వట్టి లేఖలతో వ్యాక్సిన్లు వచ్చేస్తాయా?
ABN , First Publish Date - 2021-05-11T08:55:35+05:30 IST
వ్యాక్సిన్ కంపెనీలకు డబ్బు చెల్లించకుండా ఒట్టి లేఖలు రాస్తే వ్యాక్సిన్లు వస్తాయా అని వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది
కంపెనీలకు డబ్బు చెల్లించనక్కర్లేదా?
టీకాలకు 1,600 కోట్లు అవసరమైతే రూ.45 కోట్లు మంజూరు చేస్తారా?
అనేక రాష్ట్రప్రభుత్వాలు ఆర్డర్లు పెట్టి అడ్వాన్సులు కూడా చెల్లించాయి
అక్కడ వ్యాక్సిన్లు వచ్చేశాయి
18-45 ఏళ్లవారికి టీకాలూ వేస్తున్నారు
చేతగాకపోతే తప్పుకోండి.. టీడీపీ ఫైర్
15వ ఫైనాన్స్ కమిషన్ కింద కేంద్రం నుంచి ఈ రెండు నెలల్లో రూ.2,800 కోట్లు వచ్చాయి. పెంచిన పన్నులు.. అప్పుల ద్వారా వేల కోట్ల రూపాయలు సమకూరుతున్నా కరోనా వ్యాక్సిన్‌కు కేవలం రూ.45 కోట్లు ఇవ్వడం దారుణం.
కమీషన్లు దండుకోవడానికి వీలయ్యే పథకాలకు, రాజకీయ ప్రయోజనం నెరవేర్చే పనులకు మాత్రం ఉదారంగా నిధులు ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారు.
- టీడీపీ
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): వ్యాక్సిన్ కంపెనీలకు డబ్బు చెల్లించకుండా ఒట్టి లేఖలు రాస్తే వ్యాక్సిన్లు వస్తాయా అని వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశం ఆన్లైన్లో జరిగింది. ‘సీరం ఇనిస్టిట్యూట్ వ్యాక్సిన్ ధరలను కూడా ఖరారు చేసింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఎన్ని కోట్ల డోసులు కావాలో వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు పెట్టి అడ్వాన్సు చెల్లింపులు కూడా చేశాయి. వ్యాక్సిన్లు రావడంతో 18-45 సంవత్సరాల మధ్య వారికి కూడా వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇంతవరకూ ఆర్డర్లు పెట్టలేదు.. అడ్వాన్సులు చెల్లించలేదు. ఊరకే లేఖలు రాస్తే వ్యాక్సిన్లు వస్తాయా? నిన్నటిదాకా కేంద్రానికి లేఖ రాశామని, వ్యాక్సిన్ రాగానే ప్రజలకు వేస్తామని మంత్రులు కబుర్లు చెప్పారు. అవి ఉత్త మాటలని తేలిపోవడంతో చంద్రబాబు ఇప్పిస్తే వేస్తామంటూ బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తమ చేతగానితనానికి చంద్రబాబుపై నెపం నెట్టే పరిస్థితికి దిగజారారు.
ఆయన వ్యాక్సిన్ తెప్పిస్తే మీరెందుకు ముఖ్యమంత్రిగా ఉండడం’ అని సమావేశం నిలదీసింది. వ్యాక్సిన్ కొనుగోలుకు రూ.1,600 కోట్లు అవసరమైతే నాలుగు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేవలం రూ.45 కోట్లు మంజూరు చేశారని, దీనిని బట్టే ప్రజల ప్రాణాలకు ఈ ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏమిటో తెలుస్తోందని విమర్శించింది. ఇప్పటికైనా వ్యాక్సిన్ కోసం అడ్వాన్సులు చెల్లించి వాటిని తేవాలని.. చేతగాకపోతే తప్పుకోవాలని డిమాండ్ చేసింది. వెంటనే అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేసి కరోనా సహాయ కార్యక్రమాలపై చర్చించాలని, ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. రైతులనూ ఆదుకోవాలని డిమాండ్ చేసింది.
మీ వాడనే కేసు పెట్టలేదా?
కడప జిల్లా మామిళ్లపల్లిలో జిలెటిన్ స్టిక్స్ పేలి పది మంది చనిపోయిన ఘటనలో ఆ స్టిక్స్ సరఫరాదారునిపై ఎందుకు కేసు పెట్టలేదని టీడీపీ ప్రశ్నించింది. సరఫరాదారు ముఖ్యమంత్రికి రక్త సంబంధీకుడని వార్తలు వస్తున్నాయని, అక్రమంగా గనిని నిర్వహిస్తున్న వైసీపీ నేతను అరెస్టు చేయలేదని ఆక్షేపించింది.
అక్రమ కేసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్
అడ్డగోలుగా అక్రమ కేసులు పెట్టవద్దని... అరెస్టులు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. దానిని ఉల్లంఘిస్తూ టీడీపీ నేతలు లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు మోపుతోందని టీడీపీ సమావేశం విమర్శించింది. ఈ కేసులపై న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లను కొనసాగించాలనే డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించింది. రాష్ట్రంలోనూ అన్న క్యాంటీన్లను కొనసాగించి, పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.