అధికార పార్టీ కార్యకర్త వచ్చినా కలెక్టర్లు లేచి నిలబడాల్సి వస్తోంది
ABN , First Publish Date - 2020-02-08T00:33:15+05:30 IST
కలెక్టర్‌గా పనిచేసినా, కమిషనర్‌గా విధులు నిర్వర్తించినా ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి జనార్దనరెడ్డి. ఎక్కడ పనిచేసినా హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అని పేరు తెచ్చుకునే జనార్దనరెడ్డి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ తనదైన ముద్ర వేస్తున్నారు.
ఆరుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఉన్నా..
ఎక్కువ పని చేస్తాం.. ఎక్కువ తిట్లు తింటాం
‘సివిల్స్’ లక్ష్యం.. 9వ తరగతిలోనే డైరీలో రాసుకున్నా
కారు, బంగళాతోపాటు మంచి జీతం ఇస్తానన్నా ఉద్యోగం మానేశా
అనుకున్నది సాధించలేకపోతే మీ దగ్గరకే వస్తా అని ఆయనకు చెప్పా
ఇంతవరకూ ఫ్యామిలీతో ఒక్కసారి కూడా ఫారిన్ వెళ్లలేదు
11 ఏళ్లలో 6 సార్లే సెలవు పెట్టా.. నా భార్యకు రోజూ థ్యాంక్స్ చెబుతా
ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దనరెడ్డి
కలెక్టర్‌గా పనిచేసినా, కమిషనర్‌గా విధులు నిర్వర్తించినా ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి జనార్దనరెడ్డి. ఎక్కడ పనిచేసినా హానెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ అని పేరు తెచ్చుకునే జనార్దనరెడ్డి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ తనదైన ముద్ర వేస్తున్నారు. పని చేసే విభాగం ఏదైనా.. సేవ చేసే అవకాశం ఉంటేనే మేలని అంటున్న ఆయన 08-10-2017న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో సంభాషించారు..
ఆర్కే: నమస్తే జనార్దన రెడ్డి గారూ.. వెల్‌కమ్ టూ ఓపెన్ హార్ట్
జనార్దనరెడ్డి: స్వచ్ఛ నమస్కారం
ఆర్కే: మీరు జీహెచ్‌ఎంసీకి వచ్చి రెండేళ్లు పూర్తయింది కదా.. మీకు మెయిన్ చాలెంజ్ ఏదని భావిస్తున్నారు?
జనార్దనరెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 9 నెలలపాటు 7 శాఖలకు అధిపతిగా చేశాను. అన్నింటి కంటే చాలా కష్టమైనది మునిసిపల్ కమిషనర్ జాబ్. ఇది థ్యాంక్‌లెస్ జాబ్. హౌస్‌వైఫ్ జాబ్ ఎంత కఠినమో, ఎంత థ్యాంక్ లెస్సో జీహెచ్‌ఎంసీ బాధ్యతలు చేపట్టాక తెలిసింది. అందుకే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా జాయిన్ అయ్యాక రోజూ నా భార్యకు థ్యాంక్స్ చెబుతున్నాను(నవ్వుతూ..) అన్నింటి కంటే.. ఎక్కువ తిట్లు తింటూ, ఎక్కువ పనిచేస్తూ, ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉన్నటువంటి చాలా టఫెస్ట్ జాబ్ ఇది. .
ఆర్కే: మీకు హానెస్ట్‌తోపాటు హార్డ్ వర్కర్ అని పేరుంది. ఇంటినీ పట్టించుకోకుండా గొడ్డు చాకిరీ చేస్తారని పేరుంది కదా?
జనార్దనరెడ్డి: నేను 3వ తరగతి నుంచి ఎంఎస్సీ వరకు కేవలం ఐదు సార్లే గైర్హాజరయ్యాను. ఉద్యోగంలో 1990లో చేరాను. 2001 వరకు ఆరు సార్లే సెలవు పెట్టాను. శని, ఆదివారాలు కూడా పనిచేశాను. ఆఫీసుకు లేటుగా వెళ్లినా, ముందుగా ఇంటికి వచ్చేసినా ఏదోలా ఉంటుంది. ఈ ఉద్యోగంలో చేరక ముందు హెచరీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం చేశాను. అక్కడ మానేద్దాం అనుకునే సమయంలో మా ఎండీ నన్ను పిలిచారు. మా దగ్గర కొనసాగితే కారు, బంగళాతోపాటు మంచి జీతం ఇస్తాం అన్నారు. ఆ మరుసటి రోజే నేను ఉద్యోగం మానేశాను. ఎందుకు మానేశారు అని మా ఎండీ అడిగితే.. జీవితాంతం ఇలాంటి ఉద్యోగం చేయలేను అని చెప్పేశాను. రెండేళ్లు సివిల్ సర్వీసెస్‌కి ప్రయత్నిస్తాను. ఒకవేళ సివిల్స్ ఎంపిక కాకపోతే మళ్లీ మీ దగ్గరకే వచ్చి చేరతా అని చెప్పేసి వచ్చేశా.
ఆర్కే: సివిల్స్ సాధించాలన్న ఇన్‌స్పిరేషన్ ఎలా కలిగింది?
జనార్దనరెడ్డి: నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు ఓ సైన్స్ ఫెయిర్‌కు హాజరయ్యా. అక్కడికి చీఫ్ గెస్ట్‌గా మా జిల్లా కలెక్టర్ వచ్చారు. ఆయన దర్పం, అందరూ ఆయనను గౌరవించే విధానం నచ్చింది. ఎప్పటికైనా కలెక్టర్ కావాలని నిర్ణయించుకొని అప్పుడే డైరీలో రాసుకున్నాను.
ఆర్కే: 30 ఏళ్ల కిత్రం కలెక్టర్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవారు. ఇవాళ కలెక్టర్లంటే కనీసం అధికార పార్టీ కార్యకర్త వచ్చినా లేచి నిలబడే పరిస్థితి ఉంది. ఒకవిధంగా ఇది పతనమే కదా?
జనార్దనరెడ్డి: నిజమే. ఈ విషయంలో ఇంటర్నల్ ఇంట్రాస్పెక్షన్ జరగాలి.
ఆర్కే: మొత్తం ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారా?
జనార్దనరెడ్డి: విజయభాస్కర్‌రెడ్డి హయాం నుంచి పనిచేస్తున్నాను. చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద పనిచేశాను.
ఆర్కే: ఏ ముఖ్యమంత్రితో మీకు కంఫర్ట్‌గా అనిపించింది?
జనార్దనరెడ్డి: అందరితోనూ కంఫర్ట్‌గానే ఉండేది. అందరూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడైనా ఎవరు చెప్పిన పనైనా చేయలేకపోతే కారణం వెంటనే చెప్పేసేవాడిని.
ఆర్కే: చాలా మంది ఐఏఎస్‌లు.. కలెక్టర్లుగా ఉన్నప్పుడున్నంత కంఫర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి వెళ్లినప్పుడు ఉండదు అంటుంటారు? మీకూ అలానే అనిపించిందా?
జనార్దనరెడ్డి: అన్ని పోస్టులనూ ఎంజాయ్ చేశాను. ప్రజలకు సేవ చేసే పోస్టులో కొనసాగినప్పుడు మరింత ఆనందించేవాడిని.
ఆర్కే: చిన్నస్థాయి ఉద్యోగులు తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తారు. ఐఏఎస్‌ల విషయంలో ఎందుకలా జరగదు ?
జనార్దనరెడ్డి: ఉన్నత స్థాయిలో ఉన్నవారికి కొంత కంఫర్ట్ ఇవ్వాలి. అలా అని తప్పు చేసిన వారిని వదిలి పెట్టకూడదు.
ఆర్కే: వెస్టర్న్ దేశాల్లో రోడ్ల మీద చిన్న కాగితం వేయాలంటేనే భయపడతారు. అక్కడ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఆ నిబంధన ఉన్నా పాటించరేం?
జనార్దనరెడ్డి: దీని కోసం ప్రత్యేక యాప్ తయారుచేశాం. ఎక్కడ తనిఖీ చేసినా బృందంలా వెళ్లేలా చర్యలు తీసుకున్నాం. హోటళ్లలో కిచెన్ నీట్‌గా పెట్టుకోనివారికి కొంత, రోడ్డు పక్కనే తినుబండారాలు వేస్తున్నవారికి కొంత జరిమానా విధిస్తున్నాం.
ఆర్కే: పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఉద్యోగమే కదా.. ఇంట్లో తిట్లు తింటుంటారా..?
జనార్దనరెడ్డి: ఇంట్లో వాళ్లు అలవాటు పడిపోయారు. నాకు తిట్లేం పడలేదు గానీ.. సంవత్సరం నుంచి నాతో ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడావా అని ఓసారి నా భార్య అడిగింది. ‘రాత్రి పదకొండుకో, పన్నెండుకో వస్తావు.. ఫైల్స్ చూస్తావు, వాట్సాప్ చూస్తావు, మళ్లీ ఉదయం లేచాక ఆఫీసుకు వెళ్లిపోతావు.. నాతో అసలు ఎప్పుడు మాట్లాడుతున్నావు’ అని అడిగింది. అప్పుడు చాలా సీరియ్‌సగా ఆలోచించాను. అప్పటి నుంచి రియలైజ్ అయ్యాను. అలా అని కుటుంబానికి టైమ్ కేటాయించలేకపోతున్నాను. ఇంతవరకూ ఫ్యామిలీతో ఒక్కసారి కూడా ఫారిన్ వెళ్లలేదు.
ఆర్కే: మీ పిల్లల గురించి చెప్పండి?
జనార్దనరెడ్డి: ఒక పాప, బాబు. ఇద్దరూ ఇంజనీర్లు. డెలాయిట్‌లో ఉద్యోగం చేసేవారు. జాబ్‌కు రిజైన్ చేసేశారు. బాబు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. పాప ఎంబీఏ చేస్తోంది.
ఆర్కే: మరో నాలుగేళ్లలో రిటైరైపోతున్నారు కదా? ప్లానింగ్ ఏంటి?
జనార్దనరెడ్డి: ఎడ్యుకేషన్ సెక్టార్‌లో పనిచేయాలని అనుకుంటున్నాను.
ఆర్కే: హైదరాబాద్ అంతా వానలు ముంచెత్తుతున్నాయి. ఎప్పుడు వర్షం పడినా గుండెల్లో మీకు దడ ఉంటుందేమో?
జనార్దనరెడ్డి: నేను అనంతపురంలో పనిచేసినప్పుడు వర్షం పడితే రాత్రంతా వరండాలో కూర్చొని ఆనందించేవాడిని. ఇప్పుడు మేఘం చూస్తే భయమేస్తోంది.
ఆర్కే: వర్షాకాలం వస్తే హైదరాబాద్‌కు ఈ దుస్థితి తప్పడం లేదు. దీనికి మోక్షం ఉందా?
జనార్దనరెడ్డి: నగరంలో వాన కురిస్తే ఇబ్బందులు ఎదురవుతున్న 400 ప్రదేశాలను, 126 కాలనీలను గుర్తించాం. ఇందులో 200 ప్రదేశాల్లో వర్షం పడినప్పుడు తాత్కాలిక పద్ధతిన ఐదుపది నిమిషాల్లో వర్షం నీటిని క్లియర్ చేస్తున్నాం. మాన్‌సూన్ టీమ్స్‌ను పెట్టి 24 గంటలూ మానిటర్ చేస్తున్నాం. వెంగళరావు పార్కు ఆ రోజుల్లో చెరువులా ఉండేది. అక్కడ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. మోడల్ హౌస్ వరకు ఉన్న పైప్‌ను వైడనింగ్ చేయాల్సి ఉంది. గంటకు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే ఏ నగరానికైనా ఇబ్బందులు తప్పవు.
ఆర్కే: ముంబై లాంటి నగరాల్లో 10 సెంటీమీటర్ల వర్షం పడినా ముంపునకు గురవదు. హైదరాబాద్‌లోని ఓల్ సిటీ ప్రాంతంలో కూడా ఇటువంటి సమస్య కనబడదు. మరి అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థ నగరంలోని మిగతా ప్రాంతాల్లో లేదా?
జనార్దనరెడ్డి: 9000 కిలోమీటర్ల రోడ్డుంటే 1500 కిలోమీటర్ల మేర రెయిన్ వాటర్ డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. కనీసం 60 శాతం మేర అయినా డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతానికి ప్రతిపాదనలైతే ఉన్నాయి. కానీ ఇది భారీ ఖర్చుతో కూడుకున్న పని.
ఆర్కే: నగరానికి రూ.లక్ష కోట్లు సమకూర్చడం సాధ్యమేనా? రాష్ట్ర బడ్జెట్టే రూ.లక్ష కోట్లు కదా..
జనార్దన రెడ్డి: నిజంగా చాలెంజే. నిధులు సమకూర్చుకోవాలి లేదా అప్పు చేయాలి లేదంటే ఈ సమస్యలను ఎదుర్కొవాలి. మరో ప్రత్యామ్నాయం లేదు.
ఆర్కే: లక్ష కోట్లతో ఈ సమస్యను పరిష్కరిస్తామని ఇటీవల మంత్రి చెప్పారు కదా.. సాధ్యమేనా?
జనార్దనరెడ్డి: ఈషర్ అహ్లువాలియా నేతృత్వంలో 2011లో జాతీయ స్థాయిలో ఇందుకు సంబంధించి ఎస్టిమేషన్ వేశారు. మొత్తం రూ.33 లక్షల కోట్లు అవసరం అని లెక్కతేల్చారు. సివరేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ట్రాఫిక్ మొబిలిటీకి రూ.29 వేల కోట్లు అవసరమని 2008లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం అంచనా వేసింది. కానీ ఇవన్నీ మెథాడికల్‌గా చేయాలి. నిధులు ఎలాగైనా సమకూర్చుకోగలమన్న నమ్మకం ఉంది.
ఆర్కే: జీహెచ్‌ఎంసీ బ్రీడింగ్ సెంటర్ ఫర్ కరప్షన్‌గా తయారైంది. మొన్న ఏసీబీకి దొరికిన రఘూ కూడా జీహెచ్‌ఎంసీలో చేశారు కదా?
జనార్దనరెడ్డి: కరెప్షన్ చేసే అధికారులు అన్ని శాఖల్లోనూ ఉంటారు. మునిసిపాలిటీల్లో స్ర్కూటినీ ఎక్కువ. అందుకే ఎక్కువమంది పట్టుబడుతున్నారు.
ఆర్కే: దీనిని సింప్లిఫై చేయలేరా?
జనార్దనరెడ్డి: ఇంటి దగ్గర నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఇస్తున్నాం. బిల్డింగ్ లైసెన్సుల విషయంలో కరప్షన్ ఎక్కువగా ఉంటుందన్న విమర్శలున్నందున ఇది కూడా ఆన్‌లైన్ చేశాం. ఆన్‌లైన్ చేశాక అవినీతి తగ్గింది.
ఆర్కే: ఫ్లోరింగ్‌కి మార్బుల్ వేస్తే ఒక చార్జ్, నాపరాయి వేస్తే ఒక చార్జ్ పెట్టారు. ఇలాంటి విధానం వల్లే అవినీతి పెరిగింది. ఇలా ఎందుకు పెట్టారు?
జనార్దనరెడ్డి: రిచ్ కుడ్ పే మోర్ అనే కాన్పెప్ట్ అమలు చేస్తున్నారు. ఈ విషయం సింప్లిఫై చేయాల్సి ఉంది.
ఆర్కే: డిస్ర్కిషన్ పెడితే కరప్షన్ అసాధ్యం కదా? ఆ విధంగా ఎందుకు ఆలోచించరు?
జనార్దనరెడ్డి: నిజమే.. ఇటీవల అవుట్ సోర్సింగ్‌లో జీహెచ్‌ఎంసీకి ఇంజనీర్లను ఈ విధానంలోనే ఎంపిక చేశాం.
ఆర్కే: హెచ్‌ఎండీఏ వాళ్లు లేఅవుట్లు అప్రూవ్ చేస్తున్నారు. అందులో ఏం కడుతున్నారో వాళ్లు అడగరు. మీరు అడుగుతారు.
జనార్దనరెడ్డి: ప్రాపర్ లేఅవుట్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మేమూ గుర్తించాం.
ఆర్కే: కొన్ని ప్రాంతాలు మల్టీ స్టోర్ బిల్డింగ్‌లకు, కొన్ని రెసిడెన్షియల్ పర్ప్‌సకే కేటాయిస్తే సమస్య పరిష్కారమవుతుంది కదా?
జనార్దనరెడ్డి: ఇప్పుడు కొత్తగా వచ్చే లేఅవుట్ మాస్టర్ ప్లాన్‌లో ఈ విధంగానే చేస్తున్నాం.
ఆర్కే: ఇళ్లలో చిన్న ఫంక్షన్ జరిగితే వంద మంది వరకు వస్తున్నారు. వీరంతా రోడ్డుపైనే పార్కింగ్ చేయడం వల్ల రోడ్డంతా బ్లాక్ అయిపోతోంది కదా?
జనార్దనరెడ్డి: కొత్త పాలసీ ప్రకారం నగరంలో కొన్ని ఖాళీ స్థలాలను పార్కింగ్‌కు వినియోగించేలా ఆలోచన చేస్తున్నాం.
ఆర్కే: వేరే దేశాల్లో ఫ్లైఓవర్ల పిల్లర్లు చాలా స్లీక్‌గా ఉంటాయి. మనం చాలా హెవీ పిల్లర్లు వేస్తున్నాం. అవసరమా? దీని వల్ల కాస్ట్ కూడా పెరుగుతోంది.
జనార్దనరెడ్డి: ఇక్కడ కూడా అలా చేస్తేనే బావుంటుంది. మనం కూడా ఈ విషయంలో అప్‌డేట్ అవ్వాలి. ఇంజనీరింగ్ శాఖలో ఇన్నోవేషన్ వింగ్ ఉండాల్సిన అవసరం ఉంది.
ఆర్కే: జీహెచ్‌ఎంసీలో మరో ప్రధాన సమస్య కార్పొరేటర్లు వర్సెస్ సిస్టమ్. కార్పొరేటర్లు లేకపోతే ప్రజలను అప్రోచ్ అయ్యే అవకాశం లేదన్నది ఒక వాదన. బిల్డింగులు కట్టుకునే వారిపై కార్పొరేటర్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారని, జీహెచ్‌ఎంసీ స్టాఫ్‌పై ఒత్తిళ్లు తెస్తున్నారన్నది మరో వాదన. దీన్ని ఎలా ఎదుర్కొంటారు?
జనార్దనరెడ్డి: పవర్ ఉంటే మంచి చేసే వారు ఉన్నారు. దుర్వినియోగం చేసే వాళ్లూ ఉన్నారు. ఎన్నికలు లేకుండా ఒకే సిస్టమ్ బెస్ట్ అని చెప్పలేం కదా.
ఆర్కే: కార్పొరేటర్ల వల్ల మీకు ఇబ్బంది అనిపించడం లేదా? మీరు చేద్దామనుకునే దానికి అడ్డుపడడం వంటివి జరుగుతున్నాయా?
జనార్దనరెడ్డి: అందరినీ కలుపుకొని పోవాల్సిందే. అందుకే మునిసిపల్ కమిషనర్ అనేది టఫెస్ట్ జాబ్. కార్పొరేటర్లు సివిక్ ఎంగేజ్‌మెంట్‌లో ఎక్కువ ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆర్కే: పిచ్చివేషాలేస్తే తాట తీస్తాం అని కార్పొరేటర్లకు కేసీఆర్ వార్నింగ్ ఇస్తారు. రెండుమూడు కోట్లు ఖర్చు చేసి గెలిచాం.. అని వాళ్లు అంటారు.
జనార్దనరెడ్డి: కార్పొరేటర్లు లేకుండా మరో ప్రత్యామ్నాయం లేదు. సివిక్ అడ్మినిస్ట్రేషన్‌కు కార్పొరేటర్లను ఉపయోగిస్తాం. తప్పనిసరిగా వాళ్ల రిప్రజెంటేషన్ అవసరం. వాళ్లను నామినేట్ చేస్తామా లేదా ఎన్నుకుంటామా అన్నదే ఆలోచించాలి. కార్పొరేటర్లలో కూడా రాత్రింబవళ్లు పనిచేసేవారూ ఉన్నారు. ఏ ఒక్కరినో నిందించే కంటే వాళ్లను ఏ విధంగా ఉపయోగించుకుంటామో అనేది చూడాలి.
ఆర్కే: ఎప్పుడో ఏదో ఒక బిల్డింగ్ పడిపోతేనే బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌ని సస్పెండ్ చేస్తున్నారు. మీరు ఓనర్‌నే రెస్పాన్సిబుల్ చేయవచ్చు కదా?
జనార్దనరెడ్డి: చట్టంలో కూడా ఇదే వుంది. కానీ చాలా మంది యజమానులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అందుకే సాధ్యమవడం లేదు.
ఆర్కే: వరెస్ట్ డిపార్ట్‌మెంట్ ఏదైనా ఉందంటే టౌన్‌ప్లానింగే. మనం అనుమతులిచ్చిన చోట ఎన్ని ఆఫీసులొస్తున్నాయి.. ఎంతమంది పనిచేయబోతున్నారో అనే అంచనా కూడా ఉండదు. ఇటువంటి కారణాల వల్లే మైండ్ స్పేస్ రహేజా లాంటి ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒప్పుకొంటారా?
జనార్దనరెడ్డి: నిజమే.. ఇటువంటివి ముందే చూసుకోవాలి.
ఆర్కే: ఇళ్ల విషయమే తీసుకుంటే.. ఇన్ని అడుగులు కట్టుకోవచ్చు. పార్కింగ్‌కు ఇంత ఉండాలి.. అలా స్పష్టంగా చెబితే క్లియర్ అవుతుంది కదా?
జనార్దనరెడ్డి: రహదారులే సమస్య. చాలా సన్నని రోడ్డు ఉంటే ఇబ్బంది. అందుకే హైట్ రిస్ట్రిక్షన్స్ పెడతాం.
ఆర్కే: కార్పొరేటర్ల వ్యవహారం వల్ల ఎప్పుడైనా చిరాకు, విరక్తి కలిగిందా? ఈ జాబ్ వద్దురా బాబూ అని అనిపించిందా?
జనార్దనరెడ్డి: చాలా సార్లు అనిపించింది. అయితే.. టఫ్ జాబ్ చేయాలని కూడా ఉంటుంది. ఎంత సంక్షిష్టమైనా ఎవరోఒకరు చేయాల్సిందే కదా.
ఆర్కే: జీహెచ్‌ఎంసీలో మొత్తం ఎంత మంది ఉద్యోగులు? వేజ్ బిల్లు ఎంత? రెవెన్యూ ఎంత?
జనార్దనరెడ్డి: అవుట్‌సోర్సింగ్ వాళ్లతో కలిపి మొత్తం 26-27 వేల మంది ఉన్నారు. ప్రపంచంలో సుమారు 64 దేశాల్లో జనాభా కూడా ఇంత లేదు(నవ్వుతూ..). వేజ్ బిల్లు రూ.1200 కోట్లు, ఆదాయం రూ.3000 కోట్లు. అందులో మూడో వంతు జీతాలకే పోతోంది.
ఆర్కే: బెటర్ గ్రేడింగ్.. బెటర్ ఫెసిలిటీ్‌సతో రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది కదా?
జనార్దనరెడ్డి: అలానే ప్రయత్నిస్తున్నాం. గేటెడ్ కమ్యూనిటీ్‌సలో ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు.
ఆర్కే: సిటీ బస్సుల నిర్వహణ కూడా మీకే అప్పగించారు. ఆ నష్టాలూ భరించాలి మీరు?
జనార్దనరెడ్డి: పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ప్రపంచంలో ఎక్కడా లాభదాయకం కాదు. ఆర్టీసీలో వచ్చే నష్టాలంతా హైదరాబాద్ నుంచే. కాబట్టి హైదరాబాద్ నష్టాలు జీహెచ్‌ఎంసీ వాళ్లే భరించాలని అన్నారు. నిరుడు దాదాపు రూ.330 కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. మాకూ ఇబ్బందిగానే ఉంది.
ఆర్కే: ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా? మెట్రో వస్తే తీవ్రత తగ్గుతుందంటారా? మెట్రో ఎప్పుడు రావొచ్చ?
జనార్దనరెడ్డి: కచ్చితంగా తగ్గుతుంది. 30 కిలోమీటర్ల మేర నవంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నగరం మొత్తం ప్రారంభమవుతుంది. మెట్రో ప్రారంభమైతే ప్రజలకు ఎంతో సమయం మిగులుతుంది. ట్రాఫిక్ తగ్గించేందుకు కార్ షేరింగ్‌నూ ప్రోత్సహించాలి.
ఆర్కే: మనం ఒక రూల్ పాస్ చేస్తాం. అమలు చేయం. ప్లాస్టిక్ విషయాన్నే తీసుకోండి. నిషేధం ఉన్నా ఎక్కడా అమలవడం లేదు కదా?
జనార్దనరెడ్డి: ఏటా 60 కోట్ల పాలథిన్ కవర్లు.. అందులో 30 కోట్ల కవర్లు కేవలం చికెన్ షాపుల వాళ్లే వినియోగిస్తున్నారు అని గుర్తించాం. దీనికి ప్రత్యామ్నాయం ఉంది. జూట్ బ్యాగులు వినియోగించాలి. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రత్యేక క్యాంపెయిన్ చేపడుతున్నాం. పాలథిన్ వినియోగించేవారికి జరిమానా విధిస్తున్నాం.
నగరంలో ఏడెనిమిది లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. వీటి కోసం ‘మా ఇంటి నేస్తం’ అనే కార్యక్రమం ప్రారంభించాం. మీ ఇంట్లో లేదా పక్కింట్లో మిగిలిన భోజనాన్ని ఆ కుక్కలకు పెట్టాలని చెప్పాం. ప్రతిరోజూ ఒకే చోట పెట్టమని చెప్పాం. ఇలా చేస్తే ఆ కుక్కలు ప్రతిరోజూ అక్కడే తిని అక్కడే ఉంటాయి. నగరంలో 2000 మంది ప్రస్తుతం ఇలానే చేస్తున్నారు.
గతేడాది 25 లక్షల మొక్కలు నాటాలన్నప్పుడు అనూహ్య స్పందన వచ్చింది. స్వచ్ఛ హైదరాబాద్‌కు కూడా స్పందన వచ్చింది. మనం చేస్తున్న ఈ మాత్రానికే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నంబర్ 1 స్థానం వచ్చింది. ఇది తలచుకున్నప్పుడల్లా బాధనపిస్తుంది.(నవ్వుతూ..). మనం ది బెస్ట్ కాకపోయినా.. ఇతరుల కంటే బెస్ట్
‘స్వచ్ఛత’లో బెస్ట్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, బెస్ట్ స్కూల్, బెస్ట్ ఆఫీస్, బెస్ట్ మార్కెటింగ్ ప్లేస్ అవార్డును ప్రతినెలా ఇస్తున్నాం. సెల్ఫ్ అసె్‌సమెంట్ ప్రాతిపదికను గుర్తిస్తున్నాం.
నగరంలోని కొన్నిచోట్ల సీఎస్సార్ నిధులు వెచ్చించి ఎలకా్ట్రనిక్ టాయిలెట్లు ప్రారంభించాం. టాయిలెట్ మేనేజర్లు 100 మందికి తొలిసారిగా వైట్ డ్రెస్‌లు ఇచ్చాం.
కొన్ని కిలోమీటర్ల పరిధిలో టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకున్నాం. విస్పర్ వ్యాలీ నుంచి సీఎం క్యాంప్ ఆఫీసు వరకు ఓసారి నడుచుకుంటూ వెళ్లాను. మధ్యలో నాకు టాయిలెట్ వచ్చింది. సెంట్రల్ గవర్న్‌మెంట్ ఆఫీసుకు వెళ్లాను. నన్ను వాళ్లు గుర్తించలేదు. లోపలికి రానివ్వలేదు.
60 ఏళ్లల్లో ఎంతమందికి జీహెచ్‌ఎంసీ వర్కర్లకు పౌరసన్మానం జరిగిందో, ఈ రెండేళ్లలో అంతమందికి సన్మానం చేశాం. ప్రతి సెక్టార్‌లో బెస్ట్ పర్సన్స్‌ను గుర్తిస్తే అందరిలోనూ బాధ్యతను పెంచుతుంది.
హైదరాబాద్‌లో పైపుల్లో పాలిథిన్ ఇరుక్కుపోయిన విషయం ‘ఆంధ్రజ్యోతి’ ఫస్ట్ పేజీలో వచ్చాక మా ఇంజనీరింగ్ టీమ్‌ను పంపించాను. ఇంత తక్కువ వానకు ఎందుకు అలా అయిందని తెలుసుకోమన్నాం. సమస్య పరిష్కరించాక ఐన్‌స్టీన్ అంత ఆనందం కలిగింది.
సిటీలో దాదాపు 1500 కిలోమీటర్ల ఓపెన్ డ్రెయిన్ ఉంది. వాటికి సమీపంలో ఉండే వారు ఇంట్లో పనికిరాని వస్తువులన్నింటినీ డ్రెయిన్‌లోనే వేస్తున్నారు. ఇటువంటి వారికి అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ రీసోర్స్ పర్సన్‌లను నియమించాం.
నేను గతంలో వైజాగ్ జేసీగా ఒకేఒక్క రోజు పని చేశాను. 24 గంటల్లో చిత్తూరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఆర్కే: జీహెచ్‌ఎంసీని బాగా సంస్కరించుకుంటూ, ప్రశంసలు పొందాలని కోరుకుంటూ, బెస్ట్ మునిసిపల్ కమిషనర్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకూంటూ.. థ్యాంక్యూ వేరీ మచ్.