Vijayawada Temple: మూలా నక్షత్రం రోజు బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా..?
ABN , First Publish Date - 2022-10-02T00:31:01+05:30 IST
దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యమైన మూలా నక్షత్రం నాడు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి లక్షన్నర నుంచి..
విజయవాడ: దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యమైన మూలా నక్షత్రం నాడు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, ఆ రద్దీకి తగినట్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ దిల్లీరావు తెలిపారు. మీడియా పాయింట్ వద్ద శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2 ఆదివారం అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని తెల్లవారుజాము రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే దర్శనంలో మొదటి గంట వీవీఐపీలు, హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకుంటారని తెలిపారు.
మూడు గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనం ఉంటుందని, ఆరోజు వీవీఐపీలకు, వృద్ధులకు, వికలాంగులకు ఎటువంటి దర్శనాలు ఉండవని, ఎటువంటి టిక్కెట్లు ఉండవని అందరికీ ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని వారు గమనించాలని, క్యూలైన్ ద్వారా వచ్చే ప్రతి భక్తుడికీ అమ్మ దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈరోజు వరకూ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని అందుకు నిరంతరం పనిచేస్తున్న పోలీసు వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.