కారేసుకుని వచ్చి ఆరోగ్యశ్రీ కార్డులు చూపించేవారున్నారు
ABN, First Publish Date - 2020-02-08T00:11:24+05:30
గోపీచంద్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్.. రోగులతో డాక్టర్లకు ఉండాల్సింది మనీ రిలేషన్ కాదనీ, మానవ సంబంధాలని చెబుతున్నారు. తనలా కాకూడదనే తన కూతురిని మెడికల్ చదివించలేదంటున్నారు.
రోగితో కాసేపయినా మాట్లాడాలి.. చేయకపోవడం దారుణం
ఆసుపత్రుల ముందు దేవుడి ప్రతిమలు కాన్ఫిడెన్స్ కోసమే
డాక్టరయ్యాక కొన్నాళ్లు ఫ్రీ సర్వీస్ చేయాలి
ఆ అబ్బాయి తల్లిదండ్రులు 50మందిని మా మీదకి తీసుకొచ్చారు
డాక్టర్లను కించపరుస్తున్నారని ఆ ప్రొడ్యూసర్‌కి చెప్పా
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో హార్ట్ సర్జన్ డాక్టర్. గోపీచంద్
గోపీచంద్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్.. రోగులతో డాక్టర్లకు ఉండాల్సింది మనీ రిలేషన్ కాదనీ, మానవ సంబంధాలని చెబుతున్నారు. తనలా కాకూడదనే తన కూతురిని మెడికల్ చదివించలేదంటున్నారు. డాక్టర్లు చేసే వైద్యంలో తేడా ఉండదనీ, రోగులకు కల్పించే భరోసాలోనే వ్యత్యాసం ఉంటుందంటున్నారు. ప్రభుత్వ ఖర్చుతో డాక్టర్లయ్యాక కనీసం కొన్నాళ్లయినా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలంటున్నారు. సినిమాల్లో డాక్టర్లను చూపించే తీరుతో తమ వృత్తికి కళంకం ఏర్పడుతోందంటున్న గోపీచంద్... 18-07-2016న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమానికి వచ్చి ఎన్నో వ్యక్తిగత, వృత్తి విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాలు..
ఆర్కే : గోపీచంద్‌గారు ఎలా ఉన్నారు?
గోపీచంద్ : బావున్నానండీ.
ఆర్కే : పొద్దున్నుంచి సాయంత్రం వరకు సర్జరీలతో బిజీనా?
గోపీచంద్ : సర్జరీలు చేయడం, పేషెంట్లతో మాట్లాడటం... వీటితోనే గడిచిపోతోంది.
ఆర్కే : రోజుకెన్ని సర్జరీలు చేస్తుంటారు?
గోపీచంద్ : నెలకు 160 వరకు చేస్తుంటాం. యావరేజ్‌గా రోజుకు 6 సర్జరీలుంటాయి.
ఆర్కే : అందుకేనా... డాక్టర్‌గా సక్సెస్ అయితే ఫ్యామిలీ లైఫ్ ఉండదు. సక్సెస్ కాకపోతే మానసిక ప్రశాంతత ఉండదంటారు?
గోపీచంద్ : నిజమే. అందుకే మా కూతురును డాక్టర్ చదివించలేదు. 15 ఏళ్లు చదవడానికే పోతుంది. జాయ్ ఉండదు. అయితే ఛాయిస్‌ను తనకే వదిలేసా.
ఆర్కే : వైద్యరంగంలో ఇది బెస్ట్ పాలసీ అని చెప్పడానికి ఏదీ లేదంటారు కదా?
గోపీచంద్ : అవును. ఉన్నవాట్లో కెనడా సిస్టమ్ బెస్ట్. అక్కడ ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్‌లోనూ సెర్టన్ రూల్స్ ఉంటాయి. వాటిని తప్పక పాటించాల్సిందే. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రైవేటుతో సమానంగా చికిత్సలు లభిస్తాయి.
ఆర్కే : ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు పెట్టిన వారందరికీ పుట్టినిల్లు నిమ్స్ హాస్పిటలేగా?
గోపీచంద్ : అవును. ఒకప్పుడు పేషెంట్స్‌ను ట్రీట్‌మెంట్ కోసం చెన్నై తీసుకెళ్లేవారు. హైదరాబాద్ ఎవరూ తీసుకొచ్చే వారు కాదు. నిమ్స్ వల్లే స్పెషాలిటీస్ డెవలప్ కావడం, క్రిటికల్ కేసులు తీసుకోవడం, ట్రీట్‌మెంట్ అందించడం పెరిగింది.
ఆర్కే : మీకు సాహిత్యంపై అభిరుచి ఎక్కువనుకుంటా. రిలీఫ్ కోసమా?
గోపీచంద్ : చిన్నప్పటి నుంచి ఉంది. ఇంట్లో పుస్తకాలు ఎక్కువగా ఉండేవి. మా అన్నయ్య ప్రభావం కూడా నాపై ఉంది. శ్రీశ్రీ పుస్తకాలు, రావిశాస్త్రి పుస్తకాలను మా అన్నయ్య ఎక్కువ చదివే వారు. వాటిని నేను చదివే వాన్ని. లండన్‌కు వెళ్లడంతో చదవడం తగ్గిపోయింది. తిరిగొచ్చాక మళ్లీ ఆసక్తి మొదలయింది.
ఆర్కే : హార్ట్ స్పెషలిస్ట్ కావడానికి కారణం ఎవరు?
గోపీచంద్ : మా నాన్న ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద చాలా ఉంది. ఆయన మెడికల్ ప్రాక్టీషనర్. చిన్నప్పటి నుంచి నాకు సర్జరీలు చూపించేవారు, నేర్పించే వారు. ఫైనల్ ఇయర్ వచ్చే సరికి సర్జరీలు చేయాలన్న నిర్ణయం బలపడింది. నేను ఫైనల్ ఇయర్ వచ్చే సరికే మా అక్క హార్ట్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు. సడన్‌గా చనిపోయారు. అది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండింది. అయితే లండన్‌కు వెళ్లినపుడు అవకాశం వచ్చింది.
ఆర్కే : గవర్నమెంట్ హాస్పిటల్స్‌పై నమ్మకం పోయింది. దోచుకుంటారని తెలిసినా ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళుతున్నారు. ఈ రెండు కరెక్ట్ కాదు కదా?
గోపీచంద్ : కాదు. మార్చాల్సిన అవసరం ఉంది. మొన్న ఒకతను అడిగాడు. ఇంతమంది సీనియర్ డాక్టర్లున్నారు. పేషెంట్లు వాళ్లను నేరుగా వచ్చి కలుసుకోలేకపోతున్నారు. తెలిసిన వారెవరితోనైనా ఫోన్ చేయిస్తే బాగా చూస్తాడని అనుకుంటున్నారు. అలా ఎందుకు అడగాలి. అలాకాకుండా ఒక పేషెంట్ నేరుగా వెళ్లి సీనియర్ డాక్టర్‌ను కలిసే అవకాశం ఎందుకు దొరకడం లేదు. అలాంటి సిస్టమ్ ఎందుకు డెవలప్ కావడం లేదు అని ప్రశ్నించాడు. ఇది చాలా వ్యాలీడ్ పాయింట్.
ఆర్కే : డాక్టర్ చదవడానికి ప్రభుత్వం కొన్ని లక్షలు ఖర్చు చేస్తుంది. అలాంటి వ్యక్తి డాక్టరయ్యాక కొంతమందికి ఫ్రీ సర్వీస్ చేయవచ్చు కదా?
గోపీచంద్ : తప్పకుండా చేయాలి. మానవత్వం ఉన్న మనిషిగా తప్పకుండా చేయాలి. వేరే వాళ్ల గురించి తెలియదు. మా హాస్పిటల్స్‌లో మాత్రం చేస్తున్నాం. చిన్న పిల్లలకు ఆపరేషన్స్ చేస్తున్నాం. భరించలేని వారికి మినహాయింపునిస్తున్నాం.
ఆర్కే : అవసరం లేకపోయినా సిజేరియన్ చేయడం, ఆపెండిసైటిస్ చేయడం వంటివి ఈ మధ్యకాలంలో చూశాం. కార్పొరేట్ ఆసుపత్రులకు రెఫర్ చేసే వైద్యులకు కమీషన్ ఇస్తున్నారన్న వార్తలున్నాయి. నిజమెంత?
గోపీచంద్ : ఇందాకే చెప్పాను. వైద్యుల్లో కూడా అన్ని రకాల మనుషులున్నారు. ఒక్క డాక్టర్ తప్పు చేస్తే ఈ డాక్టర్లందరూ అని అంటారు. డాక్టర్‌పైన నమ్మకంతో వెళతారు. ఆ నమ్మకంతోనే డాక్టర్ చెప్పింది వినాల్సి వస్తుంది. రూమర్స్ అయితే ఉన్నాయి. నేను సమర్థించడం లేదు. తిట్టడం లేదు.
ఆర్కే : ఇంగ్లండ్ నుంచి వెనక్కి రావడానికి ప్రేరణ ఏంటి?
గోపీచంద్ : మా పేరెంట్స్ దగ్గర స్పెండ్ చేయాలన్నది నా కోరిక. కొంత సోషల్‌వర్క్ చేయాలని కూడా ఉండేది. ముందు జమైకా వెళ్లినపుడు నాకు మన దేశం విలువ ఏంటో తెలిసి వచ్చింది. ఇంగ్లండ్ వెళ్లినపుడు ఎలాగైనా సరే ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని అనుకున్నా.
ఆర్కే : ఒక పేషెంట్ వస్తే ముఖం కూడా చూడకుండా ఈ పరీక్షలన్నీ చేయించుకురా అని రాసే డాక్టర్లున్నారు. ఇది ఎంత వరకు సమర్థనీయం?
గోపీచంద్ : అస్సలు కాదు. ఊరినుంచి ఎంతో ఆందోళనతో బయలుదేరి ఆసుపత్రికి వస్తారు. ఆలస్యమైతే డాక్టర్ దొరకరని ఒక గంట ముందే వచ్చి కూర్చుంటారు. అలాంటి వ్యక్తికి కొంత సంతృప్తి కోసమైనా కాసేపు మాట్లాడాలి. ఎందుకు ఆందోళన చెందుతున్నావని అడగాలి. అవన్నీ చేయకుపోవడం దారుణం. ఈ విషయం మా కొలీగ్స్‌తో కూడా చెబుతుంటాను.
ఆర్కే: ఎంత చదువులు చదివినా మీ దగ్గర నిరక్షరాస్యులే కదా? మీరేం చెబితే అది నమ్మాలి..
గోపీచంద్: ఇందులో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మమ్మల్ని వారు నమ్ముతారు కాబట్టి సరైన ట్రీట్‌మెంట్ ఇస్తే మమ్మల్ని దేవుడిలా చూస్తారు. డిసట్వాంటేజ్ ఏంటంటే మా మీద సైకలాజికల్ ప్రెజర్ ఉంటుంది.
ఆర్కే: మీ హస్తవాసి మంచిదనే నమ్మకంతో మీదగ్గరికి వస్తారు కదా..
గోపీచంద్: ప్రజల నమ్మకమది. డాక్టరు ఐదు నిమిషాలు పేషెంట్‌తో మాట్లాడాలి. ‘ఫలానా సమస్య ఉంది. భయపడకండి’ అంటే చాలు వారికి సగం జబ్బు తగ్గిపోతుంది. దాన్ని హస్తవాసి అనండీ, ఓపిక అనండీ.. మరేదైనా అనండి.
ఆర్కే: కార్పొరేట్ హాస్పిటల్స్ బయట గుళ్లు ఉన్నాయి ఎందుకు?
గోపీచంద్: విదేశాల్లోని ఆసుపత్రుల్లో కూడా ఈ కల్చర్ ఎక్కువ. అక్కడ శిలువ ఉంటుంది. మా ఆసుపత్రి ముందు వినాయకుడి ప్రతిమ ఉంటుంది. భక్తుడా లేదా అనేది వదిలేస్తే దేవుని ప్రతిమలు చూడగానే ప్రజల్లో డివైన్ కాన్ఫిడెన్స్ వస్తుందనేది నిజం.
ఆర్కే: ప్రవేట్ హాస్పిటల్స్‌లో పనిచేసి సొంత హాస్పిటల్ పెట్టారెందుకు?
గోపీచంద్: నేను ప్రొఫెషన్ తప్ప.. కమర్షియల్‌గా ఏనాడు ఆలోచించలేదు. బిజినెస్‌లోకి రావాలనుకోలేదు. పిల్లలకు సేవ చేయాలనుకున్నాను. స్నేహితుల ప్రోత్సాహం, రెండు సంవత్సరాల డిస్కషన్ తర్వాత అకౌంటబుల్‌గా పని చేయాలని 2005 సంవత్సరంలో హృదయఫౌండేషన్ ప్రారంభించాను. అందులో ఖచ్చితంగా ఓ ఆపరేషన్ థియేటర్, ఐదు బెడ్స్ కేవలం చిన్న పిల్లలకే కేటాయించాం. ఆపరేషన్స్ ఉన్నా, లేకపోయినా పిల్లలకోసం అవి కేటాయించాల్సిందే. ఆ కంట్రోల్ కోసమే హాస్పటల్‌ను ప్రారంభించాల్సి వచ్చింది. నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా స్నేహితులే కారణం.
ఆర్కే: వారిని ఎలా పాజిటివ్‌గా టర్న్ చేయగలిగారు..
గోపీచంద్: నాకంటే కాజ్ ఇక్కడ ముఖ్యం. అన్నీ ట్రాన్ప్‌పరెంట్‌గా ఉంటాయి. ఇవాళ సరైన సిస్టమ్ చూపిస్తే డబ్బులకు కొదేవే లేదని మా హృదయఫౌండేషన్ ట్రస్టీ యుగంధర్ చెబుతుంటారు. అది నిజం.
ఆర్కే: సంవత్సరానికి ఎంత సొమ్ము ఖర్చుపెడతారు?
గోపీచంద్: ఫౌండేషన్ మీద మూడు నుంచి నాలుగుకోట్లు ఖర్చుపెడతాం. గవర్నమెంట్‌వారి ఆరోగ్యశ్రీ పథకం కింద నిధులు వస్తాయి.
ఆర్కే: ఆరోగ్యశ్రీ మీద కంప్లెయింట్స్ ఉన్నాయి కదా..
గోపీచంద్: అనర్హులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు. అది సిస్టమ్ ప్రాబ్లమ్. కారేసుకుని వచ్చి ఆరోగ్యశ్రీ కార్డులు చూపించేవారున్నారు. తెలిసినా మనం చేయగలిగిందేం లేదు. ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం. మారుమూల గ్రామాల్లోని ప్రజలు ధైర్యంగా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని ఆసుపత్రికి వచ్చి ఆపరేషన్స్ చేయించుకుని వెళ్తున్నారు.
ఆర్కే: ప్రభుత్వ ఆసుపత్రిల్లో సదుపాయాలు లేకపోవటంతో ప్రజలు ప్రయివేట్ ఆసుపత్రిలకు వస్తున్నారు..
గోపీచంద్: దీన్ని బ్యాలెన్స్‌డుగా చూడాలి. సపరేట్ కోణాల్లో చూసి బాగా అధ్యయనం చేయాలి. ఒకేచోట ప్రభుత్వం పెద్ద ఆసుపత్రి కట్టకుండా, నాలుగు మూలల్లో పెద్ద ఆసుపత్రులు కట్టి మంచి డాక్టర్లను తీసుకోవాలి. హైదరాబాద్ జనాభా నలభై లక్షలు ఉన్నప్పుడు అదే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కోటి జనాభా వచ్చినా అదే ఉంటే ఇబ్బంది వస్తుంది.
ఆర్కే: గవర్నమెంట్ ఆసుపత్రిల్లో పనిచేసేవారు జీతాలు వస్తున్నాయి కదా అనుకుంటారు.. ప్రయివేట్ ఆసుపత్రిల్లోని వారు ఆసుపత్రి బావుంది కదా అనుకుంటారు. ఈ సమస్యకు సొల్యూషన్ ఉందా?
గోపీచంద్: పదిమంది కూర్చుని గైడ్‌లెన్స్ ఇవ్వాలి. అధ్యయనం చేయాలి. మన హైదరాబాద్ జనాభాకు తగినట్లు.. నాలుగు మూలల్లో హాస్పిటల్స్ ఉండాలి. ముఖ్యమంత్రి కేసీయార్‌గారు ఇవి కట్టిస్తున్నారు. గ్రేట్ ఐడియా. అలా చేయకపోతే ఈ ట్రాఫిక్‌లో గోల్డెన్ హవర్‌లో ఆసుపత్రికి పేషెంట్‌ను చేర్చటం కష్టం.
ఆర్కే: ఆంబులెన్స్‌కే దారి ఇవ్వట్లేదు కదా..
గోపీచంద్: సైరన్ కొడుతున్నా దారి ఇవ్వరు.
ఆర్కే: బాధ్యత లేదు. నేను మాత్రమే బావుండాలి అనుకునేవారెక్కువ..
గోపీచంద్: తాను ఉత్తమ, మిగతావాడు మధ్యమ అనేవారు ఎక్కువ ఉన్నారు. మనకు బెంజ్, ఆడికార్లు వచ్చాయి. దాన్ని ఎలా వాడాలో తెలీదు. సివిక్ రెస్పాన్స్ ఖచ్చితంగా ఉండాలి. జర్మనీలో ఆంబులెన్స్ సైరన్ ఇవ్వగానే కార్లన్నీ పక్కకు వెళ్లిపోతాయి. క్షణాల్లో బుల్డోజర్ వెళ్తేంత స్పేస్ మెయిన్‌రోడ్‌లో కనిపిస్తుంది. అలాంటి కల్చర్ మనకు రావాలి. అది ఆటోమేటిక్‌గా వస్తుందా, సిస్టమ్ పెట్టాలా అనేది ఆలోచిస్తే మంచిది.
ఆర్కే: కార్పొరేట్ హాస్పిటల్స్ ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు చేయకూడదు..
గోపీచంద్: ఇది మంచి ఆలోచన. తప్పకుండా చేయవచ్చు.
ఆర్కే: మీకు వచ్చిన చాలెంజింగ్స్..
గోపీచంద్: బేసిక్‌గా హార్ట్ అనేదే చాలెంజ్. అందులోనే మల్టిపుల్ సమస్యలు ఉండటం, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ ఉండేవారు మా దగ్గరికి కామన్‌గా వస్తుంటారు. మాకు సంతోషాన్నిచ్చేది చిన్న పిల్లలే. పాలు తాగకుండా ఉండే పిల్లలు ఆపరేషన్ తర్వాత పాలు తాగటం, గెంతుతూ ఉండటం చూస్తే సంతోషంగా ఉంటుంది. ఏలూరులో ఉండే తొంభైరెండు ఏళ్ల రైతు గుండె ఆపరేషన్ కోసం నా దగ్గరికొచ్చాడు. ఇబ్బందేమో అంటే.. ‘ఏం ఫర్లేదు.. త్వరగా ఆపరేషన్ చేయండి. ఇంటికెళ్లి వ్యవసాయం చేసుకోవాలి’ అన్నారు. ఆపరేషన్ తర్వాత కేవలం వారంలో హుషారయ్యారు.
ఆర్కే: స్టంట్ లైఫ్ ఎన్నాళ్లు ఉంటుంది?
గోపీచంద్: లైఫ్ లాంగ్ ఉంటుంది. మన శరీరం రియాక్షన్‌ను బట్టి అక్కడ కండరం పెరుగుతుంది. స్టంట్ మాత్రం అలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు మరో స్టంట్ వేయవచ్చు, బెలూన్ వేయచ్చు లేకుంటే బైపాస్ సర్జరీ చేయచ్చు. ఇలా నాలుగు రకాల ట్రీట్‌మెంట్స్ ఉంటాయి.
ఆర్కే: ఆపరేషన్ తర్వాత ఎక్కువ సంవత్సరాలు బతికిన వారు ఎంతమంది ఉన్నారు.
గోపీచంద్: అక్కినేని నాగేశ్వర్రావు గారు గుండె ఆపరేషన్ తర్వాత ముఫ్పయి ఏళ్లకు పైగా బతికారు. లాంగివిటీ అనేది మన లైఫ్‌స్టయిల్ మీద ఆధారపడి ఉంటుంది.
ఆర్కే: పేషంట్స్ ఎలాంటి వారుంటారు..
గోపీచంద్: చాలామంది ఆపరేషన్ తర్వాత నిలబడొచ్చా, దగ్గొచ్చా.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. కంప్లీట్‌గా వారు వేరే లూప్‌లోకి వెళ్తారు. కొందరైతే వారం గడిచిన తర్వాతనే ఐరన్‌బాడీ అని అంటూ ఇంటికి వెళ్లిపోతారు. చిన్న పిల్లల తల్లిదండ్రులైతే ‘చిన్నపిల్లాడికి బాధ కదా’ అంటుంటారు. అలాంటివారితో మాట్లాడి ఆపరేషన్ చేస్తాం. ప్రతిరోజూ కొత్త కొత్త సైకలాజికల్ సమస్యలు చూస్తుంటాం.
ఆర్కే: మీకు బిట్టర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా?
గోపీచంద్: చాలా సంవత్సరాలనుంచి సమస్య ఉన్నా ఆపరేషన్ చేయించుకోని పిల్లల్ని బ్లూబేబీస్ అని పిలుస్తారు. అలాంటి అలాంటి పరిస్థితిల్లో ఉండే పధ్నాలుగేళ్ల పిల్లాడిని చివర్లో ఆసుపత్రికి తీసుకొచ్చి.. ‘ఎలాగైనా ఆపరేషన్ చేయండి, బతికించండి’ అన్నారు. ఆ సమయంలో వారికి డబ్బులు లేవు. మా ఫౌండేషన్‌లో ఆపరేషన్ చేయటానికి రెడీ అయ్యాం. ఆపరేషన్‌కు ప్రిపేర్ అవుతుంటే.. గుండె ఆగి ఆ పిల్లవాడు చనిపోయాడు. మాకేం చెప్పలేదని ఆ అబ్బాయి తల్లిదండ్రులు యాభైమందిని మా మీదకి తీసుకొచ్చారు.
ఆర్కే: డైరక్ట్‌గా హాస్పిటల్‌మీదకు ఎందుకు వస్తున్నారు..
గోపీచంద్: సైకలాజికల్‌గా ప్రయివేట్ ఆసుపత్రులు ఇలా చేస్తున్నారని వారి మనసులో ఉంది. అందుకే ఆసుపత్రిలమీదకు రావడం, రాళ్లు విసరడం చేస్తున్నారు.
ఆర్కే: మీ యాంబిషన్ ఏంటి..
గోపీచంద్: పిల్లలకోసం పీడియాట్రిక్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించాలి. అక్కడ రీసెర్చ్‌లతో పాటు పిల్లల జబ్బులకు సంబంధించిన అవేర్‌నెస్ కలిగించాలి. సంవత్సరానికి వెయ్యి ఆపరేషన్స్ చేయాలి. ఫ్యూచర్ హార్ట్‌స్పెషలిస్ట్‌లకు ట్రైనింగ్ ఇవ్వాలి.
************************************************
పేషెంట్ వచ్చినపుడు డాక్టరు కనీసం ఐదు నిమిషాలైనా మాట్లాడాలి. మనం ఏదైనా హోటల్‌కు వెళ్లినపుడు ఓ ఐదు నిమిషాలు మనతో ఎవరూ మాట్లాడకపోతే అన్‌కంఫర్ట్‌గా ఫీలవుతాం కదా.
ఆపరేషన్ తర్వాత కూడా పాత లైఫ్‌స్టయిల్‌నే కంటిన్యూ చేస్తే ఎవరేం చేయగలరు. మేం గైడ్‌లైన్స్ ఇస్తాం. దాన్ని క్రమశిక్షణతో ఫాలో అవ్వాలి.
కాలేజీ రోజుల్లో మా గ్యాంగ్‌లో తొమ్మిదిమందిమి ఉండేవారం. పెద్దగా తెలివైన విద్యార్థులం కాదు. హాస్టల్‌లో గొడవలు చేసేవాళ్లం. సరిగా చదవకుండా గాలికి తిరగడం వల్ల మా వైపు ఏ అమ్మాయి చూసేది కాదు(నవ్వులు). నా స్నేహితుడు అల్లు అరవింద్ ఓసారి మాటల్లో.. ‘గాలి బ్యాచ్ మేనేజ్‌మెంట్ పీపుల్. వీరిలో మంచి స్కిల్స్ ఉంటాయి. బాగా చదివేవారు రిస్క్ చేయలేరు’ అన్నారు.
కన్సెషన్ గురించి ఎక్కువ అడిగేది డబ్బున్న వాళ్లే. జనరల్ వార్డులో ఉండే వారు తగ్గించమని ఎప్పుడూ అడగరు. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి రాయితీలు లేవు.
హాస్పిటల్‌కు వచ్చే వారు ఎంతో ఆశతో వస్తారు. దాంతో డాక్టర్స్‌పై ప్రెషర్ కూడా పెరిగిపోయింది.
చనిపోయిన వారిని వెంటిలేటర్ మీద ఉంచి డబ్బులు గుంజడం సినిమాలో చూశాను. ఆ ప్రొడ్యూసర్ కూడా నాకు మంచి మిత్రుడు. వాళ్లకు కూడా చెప్పాను. అలాంటివి చూపించడం వల్ల వైద్యవృత్తిని కించపరుస్తున్నారు. దానివల్ల సొసైటీలో ఒకరకమైన నష్టం ఏర్పడుతుంది. నెగెటివిటీని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఒకరకమైన అపనమ్మకం ఏర్పడుతుంది.
డాక్టర్ ఉన్న వ్యాధి గురించి తక్కువ చెప్పొచ్చు లేక ఎక్కువ చెప్పొచ్చు. తనకున్న నాలెడ్జ్ వల్ల ట్రీట్‌మెంట్ సరిగ్గా చేయకపోవచ్చు. అంతేకానీ లేని జబ్బును ఉన్నట్లుగా చెప్పరు. ఆ అవసరం ఉండదు కూడా.
గతంలో డాక్టర్ వృత్తిని సర్వీస్ గానే చూసే వారు. వ్యాపారంగా చూసే వారు కాదు. ఎంతిస్తే అంత తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే ఇందులో మరో అంశం ఉంది. ఒకప్పుడు హార్ట్‌ఎటాక్ వస్తే బతికేవారు కాదు. కానీ ఇప్పుడు మంచి ఎక్విప్‌మెంట్ ఉంది. అలాంటి ఎక్విప్‌మెంట్‌తో చికిత్స లభించాలంటే డబ్బులు చెల్లించకతప్పదు. దాన్ని వ్యాపారం అన్నా, మరొకటి అన్నా తప్పులేదు.
Updated Date - 2020-02-08T00:11:24+05:30 IST