మొత్తం దాని విలువ రూ. 5,000 కూడా ఉండదు. నేను నమ్మిన విలువల ప్రకారం ఆ రూ. 27 లక్షల కంటే ఈ రూ. 5,000 ఎక్కువ.
బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులు, కేశవరావు కుమారుడి కేసు విషయంలో మీరేమంటారు?
బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసులో బలం లేకపోవడానికి కారణం.. దర్యాప్తులో లోపాలు కావు. బాధితులే వెనక్కితగ్గారు. అప్పుడు పోలీసులు చేయగలిగింది ఏం లేదు. ఆ కేసులో బాధితులే కోర్టులో నిందితుడు ఏం చేయలేదని చెప్పాడు. ఇలాంటి విషయాల్లో నా వరకూ నేను నిజాయితీగా ఉన్నానా.. లేదా.. అన్నది చూస్తాను. కేశవరావుకుమారుడి కేసు జరిగినప్పుడు నేనుసిటీలో లేను కాబట్టి ఏం జరిగిందో తెలియదు.
క్రికెట్ అంటే మీకు ఆసక్తి ఎందుకు?
జీవితంలో ప్రతి విషయాన్నీ ఈ గేమ్‌కు అన్వయించుకోవచ్చు. జీవితంలోనూ.. క్రికెట్‌లోనూ టీం వర్క్, యాగ్రెషన్.. రెండూ కలగలసి ఉండాలి. అలా ఉండే క్రికెట్ అంటే నాకిష్టం. అలాగే టెన్నిస్ అన్నా కూడా. ఉదాహరణకు నా హయాంలో కర్ఫ్యూ విధించి.. ఆ తరువాత సడలించినప్పుడు.. నేను నాలుగున్నర గంటలపాటు నడిచి దాదాపు 40 కుటుంబాలతో మాట్లాడాను. విలేకరులతో కూడా మాట్లాడాను. అందరూ కర్ఫ్యూ అవసరం లేదని చెప్పాను. అప్పుడక్కడ విలేకరులు క్రికెట్ ఆడుతున్నారు. అప్పుడు క్రికెట్ ఆడితే.. పరిస్థితి మెరుగైందన్న సంకేతం ఇచ్చినట్లవుతుందని భావించి ఆడాను. వైజాగ్‌లో ఉండగా.. పోలీస్ అండ్ పబ్లిక్ అసోసపియేషన్ ఫర్ స్ర్టీట్ చిల్డ్రన్ (పాపా) అని ప్రారంభించాను. ఆ హోం ఇప్పటికీ నడుస్తోంది. కుటుంబంలో ఏవో సమస్యల వలన పిల్లలు ఇంటి నుంచి పారిపోతున్నారు. ఇలాంటి వారు తాము సమస్యల్లో ఉండడమే కాక, సమాజానికి హానికరంగా నేరస్తులుగా తయారవుతున్నారు. ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతున్నారు. అందుకే స్థానిక పెద్దలతో కలిసి దాన్ని మొదలుపెట్టాం. కడపలో ఒక కానిస్టేబుల్ అనాథ శవాలకు దహన సంస్కారాలు చేస్తుంటారు. అనాథ శరణాలయం కోసం కూడా ప్రతిఫలాపేక్ష లే కుండా ఆయన విరాళాలు సేకరిస్తుంటారు.
ఏ ఐపీఎస్ అధికారి అయినా.. హైద్రాబాద్ కమిషనర్.. ఆ తరువాత డీజీపీ పోస్టు కోసం కలలు కంటుంటారు. అలాంటిది మీకు ఈ పోస్టు నుంచి తప్పుకోవాలన్న వైరాగ్యం ఎందుకొచ్చింది?
అలా అనుకోవడంలో వైరాగ్యమేమీ లేదు. వ్యక్తిగత విషయాలకు సమయం వెచ్చించే అవకాశం లేక అలా అన్నాను. హైదరాబాద్ సాధారణంగా ఉంటేనే సమస్యలు ఉంటాయి. అలాంటిది ఉద్యమాలు, టెర్రరిస్టు కేసులున్నప్పుడు పనిభారం ఎక్కువగా ఉంటుంది. సిబ్బంది కొరత వలన ప్రాధాన్యత క్రమంలో కొన్ని విషయాలను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. మిలియన్ మార్చ్ సందర్భంగా, ఆ రోజు సాయంత్రానికి మేం చేసిందేమిటో.. భవిష్యత్తును ప్రభావితం చేసే దానితోనూ అంచనా వేయాలి. కమిషనర్‌గా నేను వ్యవహరించిన విధం నాకు తృప్తి కలిగించింది. నగరంలోఒకేసారి ఇన్ని సమస్యలుండగా, సాధారణ పరిస్థితులను నెలకొల్పడం చిన్న విషయం కాదని నేను భావిస్తున్నాను.
మీ కెరీర్‌లో పెద్ద ఫెయిల్యూర్ ఏమిటి?
అది నా ఫెయిల్యూర్ అనడం కంటే వ్యవస్థ ఫెయిల్యూర్ అనడం మంచిది. అది ఇప్పుడు వద్దు. (భర్తగా మీ సెల్ఫ్ ఎసెస్‌మెంట్).. నేను సినిమాలు లేదా డిన్నర్‌లకు కుటుంబంతోనే వెళతాను. ఒంటరిగా వెళ్లను. పిల్లల కోసం తెలుగు సినిమాలు త్యాగం చేశాను. డీజీపీ పదవి విషయానికొస్తే.. అందుకు అవకాశం ఉన్నా.. కేవలం దాని కోసమే ప్రయత్నించను. ప్రస్తుతం కెరీర్‌తో పాటు పిల్లల కంపెనీనీ ఎంజాయ్ చేస్తూ.. వారిని మౌల్డ్ చేయడానికీ ప్రయత్నిస్తాను. పెద్దబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో అబ్బాయి ఇంజనీరింగ్ అయింది. తను సివిల్ సర్వీసెస్‌లోకి వస్తే సంతోషిస్తాను.
మీకు లంచం ఇవ్వడానికి మొట్టమొదటి సారి ఎవరు, ఎప్పుడు ప్రయత్నించారు?
నాకలా ఎవరూ ఇవ్వలేదు. పండుగలు, న్యూ ఇయర్ డే సందర్భాల్లో పండ్లు, ఖరీదైన పెన్నులు ఇచ్చారు. అయితే.. లంచం ఇస్తామన్న సంకేతాలు వచ్చినప్పుడు సున్నితంగా తిరస్కరించాను. డ్రగ్స్ ట్రాఫికింగ్ విషయంలో కొంత మంది సెలబ్రిటీల పేర్లు మా దగ్గర ఉన్నా.. చట్టం ప్రకారం సాక్ష్యంగా ఎలా మలచాలన్నది సమస్య. ఒకరిని ట్రాప్ చేసిన తరువాత.. మిగిలిన వారు అలెర్టయిపోతారు. అప్పుడా పేర్లుండి ఏం ఉపయోగం? బయటపెడితే.. డిపార్ట్‌మెంట్ మీద పరువునష్టం కేసులు వేస్తారు. మేము ఈ కేసులు సమాజం ముందు పెడుతున్నాం. మరి గతంలో లేని ఇలాంటి కేసులు ఇప్పుడెందుకొస్తున్నాయోనని సమాజంలో మార్పుల గురించి ఆలోచించకుండా పోలీసులనే విమర్శిస్తుంటారు.
మీ ఫ్యామిలీ ఇనింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటున్నా.
Updated Date - 2020-02-07T22:16:50+05:30 IST