తెలంగాణలో పొలిటికల్‌ ఫ్యూడలిజం

ABN , First Publish Date - 2020-02-07T22:30:26+05:30 IST

యాభై రోజుల కిందటివరకు ఎన్జీవోలకు మాత్రమే తెలిసిన అశోక్‌బాబు ఈ రోజు సీమాంధ్ర, తెలంగాణల్లో చాలామందికి తెలుసు... ఈ మార్పు ఎలా అనిపిస్తోంది? ఇది ఊహించిన మార్పుకాదు. మా సంస్థకున్న విశ్వసనీయత, మౌలిక వసతుల దృష్ట్యా ప్రజామోదం లభించింది.

తెలంగాణలో పొలిటికల్‌ ఫ్యూడలిజం

యాసలు వేరయినా భాష ఒక్కటే.. మనస్తత్వాలూ ఒక్కటే

పెద్దన్నలా కేంద్రమే సమస్యను పరిష్కరించాలి

మా సభ సూపర్‌ హిట్‌ 

15-9-2013న ఓపెన్ హార్ట్‌లో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు


యాభై రోజుల కిందటివరకు ఎన్జీవోలకు మాత్రమే తెలిసిన అశోక్‌బాబు ఈ రోజు సీమాంధ్ర, తెలంగాణల్లో చాలామందికి తెలుసు... ఈ మార్పు ఎలా అనిపిస్తోంది?

ఇది ఊహించిన మార్పుకాదు. మా సంస్థకున్న విశ్వసనీయత, మౌలిక వసతుల దృష్ట్యా ప్రజామోదం లభించింది. దీనికి ప్రధాన కారణం... ప్రభుత్వోద్యోగులుగా పల్లెల్లో రైతు నుంచి పట్టణాల్లో ఉన్నతస్థాయి వ్యక్తివరకు మాకు కనెక్టివిటీ ఉంటుంది. ఉద్యోగులు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరూ పరిశీలిస్తుంటారు. ఈ రోజు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఉంది.

 

మా సంస్థ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2009లో ఇది తెలిసింది. రాష్ట్ర విభజన నిర్ణయం రాజకీయ ప్రక్రియ అనేది నా నమ్మకం. అయితే 2009 నుంచి 2013వరకు అనేక సంఘటనలు మాకు బాధ క.లిగించాయి. జనవరి 13న ఢిల్లీ వెళ్లినప్పుడే దీనిమీద పోరాడవలసింది. కానీ, మాకున్న పరిమితులవల్ల ఆ రోజు ప్రారంభించలేకపోయాం. మే నెలనుంచి విభజన తప్పదన్న సంకేతాలు బలంగా వినిపించడంతో అందరితోనూ మాట్లాడి పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఇది సరైన సమయం లో తీసుకున్న సరైన నిర్ణయం. మావాళ్లలో కొందరు సందేహాలు వ్యక్తంచేసినా ముందుకెళ్లాం. ఈ ప్రయత్నానికి ఊహించినదానికన్నా ఎక్కువగానే ప్రజామోదం లభించింది.


వ్యక్తిగతంగా మీరు సమైక్యవాదా?

రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుందని పూర్తిగా నమ్ముతా. మన భౌగోళిక పరిస్థితులుగానీ, వనరుల మార్పిడిగానీ ఆంధ్రప్రదేశ్‌కున్న ప్రత్యేక లక్షణాలనుగానీ దృష్టిలో పెట్టుకుని చూస్తే విడివిడిగా ఉంటే అభివృద్ధి సాధ్యంకాదు. 1972లోనే విడిపోయి ఉంటే ఎలా ఉండేదో చెప్పలేను కానీ, ప్రస్తుతం సాంస్కృతిక ఏకీకరణ రాకపోయినా అభివృద్ధిపరమైన ఏకీకరణ వచ్చేసింది. ఈ స్థితిలో రాష్ట్ర విభజన కష్టం.


తెలంగాణ ఉద్యమం ఎప్పటినుంచో ఉంది. పన్నెండేళ్లుగా తీవ్రస్థాయిలో సాగుతోంది. ఉద్యోగులు ఏదో రూపంలో ఆందోళన తెలుపుతున్నారు. ఇంతకాలం మీరు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఉద్యమాలతో తెలంగాణకు అడ్డుపడుతున్నారన్నది ప్రధాన విమర్శ...

తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణం.. ఈ ప్రాంత ఉద్యోగాలను ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు తీసుకెళ్లిపోతున్నారన్నది! రెండోది... అభివృద్ధి జరగలేదన్నది. దీనిపై నేనేమీ చెప్పక్కర్లేదు. అంతా కళ్లముందే కనిపిస్తోంది. డీఆర్‌డీఏ నుంచి సమాచారం తెచ్చుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. అయితే ఉద్యోగాల విషయంలో... ఆ రోజుల్లో కొన్ని ఉల్లంఘనలు నిజమే... 610 జీవో ఉల్లంఘన జరగలేదని నేనట్లేదు. అదెందుకు జరిగిందంటే.. హైదరాబాద్‌కు రావాలనే ఉద్యోగుల తపనవల్ల. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో... 1975 నాటికి ఇంట్లో ఒకరికే ఉద్యోగం ఉండేది.

 

ఎక్కడికి బదిలీ అయినా కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోయేవారు. 1985 నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. 1995 నాటికి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైనవారి సంఖ్య పెరిగిపోయింది. ఇద్దరూ కలిసి ఒకేచోట ఉండాలనుకునేవారికి హైదరాబాద్‌ గమ్యంగా ఉండేది. ఎందుకంటే అలాంటివారికి ఇక్కడ అవకాశాలు అధికం. దీంతో ఉల్లంఘనలు జరిగాయి. భర్త అనంతపురంలోనో, మెదక్‌లోనోఉండి భార్య ఇక్కడ ఉంటే ట్రాన్స్‌ఫర్‌ మీద తెచ్చుకునేవాళ్లు.. ప్రభుత్వాలు కూడా దీన్ని తేలిగ్గా తీసుకున్నాయి.

 

అదే సమస్యగా మారింది. దీనికి సంబంధించి గిర్‌గ్లానీ రిపోర్టే తుది నివేదిక. ఆయన 58 వేల మందిని 610 జీవో ఉల్లంఘనగా చూపారు. జోన్‌-1లో 5 వేలమంది ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అంటే.. అందులో మిగతా ఐదు జోన్లవాళ్లు ఐదువేల మంది ఉన్నారన్నమాట. ఇలా మొత్తం 58 వేల మంది ఎక్కువగా ఉన్నారని తేల్చారు. దీన్ని ఇక్కడ వీళ్లు ఎలా చెబుతున్నారంటే.. ‘తెలంగాణ వాళ్ల 58 వేల ఉద్యోగాలనూ ఆంధ్రావాళ్లు తీసుకుపోయారు’ అని చెబుతున్నారు. ఇంకో మైనస్‌ పాయింట్‌ ఏంటంటే.. ‘‘ఇది తప్పు.. ఇలా కాదు’’ అని ఇటువైపు నుంచి ఎవరూ చెప్పలేదు. ఉద్యోగులూ సీరియస్‌గా తీసుకోలేదు. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని పెట్టి 610 మీద ఉద్యమం చేసిన తర్వాత సీరియస్‌గా తీసుకుని 2008లో వారివారి జోన్‌లకు పంపారు.

 

ఇక్కడ మరుగున పడ్డ విషయం ఏంటంటే.. 5, 6 ఏరియా అంటే తెలంగాణలో ఓపెన్‌ కేటగిరీలో నాన్‌ లోకల్‌ 9 శాతం కంటే ఎక్కువలేరని చాలా స్పష్టంగా చెప్పా రు. ఈ 9 శాతంలో 5లో 6 వాళ్లు, 1, 2, 3 వాళ్లూ ఉన్నారు. కానీ ఇక్కడ పొలిటికల్‌గా చెప్పే వాదన ఏంటంటే.. 5లో ఉన్న 1, 2, 3 వాళ్లు పోవాలి! కానీ 5లో ఉన్న 6 వాళ్లు ఉండొచ్చు. అంటే తెలంగాణవాళ్లు తెలంగాణలో ఉండొచ్చు, ఆంధ్రావాళ్లు పోవాలి అన్నారు. రెండోది అభివృద్ధి.. ఇందులోనూ కొన్ని అబద్ధాలు చెప్పారు.. ‘మా నీళ్లు పోయాయి. మా బొగ్గు పోయింది..’ అని! ఇదంతా కన్విన్సింగ్‌.. అక్కడ కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారు.

 

నిజాలు చెప్పి కాదు. ఆ రోజు తెలంగాణ విషయంలో చెప్పిన అంకె లు, గణాంకాలు ఇప్పుడెక్కడా చెప్పట్లేదు. ఆత్మగౌరవం, స్వీయపాలన అంటున్నారు. కానీ, ఆరోజు ఉద్యమాన్ని నిర్మించడానికి అది పనికొచ్చింది. మిగిలింది 14ఎఫ్‌. దీనిపై మేం సీఎంను స్పష్టంగా అడిగాం. ‘సార్‌ 14ఎఫ్‌ తీసేస్తే మాకన్నా తెలంగాణకే ఎక్కువ నష్టం అని చెప్పాం’. దీనికి ఆయన.. ‘మరి మీరెందుకు మాట్లాడుతున్నారు’ అని అడిగారు. వాళ్ల డిమాండ్స్‌ 14ఎఫ్‌, 610 జీవో ఉల్లంఘనలు.. ఈ రెండిటినీ సెటిల్‌ చేస్తే రాష్ట్రంలో పరిస్థితి కొంత చక్కబడుతుందని సీఎం చెప్పారు. మేమూ కాదనలేకపోయాం. 14ఎఫ్‌ తీసేశారు. 610 ఉల్లంఘనలను చక్కబరిచారు. ఇక ఆర్థికాభివృద్ధి ఏంటనేది శ్రీకృష్ణ కమిషన్‌ చెప్పింది. ఉద్యమానికి పాయింట్‌ ఏం లేదు. కానీ ఇప్పుడు ఆత్మగౌరవం, స్వీయ పాలన అంటున్నారు.



అంటే... ఉద్యోగులకు సంబంధించి అంతా సరిగానే ఉందంటారా?

అదే నేను చెప్పేది. ఇవాళ పొలిటికల్‌ ఫ్యూడలిజం లాంటిది తెలంగాణలో వచ్చింది. ‘ఆంధ్రావాళ్లు బయటకు పోవాలి.. ఆంధ్రావాళ్లను ఇక్కడ నడవనివ్వం’’ ఇలాంటి ప్రకటనలు ప్రజలను కూడా రెచ్చగొడుతున్నాయి. ప్రజలు నాయకులు చెప్పిందే నమ్ముతారు. అదే సమయంలో.. ఇటువైపు (సీమాంధ్ర) నుంచి అంత గట్టిగా ఎవరూ మాట్లాడలేదు.


ఎన్నాళ్లుగానో తెలంగాణ ఉద్యమం జరుగుతోంది. ఆంధ్రా ప్రజలు ఏం జరగబోతోందో ఊహించలేదా? లేక... తెలంగాణ వచ్చేదా పోయేదా? అని అనుకున్నారా?

నా అవగాహన ప్రకారం అది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌. ‘ఏదో వీళ్లు గోల చేస్తారు.. ఇవ్వరులే. మాకు హై కమాండ్‌వద్ద పట్టుంది. అధిష్ఠానానికి నచ్చజెప్పొచ్చులే’ అనుకున్నారు. తెలంగాణ అనుకూల ప్రకటన వస్తోందని మీరు (ఆంధ్రజ్యోతి) జూలై 16-17 నుంచి చెబుతున్నారు. కానీ మాకు జూన్‌ 5-6 తారీకుల్లోనే సంకేతం వచ్చింది. అయితే... మేం ఏదైనా చేయాలంటే ఒక స్పష్టత ఉండాలి. విభజనకు అనుకూలమని చెబితేనే ఆందోళన చేయగలం. ముందే చేయలేం.


సమ్మె కొనసాగిస్తారా?

ఏదో ఒక దశ తర్వాత దీన్ని ముగించాల్సిందే. ఎన్ని రోజులు చేస్తామన్నదాన్ని కాలమే నిర్ణయిస్తుంది. మూడేళ్లపాటు సమ్మెచేసే పరిస్థితయితే ఉండదు. కొంతకాలం తర్వాతైనా ఇది పార్లమెంటు లేదా అసెంబ్లీలో సెటిలవ్వాల్సిందే తప్ప రోడ్డుపై పరిష్కరించేది కాదు.


మీ ఉద్యమం వెనుక స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ చీఫ్‌ మినిస్టర్‌ ఉన్నారని ఆరోపణలున్నాయి..

మేమెప్పుడూ ఆయన సహకారం అడగలేదు. సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు కూడా ‘మీ ఇష్యూ కానప్పుడు మీరెందుకు వెళ్తారు. టీఎన్జీవోలు సమ్మెచేసి జీతాలురాక ఇబ్బంది పడ్డారు. మీరు సమ్మెకు పోవద్దు’ అని సలహా ఇచ్చారు. అయినా, ఒక ప్రభావం కనిపించడానికే సమ్మె నోటీసు ఇచ్చాం.


మీరు సమైక్యాంధ్ర అంటున్నారు కానీ, నా దృష్టిలో కాంగ్రెస్‌ వెనక్కొచ్చే పరిస్థితి లేదు..

కాంగ్రెస్‌ ఒక మైలు దూరం ప్రయాణంలో సెంటీమీటర్‌ ముందుకెళ్తుందేమోగానీ అంతకుమించి పోలేదు. కేబినెట్‌ నోట్‌ వరకూ వెళ్తుంది. అసెంబ్లీలో తీర్మానం వీగిపోతుంది. పార్లమెంటులో కూడా చాలా జాతీయ పార్టీలు రాష్ట్రంలో పరిణామాలపై అసంతృప్తితో ఉన్నాయి. ఒక రాషా్ట్రన్ని విడదీసేటప్పుడు ఏయే విధానాలున్నాయో వాటిని కాంగ్రెస్‌ అనుసరించలేదు. కేవ లం ఎన్నికల దృష్టితోనే ఇలా చేసిందని అనుకుంటున్నాయి. మేం అన్ని పార్టీల నాయకుల్నీ కలిశాం. బీజేపీలో సుష్మాస్వరాజ్‌, ఆడ్వాణీలను కూడా కలిశాం. వాళ్ల అభిప్రాయమూ ఇదే. కచ్చితంగా పార్లమెంట్‌లో దీనికొక డెడ్‌లాక్‌ పడుతుందన్న నమ్మకం నాకుంది.


బీజేపీ కాదంటేనే మీరనుకున్న డెడ్‌లాక్‌ పడుతుంది..

అయ్యుండొచ్చు. మాకు నమ్మకం ఉంది. వాళ్లు చెప్పిందేంటంటే.. ‘మేం మూడు రాషా్ట్రల్ని విడదీసినప్పుడు ప్రజల అంగీకారంతో చేశాం. ఇక్కడ అలాంటిది లేదు. అది తప్పనిసరి’ అన్నారు. సో.. అసెంబ్లీ ఆమోదం లేకపోయినా అధికారాలున్నాయి కదాని కేంద్రం ముందుకెళ్తే అది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. రేపు ప్రతి రాషా్ట్రనికీ ఇలాగే జరిగితే? 2014 ఎన్నికల తర్వాత ఎన్డీయే వచ్చినా దాని సాధకబాధకాలు దానికీ ఉంటాయి. వీటన్నిటి బదులు.. మనమే ఒకచోట కూర్చుని మాట్లాడుకోవాలి. లక్ష ఉద్యోగాలు పోయాయంటున్నారు.. ‘ఇన్ని ఉద్యోగాలు తెలంగాణకు ఇవ్వండి’ అని నోటిఫికేషన్‌ ఇవ్వాలి. 14ఎఫ్‌ తీసేశాం. ఆర్థికాభివృద్ధి ఎక్కడ సాగలేదో చూసి బోర్డువేసి అడ్జస్ట్‌ చేసుకోవాలి.


ఆంధ్రా ప్రాంతంవారు ఓ మెట్టు దిగి హైదరాబాద్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సమ్మతమేననే సంకేతాలు పంపుతున్నారు..

హైదరాబాద్‌ యూటీ చేస్తే మనకు రక్షణ ఉంటుందని చాలామంది అంటున్నారు. అది తప్పు. దీనివల్ల అక్కడున్న ‘నీ’ ఆస్తులు బాగుంటాయి. కానీ, విడిపోయాక నీటి సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? రైతుపోతే పర్వాలేదు.. నా ఆస్తులు బాగుండాలనుకోవడం తప్పు. హైదరాబాద్‌ యూటీ అయితే అక్కడివారికే ప్రయోజనం. కానీ, గుంటూ రు, కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూలు.. జిల్లాలకు నీళ్లు, విద్య, వైద్య సమస్యలుంటాయి.


జూలై 30 నుంచి ఇప్పటిదాకా ప్రయాణంలో మీరు నిరాశపడిన సందర్భాలున్నాయా?

ఏ విషయంలోనైనా ‘దీన్నెలా చేయాలి.. ఇలా చేస్తే ఎలా వస్తుంది..’ అనే అంచనాలో నేనెప్పుడూ విఫలమవలేదు. సభ విషయంలో కూడా చాలామంది నన్ను ఎగతాళి చేశారు. నేను చెప్పాను.. ‘ఇది గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుంది, మీరు రాసుకోండి’ అని.


‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సభ ద్వారా మీరు ఆశించిన ప్రయోజనం నెరవేరిందా?

వందశాతం నెరవేరిందనే అనుకుంటున్నా. ఎందుకంటే.. హైదరాబాద్‌లో తెలంగాణవాదం తప్ప రెండో వాదం చెప్పకూడదన్న మానసిక భయం ఉంది. అంతకుముందు చాలామంది సభలుపెడితే వాళ్లమీద దాడులు, మీడియా సహకారం లేకపోవడం ఉండేది. ఇప్పుడు విభజనపై కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది.

 

వాళ్లు కోరుకున్న డెసిషన్‌ వచ్చాక.. ఎదుటివారికీ వాదన వినిపించే అవకాశమివ్వా లి. అలాకాకుండా.. ‘నా తెలంగాణలో నువ్వు మీటింగ్‌ పెట్టకూడదు’ అనే స్టేట్‌మెంట్‌ చాలా బాధించింది. దీన్ని చాలెంజింగ్‌గా తీసుకున్నాను. మొదట రవీంద్రభారతిలో మా ఉద్యోగుల సభలా పెట్టాలనుకున్నాం. కానీ ప్రకటన వచ్చిన తర్వాత...ఎల్బీ స్టేడియంలో పెట్టాలని నిర్ణయించాం. మొదట15వేలమందితో పెడదామనుకున్నాం. ఆ మేరకు ఆగస్టు 20న ప్రకటించాం.

 

వాళ్లు పోటీ ఆందోళన ప్రకటించారు. దాంతో సభ సక్సెస్‌ అవుతుందని స్పష్టమైంది. వాళ్లు పట్టించుకోకపోయినట్టయితే.. మా మీటింగ్‌కి రావాలని మీడియాను కూడా బతిమాలాల్సి వచ్చేది. కానీ ఘర్షణ జరగడంతో అటువైపు కూడా ‘ఏం సభ ఎందుకు పెట్టుకోకూడదు?’ అనే ఆవేశం వచ్చింది. సభ పెట్టుకోవడానికీ చాలా శ్రమించాల్సి వచ్చింది. మామీద చాలా ఆంక్షలు పెట్టారు. కళాకారుల్ని రానివ్వలేదు. అది బాధ కలిగించింది. సభ తర్వాత మీడియాను అడిగితే.. ‘‘4 నుంచి 5 కోట్ల మంది దీన్ని చూశారు. మాకు తెలిసి ఇంత సుదీర్ఘంగా పదిగంటలపాటు ఏ కార్యక్రమమూ చూడలేదు. ఇటీజ్‌ సూపర్‌ హిట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌’’ అని చెప్పారు.

 

వాళ్లు సభను పట్టించుకోకపోయి ఉంటే ఇంత సక్సెసయ్యేది కాదు. హైదరాబాద్‌లో సభ పెట్టలేం అనే ఫోబియాను ఈ మీటింగ్‌ పోగొట్టింది. కాంగ్రెస్‌ ఇంకా మొండిగా విభజన బిల్లు పెడతానంటే ఆఖరు పోరాటంగా మిలియన్‌ మార్చ్‌ చేస్తాం. పాతిక-ముప్పై మంది నాయకుల కెరీర్‌ కోసమే ఈ ఆందోళనలు. వారిని కూర్చోబెట్టి సెటిల్‌ చేస్తే.. తెలంగాణ, ఆంధ్రాలో రాజకీయ అంగీకారానికి రాగలిగితే సరిపోతుంది. పౌర ఉద్యమం అంతర్యుద్ధంలా మారకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.

 

అయినా... ఈ విద్వేషాలు శాశ్వతంగా ఉండేవి కావు. యాస మాత్రమే వేరు. భాష ఒక్కటే. మనస్తత్వాలూ ఒక్కటే. ఒక నెలపాటు ఆంధ్రప్రదేశ్‌లో చానెళ్లన్నీ ఆపేస్తే జనం ఉద్యమం ఉందన్న విషయమే మర్చిపోతారు. లేదా న్యూస్‌ చానెళ్లన్నీ 30 రోజులు ఒక అగ్రిమెంట్‌కి వచ్చి.. ప్రజలను డిస్టర్బ్‌ చేసే వార్తలు వేయకూడదనుకుంటే శాంతిభద్రతల సమస్యలు చాలావరకూ సెటిలవుతాయి.


రాజకీయ అంశంపై ఉద్యోగులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?

ఇల్లంటుకుంటే ఫైరింజన్‌ వచ్చేదాకా ఆగం. మన దగ్గర చెంబు నీళ్లున్నాయా.. బక్కెట్‌ నీళ్లున్నాయా అని కూడా చూడం. వాటితో మంటలు ఆరకపోవచ్చుగానీ.. ప్రయత్నం చేస్తాం. అదే మేం చేశాం.


మీ సభకు తమ మీటింగ్‌కి వచ్చే డ్రైవర్లంతమంది రాలేదని కేసీఆర్‌ అన్నారు...

ఆయనో రాజకీయనాయకుడు. అసలు ఆయనెప్పుడూ వివాదాస్పదంగానే మాట్లాడతారు. అది ఆయన ప్రతిభ. అలా మనం మాట్లాడాలనుకోవ డం, మాట్లాడటం రెండూ తప్పే. ఓసారి ఈటెల ఏదో తిట్టారు. హరీశ్‌రావు ఏపీ భవన్‌లో ఉద్యోగిని కొట్టారు. నాయకులుగా వారికి తప్పుదిద్దుకునే అవకాశం 100 శాతం ఉంటే.. మాకు సున్నా. ఆ పరిమితుల్ని గుర్తుపెట్టుకోకపోతే ఫెయిలవుతాం.


ఈ యాక్టివిటీలో ఎప్పుడైనా బాగా సంతృప్తిగా అనిపించిందా?

ఒకసారి మేం శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వెళ్తున్నాం. ఆరోజు మేమే బంద్‌ ప్రకటించాం. చాలా మారుమూల కుగ్రామంలో వంటావార్పు చేస్తూ రోడ్లు మూసేశారు. సరే.. మేం వెళ్లగానే నన్ను చూసి వాళ్లే నా దగ్గరకొచ్చారు. నేను పార్వతీపురం వెళ్లాలి దారివ్వమని అడిగా. అప్పుడు 60-70 ఏళ్లున్న ఒక పెద్దాయన వచ్చి.. ‘ఏందయ్యా.. బంద్‌ చేయమని చెప్పి నువ్వే పోతే ఏం న్యాయం?’ అని అడిగారు. అది నా హృదయాన్ని తాకింది. నేను ఆ రోజే అనుకున్నా.. మేం సక్సెస్‌ అని!! నేను ఊహించని ఆ సంఘటన నాకు చాలా సంతృప్తినిచ్చింది.

Updated Date - 2020-02-07T22:30:26+05:30 IST