ఏడు కొండలపై గోల గోల!
ABN, First Publish Date - 2021-09-17T08:10:16+05:30
ఏడు కొండలవాడా... వెంకట రమణా... గోవిందా గోవింద! తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ‘ప్రత్యేక దర్శన’ పునరావాస కేంద్రంగా మార్చేశారు.
జంబో బోర్డుతో భక్తులకు, భగవంతుడికీ తిప్పలే
ఏకంగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు
అందరికీ ‘ప్రొటోకాల్’ మర్యాదలు అందాల్సిందే
ప్రత్యేక దర్శనాలు, గదులు కేటాయించాల్సిందే
ఇక ఇబ్బడి ముబ్బడిగా సిఫారసు లేఖలు
అసాధారణంగా పెరగనున్న బ్రేక్ దర్శనాలు
విపరీతంగా పెరగనున్న బ్రేక్ సమయం
సామాన్య భక్తులకు మరింత నిరీక్షణ
బోర్డులో పారిశ్రామికవేత్తలకే పెద్దపీట
పాలక మండలి నియామకంలో
‘ప్రత్యేక’ స్వార్థం
(తిరుపతి, అమరావతి - ఆంధ్రజ్యోతి): ఏడు కొండలవాడా... వెంకట రమణా... గోవిందా గోవింద! తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని ‘ప్రత్యేక దర్శన’ పునరావాస కేంద్రంగా మార్చేశారు. ఎప్పటికప్పుడు భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన బోర్డు స్వరూప స్వభావాలకే కొత్త నిర్వచనం ఇచ్చారు. తమకు నచ్చిన వారిని, తమకు సహాయం చేసిన వారిని, తాము సహాయం పొందాలనుకునే వారిని సంతృప్తి పరిచే ప్రత్యేక కూటమిని తయారు చేశారు. టీటీడీ బోర్డులో గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించడం వెనుక అంతరార్థం ఏమిటో, వారి అవసరం ఏమిటో ప్రభుత్వమే సూటిగా చెప్పలేని పరిస్థితి! ‘ప్రొటోకాల్’ మర్యాదలతో దర్శనం చేసుకోవడంతోపాటు... తమ సిఫారసులతో మరికొందరికి బ్రేక్ దర్శనం చేయించడం మినహా వీరు శ్రీవారికి చేసే సేవేమిటో తెలియదు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు అంటే ఒక పేరు, ఒక ప్రతిష్ఠ! స్వామికి దగ్గరయ్యేందుకు అదొక మార్గం! అందుకే... రాజకీయ నాయకుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అనేక మంది టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం పోటీ పడతారు. శ్రీవారి సేవలో తరించాల్సిన ఈ బోర్డును కూడా వైసీపీ సర్కారు ఒక ‘ప్రత్యేక దర్శన పునరావాస’ కేంద్రంగా మార్చేసింది. బోర్డు సభ్యుల సంఖ్యను అలా అలా పెంచేస్తూ... ఇప్పుడు ఏకంగా 81 మందితో ఒక జంబో మండలిని తయారు చేసింది. ఒక చైర్మన్, 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు... ఇలా 31 మందితో బోర్డు ఏర్పాటైంది. వీరు చాలదని... ఏకంగా 50 మందిని మరింత ‘ప్రత్యేకంగా’ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. రాజకీయ అవసరాలతోపాటు తమకు నచ్చిన వారిని, తమకు సహాయం చేసిన వారిని, తమకు సహాయం చేయగలిగే వారిని సంతృప్తి పరిచేందుకే... వారి వారి సిఫారసుల మేరకు టీటీడీ నెత్తిన ఈ జంబో పాలక మండలిని కూర్చోబెట్టినట్లు విమర్శలు వస్తున్నాయి.
ఏమిటీ ‘ప్రత్యేకత’
గతంలో టీటీడీ బోర్డు కేవలం 18 మంది సభ్యులకే పరిమితం! వైసీపీ వచ్చీ రాగానే దీనిని విస్తరించే కార్యక్రమం చేపట్టింది. 2019లో ఏర్పాటైన పాలకమండలిలో సభ్యుల సంఖ్యను 18 నుంచీ 37కు పెంచేశారు. ఇప్పుడు ఏకంగా 81కి చేశారు. ఇందులో సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులను పక్కనపెడితే... 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల కథ మరీ ‘ప్రత్యేకం’. వీరికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ఓటింగ్ హక్కు లేదు. కనీసం పాలకమండలి సమావేశంలో కూడా వీళ్లు పాల్గొనలేరు. మరి వీరేం చేస్తారంటే... ఏమీ చేయరు. కొండపై ప్రత్యేక మర్యాదలను మాత్రం అనుభవిస్తారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ‘ప్రొటోకాల్’ మొత్తం ప్రత్యేక ఆహ్వానితులకూ వర్తిస్తుంది. అంటే... వారితో సమానంగా తగిన మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనాలకు సిఫారసులూ చేయవచ్చు. అదీ అసలు విషయం!
భక్తులకు మరింత కష్టం...
టీటీడీ జంబో పాలకవర్గంతో సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం మరింత కష్టం కానుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి సాధారణ భక్తుల నిరీక్షణ సమయం విపరీతంగా పెరిగిపోతుంది. గతంలో రోజువారీ బ్రేక్ దర్శనాల సంఖ్య 2500కు మించేది కాదు. అసాధారణ రోజుల్లో కూడా 3వేల లోపే వుండేది. వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఈ సంఖ్య 4 వేలు దాటింది. దీంతో బ్రేక్ సమయం 4 గంటలు పడుతోంది. ఇన్ని గంటలపాటూ సాధారణ భక్తులకు దర్శనాలు ఉండవు. తాజాగా ఏర్పడిన జంబో బోర్డుతో రోజువారీ బ్రేక్ దర్శనాల సంఖ్య 5 వేలు దాటడం ఖాయం. బోర్డులో ఉన్న సభ్యులకు రోజుకు 20 బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయిస్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీని బట్టి ఆ సంఖ్యను 12కు కుదిస్తారు. ఇవిగాక సుపథం ద్వారా దర్శనాల కోసం ఒక్కొక్కరికీ 20 చొప్పున రూ. 300 దర్శన టికెట్లు కేటాయిస్తారు. ఈ లెక్కన 81 మంది సభ్యుల కోసమే ప్రతి రోజూ 3200 టికెట్లు టీటీడీ కేటాయించాలి. వీటిలో సగం బ్రేక్ దర్శన టికెట్లు. ఇక చైర్మన్, చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిఫారసులకు లెక్కే లేదు. వెరసి... వీఐపీ బ్రేక్ దర్శనం గంటలకొద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దర్శనం కోసం పడిగాపులు కాసే భక్తులు అప్పుడప్పుడు సహనం నశించి నిరసనలకు దిగుతున్నారు. జంబో బోర్డుతో ఈ నిరసనలు మరింత పెరగనున్నాయి.
దేవుడికీ భారమే...
ఇక జంబో పాలకవర్గంలోని 81 మంది సభ్యులకు వారి ఓటింగ్ హక్కు, నిర్ణయాధికారాలతో సంబంధం లేకుండా ‘ప్రొటోకాల్’ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే... వారు కొండపై దిగిన వెంటనే గదులను, వాహనాలను, సిబ్బందిని కేటాయించాలి. 30 మంది విషయంలో ఇదేమంత సమస్య కాదు. కానీ... ఇప్పుడు అదనంగా 50 మంది ప్రత్యేక ఆహ్వానితులూ వచ్చి చేరారు. వీరికీ, వీరి కుటుంబ సభ్యులకు, వీరి సిఫారసులతో వచ్చే వారికీ కొండపైన గదులు కేటాయించాల్సిందే. ప్రత్యేక దినాల్లో బోర్డు సభ్యులకే 200 నుంచీ 300 గదులు కేటాయించాలి. వైకుంఠ ఏకాదశి వంటి సందర్భాల్లో పాసులకు, గదులకు వీరి సిఫారసులతో మరింత డిమాండ్ ఏర్పడనుంది. బ్రహ్మోత్సవాలకూ అదే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో సభ్యులు 18 మంది మాత్రమే కనుక సులువుగా వాహనాలు కేటాయించేవారు. ఇపుడు 81మందికి వాహనాలు కేటాయించాల్సి రావడం టీటీడీకి తలనొప్పిగా మారనుంది. మరోవైపు సభ్యులు తిరుమలకు వచ్చినపుడు ప్రొటోకాల్‌లో భాగంగా ఒకరిద్దరు సిబ్బందిని కేటాయించాలి. ఇదంతా టీటీడీకి భారమే!
మంత్రి పదవులకు బదులు...
మంత్రివర్గంలో స్థానం కోరుకుంటున్న గొల్ల బాబూరావు, కాటసాని రాంభూపాల్ రెడ్డికి ‘టీటీడీ సభ్యత్వం’తో చెక్ పెట్టారు. ఇక తనకు మంత్రి పదవి దక్కదని గొల్ల బాబూరావు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయనను విజయసాయి రెడ్డి ఊరడించేందుకు ప్రయత్నించినా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదన్న ప్రచారం జరుగుతోంది.
కలిసొచ్చిన బీజేపీ పెద్దల వైఖరి
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు తెలియకుండా చాలామంది కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు టీటీడీలో తమ వారికి సభ్యత్వం కల్పించేందుకు ప్రయత్నించారు. అధికారపక్షానికి చెందిన కొందరు ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసినప్పుడు... ‘మీకు బాగా కావాల్సిన వారెవరైనా ఉంటే చెప్పండి. టీటీడీ బోర్డులో నియామకానికి పరిశీలిస్తాం’ అంటూ ప్రత్యేక ఆఫర్‌లు ఇచ్చారు. ఈ వ్యవహారం ఆదిలోనే బెడిసి కొట్టింది. పైరవీల సంగతి గుప్పుమంది. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తికి అవకాశం కల్పించాలని తాను చేసిన సిఫారసును ఉపసంహరించుకుంటున్నట్లుగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ టీటీడీకి లేఖ రాయాల్సి వచ్చింది. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎవరినీ సిఫారసు చేయవద్దని కేంద్ర పెద్దలు స్పష్టం చేశారు. ఇది జగన్‌కు బాగా కలిసొచ్చింది. తనకు నచ్చిన, తన అవసరాలకు తగిన విధంగా సభ్యులను నియమించుకునే అవకాశం లభించింది.
కొసమెరుపు:
నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకే కేటాయిస్తున్నట్లు వైసీపీ పెద్దలు ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ, టీటీడీలో నలుగురంటే నలుగురు మహిళలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించారు.
ఎవరి ‘అవసరం’?
నామినేటెడ్ పోస్టుల్లో ఎవరిని నియమించాలన్నది పూర్తిగా సీఎం ఇష్టమే. కానీ... టీటీడీ పరిస్థితి వేరు. ఆధ్యాత్మిక, సేవా భావాలు ఉన్న వారినే బోర్డులో నియమించాలి. కానీ... దీనిని కూడా రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
24 మందితో ప్రకటించిన టీటీడీ పాలక మండలి సభ్యులలో 70 శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. అందులోనూ అత్యధికులు బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలే.
జగన్ ఆక్రమాస్తుల కేసులో సహ నిందితుడిగా ఉన్న ఇండియా సిమెంట్స్‌కు రెండోసారి అవకాశం కల్పించారు. మైహోం అధిపతి జూపల్లి రామేశ్వరరావుకూ రెండోసారి చాన్స్ లభించింది.
జగన్ కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న హెటిరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డిని కూడా బోర్డు సభ్యుడిని చేశారు.
ఎంఎ్‌సఎన్ ఫార్మా ల్యాబ్స్, ఫార్మా కంపెనీల అధినేత, జడ్చర్లలో రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనే మన్నె జీవన్‌రెడ్డికి అవకాశం కల్పించారు.
కాప్రి గ్లోబల్, ఎల్‌ఐసీ హౌసింగ్ స్కామ్‌లో సీబీఐ కేసులో నిందితుడు .. ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త రాజేశ్ శర్మకు కూడా పాలక మండలిలో సభ్యత్వం కల్పించారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నేరాభియోగాలతో అరెస్టయిన మాజీ చైర్మన్ కేతన్ దేశాయ్‌ని స్వామి సన్నిధికి చేర్చారు.
పుదుచ్చేరిలో కాంగ్రెస్ సర్కారు పతనానికి కారణమై, బీజేపీకి సహకరించినట్లు ఆరోపణలున్న మల్లాడి కృష్ణారావుకు ముందస్తు ఒప్పందం ప్రకారమే టీటీడీ సభ్యత్వం దక్కిందనే ప్రచారం జరుగుతోంది.
బెంగళూరులో జగన్ ప్యాలెస్ ఉన్న ఎలహంక నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డికీ బోర్డు పదవి దక్కింది.
Updated Date - 2021-09-17T08:10:16+05:30 IST