ఆయన గుండె చప్పుడు నా చేతుల్లోనే ఆగిపోయింది
ABN, First Publish Date - 2020-02-08T01:09:55+05:30
ఆయన పేరు వింటే అవినీతి ఆమడదూరం పారిపోతుంది. 36 ఏళ్ల సర్వీసులో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పనిచేసిన ఆయన ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్‌కు కమిషనర్‌గా నియమితులయ్యారు.
పీవీ హయాంలోనే విదేశాలకు నల్లధనం
బ్లాక్ మనీ ఎంతుందో కమిటీనే చెప్పలేకపోతోంది
ప్రభుత్వాలు అవినీతి పరుల పాపాలు కడిగేస్తున్నాయి
మనం మెత్తగా ఉంటే ప్రెషర్స్ పెరుగుతాయి
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి
ఆయన పేరు వింటే అవినీతి ఆమడదూరం పారిపోతుంది. 36 ఏళ్ల సర్వీసులో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పనిచేసిన ఆయన ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్‌కు కమిషనర్‌గా నియమితులయ్యారు. సెంట్రల్ విజిలెన్స్‌కు ఒక నాన్ ఐఎఎస్ కమిషనర్‌గా రావడం ఇదే మొదటిసారి. ఆ ఖ్యాతిని దక్కించుకున్న వ్యక్తి కె.వి.చౌదరి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ముచ్చటించారు చౌదరి.
ఆర్కే : ముందుగా కంగ్రాచ్యులేషన్స్. ఒక ప్రిస్టీజియస్ పోస్టులోకి వచ్చారు. కాస్త మేలు జరుగుతుందని మా ఆశ. ఏమంటారు?
చౌదరి : 36 ఏళ్లు ఎలాంటి మచ్చ లేకుండా సర్వీస్ చేశాను. భగవంతుని దయ వల్ల ఈ అవకాశం వచ్చింది. నాన్ ఐఎఎస్ అధికారి ఇలాంటి పోస్టుకు ఎంపిక కావడమనేది అదృష్టంగా భావిస్తున్నాను. మరో నాలుగేళ్లు సర్వీస్ చేసే అవకాశం వచ్చింది.
ఆర్కే : సీవీసీకి నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఉండదు కదా?
చౌదరి : ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలో విజిలెన్స్ విభాగం ఉంటుంది. దానికి విజిలెన్స్ ఆఫీసర్ హెడ్‌గా ఉంటాడు. ఆ విభాగం ఆ సంస్థకు వివరాలు అందించడంతో పాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు కూడా అందిస్తారు. కొన్నిసార్లు వారు పనిచేసే సంస్థలోనే అధికారులపైన విచారణ జరపడానికి విజిలెన్స్ అధికారులకు ఇబ్బంది ఎదురవుతుంది. అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయమని సీబీఐకి సూచించడం జరుగుతుంది.
ఆర్కే : సంస్థలో అవినీతి జరిగినపుడు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌ను మేనేజ్ చేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనలు మొదలయ్యాయి. ఇది మీ దృష్టికి వచ్చిందా?
చౌదరి : తెలుగులో ఒక సామెత ఉంది. ‘కంచె చేనే మేస్తే ఎలా?’ అని. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా మన సొసైటీలో భాగమే. వారికి కూడా అవలక్షణాలు పాకి ఉండవచ్చు. అయితే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌ను ఎంపిక చేసే ప్రక్రియ చాలా పకడ్బందీగా జరుగుతుంది. మంత్రిత్వ శాఖ వారు ఒప్పుకోవాలి. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని సీబీఐ వారు ఎంక్వైరీ చేసి ఓకె చెప్పాలి. సీవీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ ఉండాలి. అయితే చాలా సార్లు ఏమవుతుందంటే రికార్డుల్లో అన్నీ ఉండకపోవచ్చు.
ఆర్కే : అవినీతిపై వ్యతిరేక భావం ఉన్నా నిజాయితీగా ఉండే వాణ్ణి చేతకాని వాడని అంటున్నారు కదా?
చౌదరి : అవును. అందులోనూ సత్యం ఉంది. అయితే మార్పనేది రావాలి, వస్తుంది.
ఆర్కే : స్వభావరీత్యా నిజాయితీగా ఉన్నారా? ఎవరి ప్రేరణ అయినా ఉన్నాదా?
చౌదరి : స్వభావరీత్యా లేకపోతే నిలబడదు. ప్రేరణ కొంత ఉంది. నా విషయంలో ఏం జరిగిందంటే సర్వీసులో చేరిన మొదటి ఐదు సంవత్సరాల్లో నాకు బాస్‌గా పనిచేసిన వాళ్లందరూ మణితునకల్లాంటి వారు. వాళ్ల దగ్గర పనిచేయడం వల్ల నిజాయితీగా ఉండటం సాధ్యమయింది.
ఆర్కే : కెరీర్‌లో ఎన్ని సందర్భాల్లో ప్రెషర్స్ ఎదుర్కొన్నారు?
చౌదరి : డైరెక్ట్ పొలిటికల్ ప్రెషర్ ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌పై చాలా తక్కువ. నా విషయానికొస్తే 36 ఏళ్ల సర్వీసులో వీలైతే పెనాల్టీ కొంత తగ్గించమని అడగటంలాంటివి రెండు మూడుసార్లు వచ్చుంటాయి. అయితే మనం ఎంత సా్ట్రంగ్‌గా ఉన్నామన్న దానిపైనే ప్రెషర్ ఆధారపడి ఉంటుంది. సా్ట్రంగ్‌గా నిలబడితే ప్రెషర్స్ తగ్గిపోతాయి. మెత్తబడితే ప్రెషర్స్ పెరుగుతాయి.
ఆర్కే : ఒక స్థాయి అధికారి తీసుకున్న నిర్ణయాన్ని పై అధికారి మార్చవచ్చు. దీనివల్ల నిజాయితీగా ఉన్న అధికారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా?
చౌదరి : కొన్నిసార్లు దెబ్బతీసినట్టే అవుతుంది. అయితే స్కీమ్ ఆఫ్ యాక్ట్‌ని గౌరవించాలి. లీగల్ చానల్‌లో జరిగినంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాకాకుండా ఆ పేపర్‌నే కనిపించకుండా చేయడం, నాశనం చేయడం లాంటివి చేసినపుడు మోరల్ దెబ్బతింటుంది.
ఆర్కే : బ్యాంకుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. మీ దృష్టికి వస్తున్నాయా?
చౌదరి : వచ్చాయి. బ్యాంకులకు మేం కొన్ని సూచనలు చేశాం. పత్రాలు తీసుకునే సమయంలోనే డ్యుయల్ చెక్ చేయడం లాంటి సూచనలు ఇచ్చాం. ఒకే ఆస్తికి నాలుగైదు బ్యాంకులు లోన్ ఇవ్వడం అనేది అధికారులకు తెలిసే జరుగుతోంది. కావాలని లోన్ కట్టకుండా ఉండే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మా దృష్టి అధికారులపైనే ఉంటుంది.
ఆర్కే : బ్లాక్‌మనీ తీసుకురావడం సాధ్యమేనా?
చౌదరి : ప్రి లిబరలైజ్‌డ్ పీరియడ్‌లో అంటే పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల్లో గోప్యంగా చేరిపోయింది. ఇప్పుడు పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్‌లో నీకు ఫారిన్‌లో బిజినెస్ లేకపోయినా ఏడాదికి లక్షాపాతికవేల డాలర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఖర్చుపెట్టుకోవచ్చు. పర్మిషన్‌తో ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమయిందంటే ఒక్క క్లిక్‌తో మనీ బయటకు పంపించగలుగుతున్నారు, తెచ్చుకోగలుగుతున్నారు. మన ఇంటి పక్కనే కంపెనీ ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండం. దాని బ్యాలెన్స్‌షీట్ అంత ఉంటుందని ఎవరూ కూడా ఊహించలేరు. దాన్నో విదేశీ ఇన్వెస్టర్ల డబ్బు 10 శాతం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి నిజంగా విదేశీ ఇన్వెస్టర్లే పెట్టారా? లేక మన డబ్బే బయటకు వెళ్లి తిరిగొస్తుందా? ఇలాంటి వాతావరణంలో ఎంత మనీ ఏ కంట్రీ ద్వారా వెళుతుందో తెలుసుకోవడం కష్టమయింది. దేశంలో ఉన్న బ్లాక్‌మనీ ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం మూడు కమిటీలు వేసింది. వాళ్లే ఇంత అని కచ్చితంగా చెప్పలేకపోయారు. ‘‘అయితే ఇక్కడ రిటర్న్స్ బాగున్నాయి. అవకాశాలు బెటర్‌గా ఉన్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెడితే సెక్యూర్డ్‌గా ఉంటుంది’’ అనే వాతావరణం పెరిగినపుడు ఫారిన్ మనీ తిరిగొచ్చేస్తుంది. డబ్బు బయట ఉందనేది వాస్తవం. ఎంత ఉందనేది చెప్పలేం.
ఆర్కే : జీరో పర్సెంట్ టాక్స్‌తో బ్లాక్‌మనీ తెచ్చుకొమ్మని అంటే మొత్తం డబ్బు వచ్చేస్తుంది. తరువాత చట్టాలు కఠినంగా అమలు చేయొచ్చు కదా?
చౌదరి : ఇవ్వాళ ఎందుకు చేయాలి? అనేది ఒక ప్రశ్న. ఇప్పటి వరకు చేసిన వారిని ఎందుకు వదిలేయాలి? అనేది మరో ప్రశ్న. ప్రతి పదేళ్లకోసారి ప్రభుత్వం కొత్త పథకంతో వస్తుంది. మన పాపాలన్నీ కడిగేస్తుంది. ఈ పదేళ్లు జాగ్రత్తగా ఉంటే చాలని అనుకునేవారు పెరిగిపోతారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఒక కేసులో ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా ఒక కారణం.
ఆర్కే : మీ కెరీర్‌లో ఎవ్వరైనా లంచం ఇవ్వజూపారా?
చౌదరి : చూపలేదని అనను. కెరీర్ ప్రారంభంలో జరిగింది. అయితే నేను కేకలేయడంతో తప్పుకున్నారు. ఒక ఉదాహరణ చెబుతాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్‌లో పనిచేస్తున్నాను. ముంబైకి చెందిన ఒక పటేల్‌కు హైదరాబాద్ శివార్లలో ద్రాక్షతోటలు ఉండేవి. ఆ స్థలాన్ని అమ్మేశాడు. అయితే ఆ స్థలానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. దీంతో అతనికి సమన్లు జారీచేశాం. ఒక రోజు ఆయన ఆఫీ్‌సకు వచ్చాడు. ఆ రోజు శనివారం. సిటీలో గొడవలు జరుగుతుండటంతో ఆఫీసులన్నీ మూసేశారు. నేను, ఒక కొలీగ్ మాత్రం ఆఫీ్‌సలోనే ఉండి పనిచేసుకుంటున్నాం. ఆ సమయంలో ఆఫీసుకు వచ్చాడు. రెండు, మూడు గంటలు ఇంటరాగేట్ చేశాం. ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేశాం. ఆన్‌మనీ కట్టేశాడు. పేపర్లన్నీ ఇచ్చేశాం. చివర్లో ఇది ఉంచండి సార్ అంటూ డబ్బులు ఇవ్వబోయాడు. అటువంటివి నాకు నచ్చవు అని చెప్పాను. అప్పుడు పటేల్ ‘మీ గురించి తెలుసుకున్నాను సార్. మీరు ఈ రోజు సెలవుదినం అయినా కూడా నా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. నిజానికి తరువాత రండి అని చెప్పవచ్చు. అలా అయితే నేను హోటల్‌లో ఉండాల్సి వచ్చేది. ఆదివారం కూడా ఇక్కడే ఉండి సోమవారం మీ దగ్గరకు రావాల్సి వచ్చేది. నాకు సుమారు పదివేలు ఖర్చయ్యేది. ఆ డబ్బులే మీకిస్తున్నాను’ అన్నాడు. అయినా సున్నితంగా తిరస్కరించాను. ఈ విధమైన జంజాటాలు వచ్చేవి. అయితే భగవంతుని దయవల్ల అంటకుండా బయటపడ్డాను.
ఆర్కే: మీకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కడనుంచి వచ్చాయి...
చౌదరి: చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత ఉంది. ట్రైబ్యునల్‌లో ఉండగా వెంకటేష్ అనే వ్యక్తి రోజూ కోర్టు తరువాత మా ఆఫీ్‌సకు వచ్చి టీ తాగేవాడు. ఒకరోజు ఆయన ‘‘నేనొకటి చెబుతాను. నువ్వు బాగా మాట్లాడుతావు. వాక్‌శుద్ది ఉంది. అయితే ఆ కోపం తగ్గాలంటే నుదుటిపైన బొట్టు పెట్టుకో’’ అన్నాడు. అలా అని వదలకుండా వరుసగా రెండు రోజులు వచ్చి తనే పెట్టాడు. అలా మొదలయింది.
ఆర్కే: దేశంలో ఇన్ని చట్టాలున్నా పేదవాడికి న్యాయం అందుతోందా?
చౌదరి: కొత్త చట్టాలు చేయడం కన్నా ఉన్నవాటిని పక్కాగా ఇంప్లిమెంట్ చేయడంపై దృష్టిపెట్టాలి. ఒకవ్యక్తి లంచం తీసుకుంటే దొరికితే విచారణ పూర్తయి శిక్ష పడటానికి 20 ఏళ్లు పడుతోంది. దీనివల్ల ప్రయోజనం ఉండటం లేదు. మూడు రోజులు రిమాండుకు వెళ్లాడు, వచ్చాడు. దొరికితే మాత్రం ఏం జరిగింది అని ఉద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ అభిప్రాయం ఉంది. అలాకాకుండా చిన్న శిక్షైనా వెంటనే వేస్తే దానివల్ల ప్రయోజనం చేకూరుతుంది. లంచం తీసుకోవడం తగ్గుతుంది. ట్రాఫిక్ పోలీస్ వంద రూపాయలు చలానా రాయాలని చూస్తుంటే ఇదిగోండి యాభై తీసుకోండి చలానా రాయకండి అని అంటారు. ఇది అన్‌కాన్షియ్‌సగానే జరుగుతోంది. అవినీతిని తుదముట్టించాలంటే స్కూల్ కరికులమ్‌లోనే దానికి సంబంధించిన పాఠాలు జోడించాలి. పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా పెట్టాలి. ఎక్కడ కంప్లయింట్ చేయాలి. ఏ విధంగా చేయాలి. ఈ విషయాలన్నీ తెలియజెప్పాలి.
ఐఐఎం అహ్మదాబాద్‌లో చిన్న స్పీచ్ ఇవ్వమని అడిగారు. అయితే వారికి నేను 20 ప్రశ్నలతో చిన్న కొశ్చనీర్‌ను అందించి పిల్లలను పూర్తి చేసి ఇవ్వమని అడిగాను. ఊరికే స్పీచ్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం. సీవీసీకి ఏడాదికి 70 వేల ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో పనికొచ్చేవి 10 వేలే ఉంటాయి. మిగతావన్నీ మా పరిధిలోకి రానివే ఉంటాయి. అంటే మాకు నీళ్లు సరిగ్గా రావడం లేదని, సరిగ్గా క్లీన్ చేయడం లేదనే ఫిర్యాదులుంటాయి. అంటే చాలా మందికి ఏ ఫిర్యాదు ఎక్కడ, ఎవరికి చేయాలనే విషయంపై అవగాహన లేదు. 10 వేలలో కూడా 7 వేలు ఆకాశరామన్న ఫిర్యాదులంటాయి.
ఆర్కే: నాయకుల వల్లే ఉద్యోగులకు అవినీతి మరక అంటుతోందా...
చౌదరి: అన్నింటికన్నా పెద్ద అవినీతి డబ్బు తీసుకుని ఓటు వేయడం. ఒక దగ్గర డబ్బు తీసుకుని మరో దగ్గర అవినీతిని రూపుమాపాలని అనడం కరెక్ట్‌కాదు. అంతటా నీతిమంతంగా ఉండాలి. యంగర్ జనరేషన్‌లో చాలా అవేర్‌నెస్ ఉంది. ఈ రొచ్చులో ఇరుక్కోకూడదని అనుకుంటున్నారు. అప్రాధాన్య పోస్టులో వేశారని కోపంతో క్యారెక్టర్‌ను మార్చుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడ చేస్తున్నా బాధ్యతాయుతంగా చేయాలి. పాలసీలు రూపొందించడంలో జరుగుతున్న అవినీతిని అరికట్టడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. అయితే దీనికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. స్కిల్డ్ పర్సన్స్ కావాలి. ఏ రోజైనా నా ఫైల్ చూడండి. చాలా క్లియర్‌గా ఉంటుంది. నా థింకింగ్, ఏ కారణం చేత ఆ నిర్ణయం తీసుకున్నానో ఆ పేపర్ మీద క్లియర్‌గా రాస్తాను. దీనివల్ల నేను లేకపోయినా తరువాత ఆఫీసర్ అర్థం చేసుకోవడానికి సులువవుతుంది.
ఆర్కే : పిల్లలు ఎంత మంది?
చౌదరి : ఇద్దరు పిల్లలు. అమ్మాయి పెళ్లయింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అల్లుడు కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. అబ్బాయి ఇంకా పెళ్లికాలేదు. లా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఆర్కే : లైఫ్‌లో బాధ పెట్టిన సంఘటనలున్నాయా?
చౌదరి : హైదరాబాద్‌లో ఇన్వెస్టిగేషన్ డివిజన్‌లో పనిచేస్తుండగా ఒక సంఘటన జరిగింది. సర్వీ్‌సలో చేరి రెండు, మూడేళ్లవుతోంది. ఒకరోజు ఒక ఇంట్లో నలభై లక్షల రూపాయల బ్లాక్ మనీ ఉందని ఇన్‌ఫర్మేషన్ వచ్చింది. సమాచారం కరెక్ట్ అని నిర్ధారణ చేసుకున్నాక సెర్చింగ్‌కు బయలుదేరాం. ఆ ఇంట్లో ఒక పెద్దాయన ఉన్నాడు. వాళ్ల కూతురు ఉంది. మేం సో అండ్ సో అని చెప్పి వారెంట్‌పైన సైన్ తీసుకున్నాం. అయితే ఆ పెద్దాయన సైన్ చేసిన తరువాత ఒకసారి ఆ వారెంట్ చదవమన్నాడు. నేను వారెంట్ చదువుతుండగానే ఆ పెద్దాయనకు హార్ట్‌ఎటాక్ వచ్చింది. నేను, మా కొలీగ్స్ ఎత్తి మంచంపై పడుకోబెడుతున్నాం. మా చేతుల్లోనే ప్రాణాలు పోయాయి. ఆయన గుండె చప్పుడు నా చేతుల్లోనే ఆగిపోయింది నాకు స్పష్టంగా తెలిసింది. ఇప్పటికీ ఆ హార్ట్ బీటింగ్ ఆగిపోవడాన్ని ఫీలవుతాను. అది మోస్ట్ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్.
ఆర్కే : హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయా?
చౌదరి : ఐ లవ్ మై వర్క్. పనిలో వచ్చే సాటి్‌సఫాక్షన్ నాకు ఎందులోనూ రాదు. ప్రత్యేకంగా ఒకటి, రెండు హ్యాపీ మూమెంట్స్ చెప్పలేను.
ఆర్కే : సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా మీ గోల్స్ ఉన్నాయా?
చౌదరి : ప్రివెంటివ్ విజిలెన్స్‌ను బాగా ముందుకు తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో కరెప్షన్‌ను బాగా తగ్గించాలి. రెండవది ప్రజల్లో అవేర్‌నె్‌సతో పాటు ఆఫీసర్స్‌లో కూడా ఆవేర్‌నెస్ తీసుకురావాలి. మూడోది డూయింగ్ వర్క్ విత గవర్నమెంట్ షుడ్ బికమ్ ఈజీ. అంటే టెండర్ ప్రాసెసింగ్‌ఎంత ట్రాన్సపరెంట్‌గా చేస్తాం. ఎంత ఎక్కువ మంది పారిస్టిపేట్ అయ్యేలా చేస్తాంఅనే దానిపైన వర్క్ చేస్తాం. ఇందులో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.
ఆర్కే : తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థాంక్యూ వెరీమచ్.
Updated Date - 2020-02-08T01:09:55+05:30 IST