Kollu Ravindra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహి
ABN , First Publish Date - 2022-12-07T14:14:11+05:30 IST
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహి అని టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహి అని టీడీపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Former minister Kollu Ravindra) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బీసీ గర్జన పేరుతో బీసీలను మోసం చేస్తున్నారన్నారు. బీసీల ప్రాణాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పునాది వేసుకొందని తెలిపారు. జగన్ కొద్ది మంది బీసీలకు పదవుల బిస్కెట్ వేసి కుక్కల్లా మొరిగిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు (TDP Chief Chandrababu) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు విదేశీ విద్య అందించామని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మార్చి విద్యా దీవెన పేరుతో విద్యార్థులను మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్మెంట్ అందించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 6 లక్షల మంది విద్యార్థులకు విద్యా దీవెన అందిస్తోందన్నారు. 54మందికి కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినా కుర్చీలు కూడా లేవని తెలిపారు. రాష్ట్రాన్ని సామాంతరాజులుగా విడగొట్టి విజయసాయిరెడ్డి, సజ్జల రామక్రిష్ణ రెడ్డి ,వైవి సుబ్బారెడ్డిలకు అప్పగించారని మండిపడ్డారు. బీసీ అభివృద్ధి కోసం ఏటా బడ్జెట్లో రూ.10 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి.. కేవలం రూ.150 కోట్లు కేటాయించారని కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు.