ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పులు చేసీ పుంజుకుంటున్న బీజేపీ!

ABN, First Publish Date - 2022-11-09T01:13:22+05:30

ఆరేళ్ల క్రితం నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాత్రి 8 గంటలకు ప్రజల ముందుకు వచ్చి దేశంలో రూ.1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరేళ్ల క్రితం నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాత్రి 8 గంటలకు ప్రజల ముందుకు వచ్చి దేశంలో రూ.1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచి మొత్తం 84.5 శాతం కరెన్సీ రద్దయింది. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఈ నవంబర్ 8 తో ఆరేళ్లు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టులో ఈ అంశంపై జరుగుతున్న విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయినందువల్ల అసలు విచారణే అనవసరమని, అకడమిక్ చర్చ జరగడమే తప్ప ఈ నిర్ణయం తప్పా, ఒప్పా అన్న అంశాన్ని తేల్చడం వల్ల ఒరిగేదేమి ఉండదని అటార్నీ జనరల్ వెంకటరమణి ఇటీవల కోర్టు ముందు వాదించారు. ఆర్థిక విధానంలో భాగంగా తీసుకున్న నిర్ణయంపై కోర్టులో ప్రశ్నించలేమని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనాన్ని అరికట్టగలిగామని, డిజిటలైజేషన్ ప్రక్రియను దేశంలో వేగవంతం చేసి ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసి దళారీలను నిర్మూలించగలిగామని ప్రధాని మోదీ అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. ఆయన ఆశించిన లక్ష్యాలు పూర్తిగా నెరవేరి ఉంటే ప్రజలు ఎంతో సంతోషించి ఉండేవారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం ఎంతవరకు రద్దయింది? అని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వేసిన ప్రశ్నకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది. దేశంలో సర్క్యులేషన్‌లో ఉన్న 86.4 శాతం కరెన్సీ అంటే రూ.15.44 లక్షల కోట్ల విలువైన కరెన్సీని రద్దు చేస్తే అందులో రూ. 16వేల కోట్లు తప్ప మిగతా మొత్తం బ్యాంకులకు తిరిగివచ్చిందని రిజర్వు బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. పార్లమెంట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ కూడా ఇదే సమాధానం చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేవలం 0.0027 శాతం నకిలీ కరెన్సీనే పట్టుకోగలిగారు. ఈ నకిలీ కరెన్సీలో అధిక భాగం మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ. వంద రూపాయల నోట్లే.

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో రూ. 3 నుంచి 4 లక్షల కోట్ల నల్లధనం మాయమైపోగలదని మోదీ ప్రభుత్వం విశ్వసించింది. అందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్దేశం ఎంత మంచిది అయినప్పటికీ ఎటువంటి చర్చలు లేకుండా చేపట్టే చర్యలు సత్ఫలితాల నిస్తాయా? ఇవ్వవని నోట్ల రద్దు వ్యవహారంతో స్పష్టమయింది. ఆ నిర్ణయం వల్ల నల్లధనం ఏ మాత్రం వ్యవస్థనుంచి తొలగిపోలేదు సరికదా దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అనేక హోల్‌సేల్ మార్కెట్లు మూతపడ్డాయి. రిటైల్ దుకాణాల్లో అమ్మకాలు పడిపోయాయి. దాదాపు 15 కోట్లమంది రోజువారీ కార్మికులు పని కోల్పోయారు. రద్దుచేసినంత వేగంగా కొత్త నోట్లను ప్రింట్ చేయకపోవడంతో బ్యాంకుల ముందు సామాన్య ప్రజలు బారులు తీరారు. వీరిలో పలుకుబడి గల పెద్ద మనుషులెవరూ లేరు. మళ్లీ కొత్త నోట్లు మార్కెట్‌లో ప్రవేశించి యథాతథ స్థితి ఏర్పడడానికి దాదాపు సంవత్సరం పట్టింది. కొత్త నోట్లు ప్రింట్ చేసేందుకు ప్రభుత్వం అదనంగా రూ. 5వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ‘మీరు పర్యవసానాలు ఆలోచించే నోట్లు రద్దు చేశారా?’ అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నకు కూడా ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోయింది.

నల్లధనం అనేక రూపాల్లో కొనసాగుతున్నదని ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో తేలింది. ఆస్తుల కొనుగోలు చేసిన 70 శాతం మంది తాము పాక్షికంగా నగదు రూపేణా చెల్లించామని తెలిపారు. నోట్లరద్దుకు ముందుకంటే ఎక్కువ శాతం కోట్లాది రూపాయలు నగదు రూపేణా చలామణి అవుతోందని తెలుస్తోంది. రద్దయిన పాత రూ. 1000 నోట్ స్థానంలో అందంగా ముస్తాబైన కొత్త రూ. 2000 కరెన్సీ నల్లధన లక్ష్మి దేశమంతటా సంచరించేందుకు ఎక్కువకాలం పట్టలేదు. ఇంతెందుకు? ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో నగదు విచ్చలవిడిగా చేతులు మారిందని అందరికీ తెలిసింది. మద్యం కొనుగోళ్లు నల్లధనం రూపేణా జరిగాయి. రెండున్నర లక్షలమంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో రూ. 200 కోట్ల మేరకు మద్యం అమ్ముడుపోయిందని ఒక అధికారి తెలిపారు. అదే సమయంలో నల్ల ధనం రద్దు మూలంగా డిజిటలైజేషన్ పెరిగిందని ప్రధానమంత్రి చెప్పుకున్న మాటల్లో సత్యం కూడా ఉన్నది. దేశంలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు డిజిటల్ రూపేణా జరుగుతున్నాయన్న విషయం కాదనలేము. కాని ఇది కూడా ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయింది. ఓటర్లకు నగదు ఇచ్చే ఓపిక లేక వారికి గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించామని బిజెపి నేతలే చెప్పుకున్నారు. టెక్నాలజీ అవినీతిని కూడా సులభం చేస్తుందనడంలో సందేహం లేదు.

విచిత్రమేమంటే మోదీ హయాంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల బిజెపికి రాజకీయంగా ఏ మాత్రం నష్టం జరగకపోవడం. ప్రజలు మోదీ సర్కార్ విజ్ఞతను శంకించలేనంత భ్రమల్లో ఉన్నారా, లేక ప్రతిపక్షాల విశ్వసనీయతను అంగీకరించడం లేదా అన్నది చర్చనీయాంశం. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా 2019 ఎన్నికల్లో బిజెపిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించడం ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత సాగు చట్టాల రద్దు, కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం, ద్రవ్యోల్బణం మొదలైన వాటి నేపథ్యంలో కూడా బిజెపి హవా అంతగా తగ్గలేదు. తాజాగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి నాలుగు సీట్లు గెలుచుకోవడం, ఓడిపోయిన సీట్లలో కూడా బిజెపి ఓట్ల శాతం గణనీయంగా పెరగడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ ఉపఎన్నికల ఫలితాలు అనేక సంకేతాలనిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఒక బలమైన రాజకీయ, సామాజిక పునాదిని రూపొందించుకుని ఎటువంటి పార్టీనైనా ఢీకొనగల స్థాయికి చేరుకుంది. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు బిజెపిని ఢీకొనగలిగిన శక్తి లేదని మరోసారి తేలిపోతే బిజెపిని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలు కూడా హోరాహోరీ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అర్థమవుతోంది. అయినప్పటికీ బిజెపిని ఈ దేశంలో ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉన్నది. కాంగ్రెస్ ఆ శక్తిని సముపార్జించుకునేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ ఈ వాస్తవాన్ని ఇంకా గ్రహించవలిసే ఉన్నది. సిట్టింగ్ సీట్లలో ఓడిపోవడం, కొత్త సీట్లలో విజయం సాధించలేకపోవడం ఆ పార్టీ లక్షణంగా మారింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఓట్లను చీల్చే వ్యూహరచన చేయడంలో ప్రతిపక్షాలు బిజెపి నుంచి ఎంతో నేర్చుకోవల్సి ఉంటుంది.

ఉదాహరణకు బీహార్‌లోని గోపాల్ గంజ్ సీటులో బిజెపి ఒంటరి పోరు చేసినా రాష్ట్రీయ జనతాదళ్ – జెడి(యు)– కాంగ్రెస్ కూటమిని 1800 ఓట్ల తేడాతో ఓడించింది. జెడి(యు)తో వేరుపడిన తర్వాత కూడా బిజెపి 41 శాతం ఓట్లను సాధించడం విస్మరించదగిన విషయం కాదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థికి 12,214 ఓట్లు, బిఎస్‌పి అభ్యర్థి 8,507 ఓట్లు సాధించడం. మాయావతి, ఒవైసీలు తమ పార్టీలను పోటీ చేయించి దాదాపు 12 శాతం ఓట్లను కబళించకపోతే ఈ సీటులో బిజెపి విజయం సాధ్యపడేది కాదు. బిహార్‌లో ఎంఐఎం బలపడుతోందని, బిఎస్‌పి కూడా చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలదని, దానివల్ల ప్రతిపక్షాలకు నష్టం, బిజెపికి ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయని వేరే చెప్పనక్కర్లేదు. కొద్ది నెలల క్రితం యూపీలోని సమాజ్‌వాది పార్టీ కంచుకోట అనదగ్గ ఆజంఘడ్‌లో కూడా బిఎస్‌పి ఓట్లు చీల్చడం వల్ల బిజెపి విజయం సాధించగలిగింది. బిహార్‌లో మరో నియోజకవర్గమైన మోకాపాలో బిజెపి ఓడిపోయినప్పటికీ తన స్వంత బలంతో పోటీ చేసి 42 శాతం ఓట్లు సాధించింది. పైగా ఆర్‌జెడి గతంలో సాధించిన 35వేల ఓట్ల ఆధిక్యతను 16వేలకు తగ్గించడం మామూలు విషయం కాదు. బిహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యు), కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్), హమ్, విఐపి తదితర పార్టీలు కట్టగట్టుకుని పోటీ చేసినా బిజెపి ప్రభావాన్ని దెబ్బతీయలేకపోవడం దేనికి సంకేతం? ఒడిషాలో దామన్‌గర్ సీటులో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆకర్షణను, అధికార పార్టీ ప్రభావాన్ని తట్టుకుని బిజెపి గెలుపొందింది. యూపీలోని గోకర్ణనాథ్ నియోజకవర్గంలో కూడా బిజెపి గత ఎన్నికల్లో కంటే అధిక ఓట్లు సాధించింది. ఇవన్నీ బిజెపి బలమైన సామాజిక రాజకీయ పునాదిని నిర్మించుకున్నదనడానికి గట్టి సాక్ష్యాలు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని మునుగోడులో బిజెపి కేవలం పదివేల ఓట్లతో ఓడిపోవడం కూడా తేలిగ్గా తీసివేయదగ్గ అంశం కానేకాదు.

ప్రజా వ్యతిరేకతను అధిగమించడంలోనూ, ఎన్నికల వ్యూహరచనలోనూ, ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేయడంలోనూ, సామాజిక పునాదిని పెంచుకోవడంలోనూ బిజెపి అవలంబిస్తున్న వ్యూహాలను ఢీకొనడం అంత సులభం కాదని స్పష్టమవుతోంది. ఇందుకు ప్రతిపక్షాల సంఘటిత ఐక్య కార్యాచరణ చేయవలిసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పట్ల జనం ఆసక్తిని భారత్ జోడో యాత్ర పెంచుతోంది, సందేహం లేదు. అయితే ఆ పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో విజయానికి ఆ యాత్ర కారణమవుతుందని చెప్పడానికి ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-11-09T01:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising