ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్ర్దత కోల్పోని పాత్రికేయుడు

ABN, First Publish Date - 2022-06-07T06:21:09+05:30

సంచలనాల కోసం వెంపర్లాడకుండా, వాస్తవాలను పలుమార్లు వడబోసి, నిజాలను నిగ్గు తేల్చి ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా పాఠకలోకానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంచలనాల కోసం వెంపర్లాడకుండా, వాస్తవాలను పలుమార్లు వడబోసి, నిజాలను నిగ్గు తేల్చి ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా పాఠకలోకానికి నిజాయితీగా ఎప్పటికప్పుడు అందించిన ఆత్మీయ మిత్రుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సహచరుడు మెండు శ్రీనివాస్ హఠాన్మరణం ఒక నమ్మలేని నిజం! ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి, కలచివేతకు గురిచేసిన అకాల మరణమది. నిశ్శబ్దంగా తనపని తాను చేసుకుపోతూ విరామం లేకుండా పరిశ్రమించే శ్రీనివాస్ ఈ కాలంలో చాలా అరుదుగా కనిపించే నిఖార్సయిన జర్నలిస్టు. ప్రతిక్షణం సమాజ హితాన్ని, బడుగుల అభ్యున్నతిని, పేదల కష్టసుఖాలను గురించి పరితపించే గుండెకింద తడిఆరని గుణవంతుడు మెండు శ్రీనివాస్.


మెండు శ్రీనివాస్‌తో నాకు మూడు దశాబ్దాలుగా లోతైన, గాఢమైన పరిచయమున్నది. మా మధ్యన నిగూఢంగా కలగలిసిఉన్న భావసారూప్యత ఇందుకు మరింత దోహదపడింది. ఈ మూడు దశాబ్దాల పరిచయంలో శ్రీనివాస్ ఆలోచనా ధోరణులను, విశ్లేషణాత్మక వివేచనను, ప్రతిస్పందనా పద్ధతులను, అందుకు సంబంధించిన సందర్భాలను మననం చేసుకున్నప్పుడు ఆయన ‘లోపలి మనిషి’ని అంచనా వేయడం అంత సులభం కాదనిపించింది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా, సూటిగా, చాలా సూక్ష్మమైన పద్ధతిలో వెల్లడించడం శ్రీనివాస్‌లో నాకు నచ్చిన అనేకమైన మంచి లక్షణాలలో ప్రధానమైనది. 


1993లో శ్రీనివాస్ పత్రికా రంగంలోకి ప్రవేశించిన సమయంలో నేను ఒక ఇంగ్లీష్‌ దినపత్రికలో ‘కోల్‌బెల్ట్’ ప్రతినిధిగా ఉన్నాను. రామగుండం నుంచి రిపోర్టర్‌గా పనిచేస్తూ, గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షుని బాధ్యతల్లో ఉండేవాణ్ణి. సింగరేణి తరఫున కోల్ ఇండియా ప్రాంతాల అధ్యయనానికి ప్రెస్ టూర్ నిర్వహించిన అనంతరం గోదావరిఖనిలో ‘కోల్‌బెల్ట్ ప్రాంతాల పాత్రికేయుల సదస్సు’ నిర్వహించిన సందర్భంలో భూపాలపల్లిలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాకు పరిచయమయ్యారు. సింగరేణి గనికార్మికుల జీవితాలను గురించి, అండర్ గ్రౌండ్ బొగ్గుగనుల్లో దుర్భరమైన పని పరిస్థితులను గురించి అనేక ఆసక్తికరమైన వార్తా కథనాలను ఆయన రాయడంవల్ల తోటి పాత్రికేయులుగా మేమిద్దరం వృత్తిరీత్యా సన్నిహితం కాగలిగాము. ఆ తర్వాత నేను ఒక తెలుగు దినపత్రికలో నిజామాబాద్ ఎడిషన్ చీఫ్ రిపోర్టర్‌గా చేరడం, శ్రీనివాస్ కూడా అదే పత్రికలో పనిచేయడం మూలంగా సింగరేణికి సంబంధించిన వార్తా రచనలో నా అభిప్రాయాలను తెలుసుకునేవాడు. ఆ తర్వాత శ్రీనివాస్ వృత్తిరీత్యా గుంటూరు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న సమయంలో నేను తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం పూర్తికాలం కేటాయించడంతో... జర్నలిజం వృత్తికి సంబంధించిన మిత్రులతో పూర్వపు సంబంధాలను కొనసాగించలేక పోయాను. అయితే శ్రీనివాస్ ‘ఆంధ్రజ్యోతి’ స్టేట్ బ్యూరోలో చేరిన తర్వాత 2009 జూన్ 19న ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ ఆధ్వర్యంలో ‘ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల సందర్శన’ పేరుతో హైదరాబాద్ నుంచి రామగుండం సందర్శన నిర్వహించాం. ఈ పర్యటనకు సంబంధించి పాత్రికేయుల అనుభవాల ఆధారంగా ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల విధ్వంసం మీద మేము 2010 నవంబర్‌లో వెలువరించిన ‘భూమి పుండు’ సంకలనంలో ‘ఓపెన్‌కాస్ట్ బాధితుల గోస’ అనే మానవీయ కథనం శ్రీనివాస్‌లో నిగూఢమైన మానవతాధృక్పథానికి ఒక తార్కాణం.


రామగుండం పర్యటన తర్వాత మా ఇద్దరి స్నేహం మరింత బలపడటానికి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కార్యాచరణ ఒక ఉమ్మడి వేదికగా ఉపయోగపడింది. ‘ఆంధ్రజ్యోతి’ నుంచి స్టేట్ బ్యూరో తరఫున ఉద్యమ‌ వార్తలను సేకరించే బాధ్యతను నిర్వహించిన శ్రీనివాస్, టీజేఏసీ రాష్ర్ట సమన్వయకర్తగా ఉద్యమ సంస్థలన్నింటినీ సమన్వయపరిచే కీలక బాధ్యత నిర్వహించిన నేను అనేక విషయాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేవాళ్లం. వాస్తవానికి ఉద్యమవార్తలను ఉద్యోగబాధ్యతగాకంటే, ఉద్యమ ప్రయోజనాల దృష్టికోణంలోనే అప్పటి జర్నలిస్టు మిత్రులందరూ నివేదించేవారు. ఆ బృహత్తర బాధ్యతల నిర్వహణలో నాతో సన్నిహితంగా, చనువుగా వ్యవహరించిన వారిలో శ్రీనివాస్ అనేక ప్రత్యేకతలు కలిగిన మిత్రుడు. 


పిట్టల రవీందర్

సీనియర్ జర్నలిస్టు

Updated Date - 2022-06-07T06:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising