మళ్లీ జన్మంటూ ఉంటే.... ఐపీఎస్‌గానే పుడతా
ABN , First Publish Date - 2020-02-07T22:14:05+05:30 IST
రిటైరయ్యాక జీవితం ఎలా ఉంది? నేను ఐపీఎస్‌లో చేరినప్పుడే రిటైర్మెంట్ తేదీ తెలుసు. కానీ రెండేళ్లు ఎక్స్‌టెన్షన్ వచ్చింది. మనం బాధ్యతలకు స్పందించే తీరును బట్టే మన కాలక్షేపం ఉంటుంది.
నా దృష్టిలో ఎన్టీఆరే బెస్ట్ సీఎం
వైఎస్‌తో విభేదాలు లేవు.. కొందరు ఆయన మనసు విరిచేశారు
చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏపనీ చేయను
రౌడీలను లాకప్‌లో వేసి కొట్టక్కర్లేదు
4-4-2011న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాజీ డీజీపీ ఏకే మహంతి
రిటైరయ్యాక జీవితం ఎలా ఉంది?
నేను ఐపీఎస్‌లో చేరినప్పుడే రిటైర్మెంట్ తేదీ తెలుసు. కానీ రెండేళ్లు ఎక్స్‌టెన్షన్ వచ్చింది. మనం బాధ్యతలకు స్పందించే తీరును బట్టే మన కాలక్షేపం ఉంటుంది. నేను ప్రొహిబిషన్‌లో ఉండగా.. ఐజీ (ట్రైనింగ్) పోస్ట్ వచ్చింది. అందరూ దాన్ని బెలూన్ పోస్ట్ అన్నారు గానీ, నాకది సవాలులా కనిపించింది. దాంతో నేను బిజీ అయిపోయాను. అధికారాన్ని బాధ్యతలా చూస్తే.. అది ఎవరికీ కనపడదు. కానీ మనం దాన్ని దుర్వినియోగం చేస్తేనే అందరికీ కనపడుతుంది.
స్టూడెంట్ యూనియన్ నేతగా ఉండి.. రాజకీయాల్లోకి వెళ్లకుండా ఐపీఎస్‌లోకి ఎందుకు వచ్చారు?
నేను కటక్ లోని వెమెన్సా కాలేజిలో చదివాను. అది ఒడిసా రాజకీయాలకు కేంద్రస్థానం. అక్కడ మంచి విద్యార్థులను కొందరు ఏడిపించేవారు. వాళ్లను అడ్డుకోవాలని ఓ గ్రూపు ఏర్పాటుచేసి.. వీళ్లను రక్షించేవాడిని. అలా మొదలైంది తప్ప రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశం లేదు.
ఇన్నేళ్లలో ఐపీఎస్‌కి ఎందుకొచ్చానా అనిపించిందా?
లేదు. ఐపీఎస్ అయినందుకు గర్వపడుతున్నాను. మరో జన్మంటూ ఉంటే ఐపీఎస్‌గానే పుడతా. సేవకు ఇదో మంచి మార్గం
నిజాయతీ గల ఐపీఎస్‌లు ఎంతమంది ఉంటారు?
చాలామంది మంచి అధికారులే ఉన్నారు. కానీ, డైనమిక్స్ మారిపోయాయి. ఏపీ కేడర్‌లో సమర్థులు, నిజాయతీగల వాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కళ్లూ తమను రక్షించే వాళ్లు ఎవరా అని చూసుకుంటున్నారు. అందరూ నాలా ఒంటరిగా ముందుకు వెళ్లేంత పిచ్చివాళ్లు కారు. కానిస్టేబుళ్ల నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఎన్నికల సమయంలో చాలామంది కానిస్టేబుళ్లు కూడా అర్ధరాత్రయినా ఫోన్లు చేసి సమాచారం ఇచ్చేవారు.
పోలీసుశాఖ కూడా పార్టీల వారీగా విడిపోయింది..
ఆలిండియా సర్వీసులు ఇలా కాకూడదు గానీ.. అవుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసేవాళ్లను ప్రజలే సాంఘికంగా బహిష్కరించాలి.
మీ దృష్టిలో బెస్ట్ సీఎం ఎవరు?
ఎన్టీఆర్ గారే బెస్ట్. ఆయనతోనూ నాకు కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఆయనకు భావోద్వేగాలు ఎక్కువ. పేదల పట్ల చిత్తశుద్ధి ఎక్కువ. నన్ను తీసేయాలని కొందరు పెద్ద నాయకులు ఆయన్ని అడిగారట. ‘‘ఆయన అవినీతి చేస్తారా? పనికిరానివాడా? సమస్య ఏంటి?’’ అని వాళ్లను ఎన్టీఆర్ అడిగితే.. మొదటి రెండింటికీ కాదని, మూడో ప్రశ్నకు మన పార్టీకి పనికిరానని చెప్పారట. పార్టీ కోసం మీరున్నారు.. మీరు పార్టీ పని చేయండి, ఆయన పోలీసు పని చేస్తారని చెప్పి పంపేశారట.
మీకు, వైఎస్సార్‌కు ఎందుకు విభేదాలొచ్చాయి?
నన్ను ఆయనే విజిలెన్స్‌లో వేసి.. హైదరాబాద్ సీపీగా తెచ్చి.. తర్వాత శాంతిభద్రతల విభాగం డీజీగా చేశారు. మా సహచరుల్లో కొందరు ఆయన మనసును విరిచేయడం వల్లే బహుశా ఆయన నన్ను మార్చి ఉంటారు. ఆయనకు, నాకు ఏమీ విభేదాల్లేవు.
రాజకీయాల్లోకి రమ్మని ఏదైనా పార్టీ పిలిచిందా?
కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు గానీ, రాజకీయా ల్లో అవకాశం చాలా తక్కువగా ఉంటోంది. కొన్ని పార్టీలు ఆహ్వానించినా వెళ్లదలచుకోలేదు.
మీకు తెలిసి చాలామంది ఐపీఎస్‌లు చాలా సంపాదించారు. మీకది మానసిక సంఘర్షణ కాలేదా?
అవినీతి చేసే అవకాశం ప్రతిరోజూ వచ్చింది. కానీ, నిజాయతీగా ఉండటం నాకు చాలా సంతృప్తినిచ్చింది. అందుకే నేను డబ్బు వెనక పడలేదు. పిల్లలూ అంతే. భార్య, పిల్లల నుంచి డిమాండ్ లేనప్పుడు డబ్బు సంపాదించాల్సిన అవసరం కనపడలేదు.
ఏసీబీలో ఉన్నప్పుడు ఆలిండియా సర్వీసుల వాళ్లను ఏమైనా చేయగలిగారా?
మాకు తెలుసు, మా దగ్గర జాబితా కూడా ఉంది. కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి వచ్చేది. నేను గుర్తించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరి జాతకం ఏంటో జనానికే తెలుసు.
ఎప్పుడైనా ఎన్‌కౌంటర్లు చేశారా?
89-90లో కరీంనగర్ డీఐజీగా వెళ్లాను. నా కంటే ముందున్న వాళ్లు రెండు మూడు నెలలకే వెళ్లిపోయేవారు. పోలీసులు స్టేషన్‌నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. నేనూ వె ళ్లిపోతాననే అంతా అనుకున్నారు గానీ, నేను వెళ్లలేదు. చట్టం, రాజ్యాంగానికి లోబడని పనులేవీ చేయలేదు. నేను ఉన్నప్పుడూ ఎన్‌కౌంటర్ జరిగినా, అది ఎరేంజ్ చేసింది కాదు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నేను బద్ధ వ్యతిరేకిని. రౌడీలను లాకప్‌లో వేసి కొట్టక్కర్లేదు.
84లో ఎన్టీఆర్ సంక్షోభ సమయంలో, ఎమ్మెల్యేలను ఆపాలన్న సూచనలు మీకు ఏమీ రాలేదా?
వాళ్లను ఢిల్లీ పంపకూడదని కొన్ని వర్గాలు అన్న మాట వాస్తవమే. పైస్థాయిలో ఒత్తిళ్లు ఉంటాయి గానీ, నా మీద ఏమీ లేవు. వాళ్లను బలవంతంగా తీసుకెళ్తున్నారని కొందరన్నారు. అప్పుడు వాళ్లతో మాట్లాడి స్వయంగా వెళ్లాలంటే రైల్లో వెళ్లాలని చెప్పాను.
పిల్లలు ఏం చేస్తున్నారు?
పెద్దబ్బాయి ఐపీఎస్. ఛత్తీస్‌గఢ్ కేడర్‌లో ఎస్పీ. ఒరాకిల్‌లో చేస్తున్న చిన్నబ్బాయి కూడా ఐపీఎస్‌కే వెళ్తానంటున్నాడు..