సరిహద్దుల్లో అఫ్ఘాన్ల బారులు!

ABN , First Publish Date - 2021-09-02T08:47:04+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబూల్‌లోని విమానాశ్రయాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకొని మూసివేశారు.

సరిహద్దుల్లో అఫ్ఘాన్ల బారులు!

  • దేశం దాటేందుకు ప్రయత్నం
  • తాలిబాన్ల సర్కారుకు హయబతుల్లానే చీఫ్‌!
  • ఉపసంహరణ సరైన నిర్ణయమే: బైడెన్‌ 
  • కశ్మీర్‌కు స్వేచ్ఛ కల్పించాలి: అల్‌-కాయిదా


న్యూఢిల్లీ/కాబూల్‌/వాషింగ్టన్‌, సెప్టెంబరు 1: అఫ్ఘానిస్థాన్‌లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.  కాబూల్‌లోని విమానాశ్రయాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకొని మూసివేశారు. పాశ్చాత్య దేశాలు తమ పౌరులు, సైనికుల తరలింపు సందర్భంగా విమానాశ్రయాన్ని నాశనం చేశాయని.. మరమ్మతుల అనంతరం పునరుద్ధరిస్తామని తాలిబాన్ల సీనియర్‌ నేత అనాస్‌ హక్కానీ బుధవారం ప్రకటించారు. కాబూల్‌ విమానాశ్రయం నుంచి అతి త్వరలోనే రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు. విమానాశ్రయాన్ని మూసివేయడంతో అఫ్ఘాన్‌ను వీడాలనుకుంటున్న వారు సరిహద్దుల బాట పట్టారు. దేశ సరిహద్దుల వద్ద, దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలు పెద్దసంఖ్యలో బారులు తీరారు. తాలిబాన్ల సుప్రీం కమాండర్‌ హయబతుల్లా అఖుంద్జాదా నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గ్రూపు సాంస్కృతిక కమిషన్‌ సభ్యుడు బిలాల్‌ కరీమీ  తెలిపారు. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలకు ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని చెప్పారు. పంజ్‌షీర్‌ నేతలతో తాలిబాన్లు జరిపిన చర్చలు విఫలమైనట్లు సీనియర్‌ తాలిబాన్‌ నేత అమీర్‌ ఖాన్‌ ముత్తాకీ చెప్పారు.


పంజ్‌షీర్‌లో  మిలీషియా సేనలకు, తాలిబాన్లకు మధ్య జరి గిన కాల్పుల్లో 34 మంది తాలిబాన్లు హతమయ్యారని  వార్తా సంస్థలు తెలిపాయి. కాగా,  లెవాంట్‌ (సిరియా, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌లోని కొన్ని ప్రాంతాలు), సోమాలియా, యెమెన్‌, కశ్మీర్‌ వంటి ఇస్లామిక్‌ గడ్డలకు కూడా ఇస్లామ్‌ శత్రువుల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలని అల్‌-కాయిదా ఓ ప్రకటనలో కోరింది. కాగా, అఫ్ఘానిస్థాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి సమర్థించుకున్నారు.


అమెరికా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు అఫ్ఘాన్‌లో బలగాలను కొనసాగించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ‘మీపై మా పోరు ఇంకా ముగియలేదు’ అంటూ ఐఎస్‌ ఉగ్రవాదులను హెచ్చరించారు.  ఉగ్రవాదంపై పోరులో అమెరికా, భారత్‌ కలిసి పనిచేయాలని భారతీయ అమెరికన్‌, చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి చెప్పారు.  అఫ్ఘానిస్థాన్‌ విషయంలో అమెరికా సాధించింది శూన్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విమర్శించారు.  అఫ్ఘాన్‌ పరిణామాల ద్వారా దేశంలో ప్రజలను మత ప్రాతిపదికన విడదీసి ఎన్నికల ప్రయోజనాలు పొందేందుకు అనుమతించరాదని, అలాంటి ప్రయోజనాలను గట్టిగా ఎదుర్కోవాలని భారతదేశంలోని ప్రముఖులు, సీనియర్‌ జర్నలిస్టులు మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 


భారీ మూల్యమే..!    

అఫ్ఘాన్‌లో అమెరికా శకం ముగిసింది. 20 ఏళ్లలో అఫ్ఘాన్‌ కొంత అభివృద్ధి చెందినా, అక్కడి పరిస్థితులు మాత్రం అమెరికాకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చాయి.  అఫ్ఘాన్‌ కోసం అమెరికా భారీగా అప్పులు చేసింది. బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కాస్ట్స్‌ ఆఫ్‌ వార్‌ పేరిట రూపొందించిన నివేదికలో అమెరికా అఫ్ఘాన్‌లో చేసిన యుద్ధంలో  9,29,000 మంది మరణించారని వెల్లడించింది. ఈ యుద్ధం వల్ల దాదాపు రూ.620 లక్షల కోట్లు (8 ట్రిలియన్‌ డాలర్లు) ఖర్చయినట్లు వివరించింది. 

Updated Date - 2021-09-02T08:47:04+05:30 IST