కొత్తగా ఎల్లో ఫంగస్.. ఇది మరీ డేంజర్!
ABN , First Publish Date - 2021-05-24T19:28:01+05:30 IST
దేశంలో కొత్తగా మరో ఫంగస్ బయటపడింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో పాటు బ్లాక్, వైట్ ఫంగస్‌లో సతమతమవుతుంటే తాజాగా ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది.
ఘజియాబాద్: దేశంలో కొత్తగా మరో ఫంగస్ బయటపడింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో పాటు బ్లాక్, వైట్ ఫంగస్‌లతో సతమతమవుతుంటే తాజాగా ఎల్లో ఫంగస్ పుట్టుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో తొలి ఎల్లో ఫంగస్ కేసు నమోదు అయింది. ఈ ఎల్లో ఫంగస్.. బ్లాక్, వైట్ ఫంగస్‌ల కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎల్లో ఫంగస్ బారిన పడిన తొలి రోగి ప్రస్తుతం ప్రముఖ ఈఎన్‌టీ డాక్టర్ బ్రిజ్ పాల్ త్యాగి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎల్లో ఫంగస్ వ్యాధి ఉన్నవారిలో నీరసం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం తదితర లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో చీము కారే లక్షణం కూడా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్లో ఫంగస్‌కు యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్‌తో చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.
ఎల్లో ఫంగస్‌కు ప్రధాన కారణాలివే..
ఎల్లో ఫంగస్ ప్రధానంగా పరిశుభ్రత లేకపోవడం వల్లే వ్యాపిస్తుంది. ఇంటి లోపల, బయట వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నిల్వ ఉన్న పదార్థాలు ఫంగస్ పెరుగుదలకు దోహదపడుతాయి. కావున వీలైనంత వరకు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. ఇంట్లో తేమ శాతం ఎక్కువ ఉన్నా.. బ్యాక్టీరియా, ఫంగస్ పెరుతాయి. కావున తేమ స్థాయి 30 నుంచి 40 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి.