‘ఆంధ్రజ్యోతి’ తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ హఠాన్మరణం
ABN , First Publish Date - 2022-06-06T09:38:15+05:30 IST
సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్(51) హఠాన్మరణం చెందారు.
- క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటు
- ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి
- జర్నలిజంలో అంచలంచెలుగా ఎదిగిన శ్రీనివాస్
పరకాల/హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్(51) హఠాన్మరణం చెందారు. ఆదివారం ఉదయం హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పరకాల క్రికెట్ క్లబ్ (పీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యారు. క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు గతంలో జట్టులో ఆడి మృతి చెందిన తోటి మిత్రులకు సంతాప సూచకంగా శ్రీనివాస్ మౌనం పాటించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన మృతికి సంతాపం ప్రకటించాల్సి రావడం అత్యంత బాధాకరమైన విషయమని మిత్రులు విలపించారు. శ్రీనివాస్ మంచి క్రికెట్ ఆటగాడు. కాలేజీ రోజుల్లో తోటి మిత్రులతో కలిసి పరకాల క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేశారు. ఈ క్లబ్ తరఫున నిర్వహించే క్రికెట్ మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడేవారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పాతమిత్రులంతా ఒకసారి కలుసుకొని మరోసారి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు శ్రీనివాస్ శనివారం రాత్రి పరకాలకు చేరుకున్నారు. మిత్రుడి ఇంట్లో బస చేశారు. ఉదయం పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకొని మ్యాచ్‌లో పాల్గొన్నారు. ఓపెనర్‌గా దిగి 12 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేశారు. బాగా అలసిపోవడంతో బై రన్నర్ కోసం అడిగారు. ఆయన ఇబ్బందిని గమనించిన మిత్రులు వారించడంతో గ్రౌండ్‌లో తన కారులోనే కొద్దిసేపు సేదతీరారు. అక్కడి నుంచి తాను బసచేసిన మిత్రుడి ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి మరింత అస్వస్థతకు లోనయ్యారు. మిత్రులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
కన్నీరుమున్నీరు..
స్నేహితులతో కలిసి కాలేజీ రోజుల్లోని జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకరోజంతా గడపాలని హైదరాబాద్ నుంచి తన స్వస్థలమైన పరకాలకు వచ్చిన శ్రీనివాస్ అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడంతో మిత్రులంతా కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాస్ హఠాన్మరణంతో పరకాల పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాస్ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శ్రీనివాస్ అంత్యక్రియలు పరకాల చలివాగు వద్ద గల వైకుంఠధామంలో సాయంత్రం జరిగాయి.
అంచలంచెలుగా..
మెండు శ్రీనివాస్ స్వస్థలం పరకాల మండలంలోని నాగారం గ్రామం. శ్రీనివా్‌సకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు పుష్పక్, ముకేష్ ఉన్నారు. మధ్యతరగతి చేనేత కుటుంబంలో జన్మించిన శ్రీనివా్‌సకు ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కలు ఉన్నారు. పాఠశాల విద్యాభ్యాసం పరకాలలోని శిశుమందిర్, పరకాల ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ (బీఎస్సీ) హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పూర్తి చేశారు. జర్నలిజం కోర్సు కూడా చేశారు. కర్ణాటకలో డిఫార్మసీలో పట్టా తీసుకున్నారు. జర్నలిజంపై ఉన్న మక్కువతో పత్రికా రంగంలో అడుగుపెట్టారు. భూపాలపల్లి ఈనాడు విలేకరిగా ఆయన ప్రస్థానం మొదలైంది. తర్వాత వార్త రిపోర్టర్‌గా పనిచేశారు. అనంతరం వార్త జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. నిజాయతీకి మారు పేరుగా, నిర్భయంగా పనిచేసిన శ్రీనివాస్.. అవినీతి, అక్రమాలపై అనేక సంచలన కథనాలను రాశారు. జగిత్యాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడంపై వరుస కథనాలు రాసినందుకు ఆయనపై హత్యాయత్నం జరిగింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత గుంటూరు స్టాఫ్ రిపోర్టర్‌గా పని చేశారు. కొంతకాలానికి స్టాఫ్ రిపోర్టర్‌గా కరీంనగర్ జిల్లాకు తిరిగి వచ్చారు. తర్వాత ‘ఆంధ్రజ్యోతి’ స్టేట్ పొలిటికల్ బ్యూరోలో చేరారు. తదనంతరం స్టేట్ బ్యూరో చీఫ్‌గా ఎదిగారు.
సమాజానికి లోటు
‘పాత్రికేయుడిగానే కాకుండా వ్యక్తిగా మెండు శ్రీనివాస్ చాలా మంచివాడు. ఎలాంటి బేషజాలు లేనివాడు. చిన్నస్థాయి నుంచి కష్టపడి బ్యూరో చీఫ్ స్థాయికి వచ్చాడు. శ్రీనివాస్ మరణం తెలంగాణ ఉద్యమానికే కాదు యావత్ తెలంగాణ సమాజానికే తీరని లోటు’ అని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ నివాళులు అర్పించారు.
సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం
శ్రీనివాస్ ఆకస్మిక మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సంతాపం తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ అకాల మరణం దిగ్ర్భాంతిని కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు..
శ్రీనివాస్ మరణం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
‘ఆంధ్రజ్యోతి’ నివాళి
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, అసిస్టెంట్ ఎడిటర్లు కె.కృష్ణప్రసాద్, వక్కలంక వెంకటరమణ, రాహుల్ కుమార్, ఏబీఎన్ తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ తదితరులు పరకాలకు చేరుకొని శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.