ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ మినహా బీజేపీ బలమేమిటి?

ABN, First Publish Date - 2022-12-14T01:29:25+05:30

ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పలు ప్రధానమైన అంశాలను స్పష్టం చేశాయి. దేశ రాజకీయాల్లో బిజెపి ఒక ప్రబల శక్తిగా వర్థిల్లడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు పలు ప్రధానమైన అంశాలను స్పష్టం చేశాయి. దేశ రాజకీయాల్లో బిజెపి ఒక ప్రబల శక్తిగా వర్థిల్లడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్న విషయమై ఎవరికీ పెద్దగా భేదాభిప్రాయం లేదు. గుజరాత్ లో బాగా దెబ్బతిన్నప్పటికీ కాంగ్రెస్ ను పూర్తిగా తుడిచిపెట్టడం సాధ్యం కాదని, ప్రజల అసంతృప్తిని ఎదుర్కొనేందుకు కేవలం మోదీ హవా మాత్రమే సరిపోదని హిమాచల్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కాంగ్రెస్ బలహీనమైన చోట ఆమ్ ఆద్మీ లాంటి ప్రాంతీయ పార్టీ ప్రవేశిస్తే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం గతంలో పంజాబ్ నిరూపిస్తే, ఇప్పుడు గుజరాత్ లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకుండా కేవలం 0.1 శాతం ఓట్లు సాధించి, అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోయిన ఆప్ ఈసారి దాదాపు 13 శాతం ఓట్లతో 5 సీట్లు సాధించడం విస్మరించదగిన పరిణామం కాదు. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో 15 శాతం ఓట్లు తగ్గాయి. అందులో కేవలం 5 శాతం బిజెపి వైపు మొగ్గు చూపితే 10 శాతం ఆప్ వైపు మళ్లాయి. మోదీ వ్యక్తిగత ప్రచారంతో పాటు ముక్కోణపు పోటీ వల్ల గుజరాత్ లో బిజెపి ఘన విజయం సాధించడంలో విశేషం లేదు కానీ ప్రతి ప్రాంతంలోనూ సంస్థాగత బలం ఉన్న కాంగ్రెస్ ఇంతగా కునారిల్లిపోవడానికి కారణం ఏమిటి? 2017లో బిజెపి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి ఎందుకు పేలవమైన ప్రదర్శన చేసింది?

రెండు నెలల క్రితం సిఎస్–డిఎస్–లోక్ నీతి నిర్వహించిన సర్వేలో గుజరాత్ లో 54 శాతం మంది ప్రజలు మార్పుకావాలని చెప్పినప్పటికీ ఆ ప్రజల విశ్వాసం చూరగొనడంలో కాంగ్రెస్ విఫలమైంది. మరో వైపు మోదీ గుజరాత్ లో ఇవే తన చివరి ఎన్నికలన్నట్లుగా పోరాడారు. స్వంత గడ్డకు చెందిన నేత ప్రధానమంత్రి కావడం, ఆత్మగౌరవ నినాదాన్ని చేపట్టడం, మీలో ఒకడినంటూ ఎండా, వానల్ని లెక్క చేయకుండా వందలాది కిలోమీటర్లు రోడ్ షోలు నిర్వహించడం ప్రజల్లో సానుభూతిని రేకెత్తించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దుతో పాటు హిందూత్వ ఎజెండా పెద్దగా ఫలించలేదని, కేవలం మోదీ మూలంగానే గుజరాత్ లో మరోసారి విజయం సాధించగలిగామని బిజెపి నేతలే అంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇతర ప్రాంతాల నేతల సభలకు జనం పెద్దగా హాజరు కాలేదు కాని మోదీ సభలకు ప్రజలు వెల్లువెత్తారు.

అయితే గుజరాత్ ఎన్నికల ఫలితాలు దేశ మనోభావాలను ప్రతిబింబిస్తాయా అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఏ రాష్ట్ర ఎన్నికలూ మొత్తం దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబించే అవకాశాలు లేవు. అలా అయితే హిమాచల్ ఎన్నికల ఫలితాలు కూడా దేశ ప్రజల మనోభావాలను ప్రతిఫలిస్తాయని వాదించాల్సి ఉంటుంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలు దేశంలో ఉన్న పరిస్థితికి సంకేతాలు కావని ఎన్ సిపి నేత శరద్ పవార్ అనడంలో వాస్తవం ఉన్నది. 2017లో గుజరాత్, హిమాచల్ లలో బిజెపి విజయం సాధించినప్పటికీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

గుజరాత్ లో కనపడ్డ మోదీ ప్రభంజనం హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు వీయలేదు, మోదీ ప్రచారం చేసిన డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం హిమాచల్ ప్రజలు ఎందుకు స్వీకరించలేదో కూడా చర్చనీయాంశం కావాలి. గుజరాత్ లో లాగా హిమాచల్ లో కూడా ఆయన పూర్తి శక్తి ప్రదర్శించారు. ఆరు నెలల ముందే తన ప్రచారాన్ని ప్రారంభించారు. మే నెలలో ధర్మశాలలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో రెండు రోజుల పాటు సమావేశాలు ఏర్పర్చి మోదీ ప్రసంగించారు. కేంద్రంలో తన ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లయిన సందర్భంగా సిమ్లాలో ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్ తో కలిసి ఓపెన్ జీప్ లో భారీ రోడ్ షోను నిర్వహించారు. అప్పటి నుంచీ నవంబర్ లో ఎన్నికలు జరిగేంత వరకూ హిమాచల్ అంతటా సుడిగాలిలా నెలకు రెండు, మూడు పర్యటనలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఒకే రోజు పలు ర్యాలీలు నిర్వహించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్, ఐఐటి, పలు జల విద్యుత్ ప్రాజెక్టులు, బిలాస్ పూర్ లో ఎయిమ్స్, ఔషధ పరికరాల పార్కు, జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు పుంఖానుపుంఖాలుగా ప్రారంభించారు. మీరు వేసే ప్రతి ఓటు ప్రధానిగా నేను బలం పుంజుకునేలా చేస్తుంది అని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతి, అస్థిరత, కుంభకోణాలు తాండవిస్తాయని, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని హెచ్చరించారు. గుజరాత్ లో లాగా మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, యోగీ ఆదిత్యనాథ్ తో పాటు పలువురు ముఖ్యమంత్రులు సభలు నిర్వహించారు. అయినప్పటికీ హిమాచల్ లో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే కనపడడంతో ప్రజలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. గుజరాత్ లో లాగా హిమాచల్ లో మోదీ స్థానికుడు కారు కనుక అక్కడ ఆత్మగౌరవ నినాదాన్ని మోదీ చేపట్టలేదు. స్థానిక ప్రజల అసంతృప్తిని మోదీ జనాకర్షణ అధిగమించలేకపోయింది. కాంగ్రెస్ లో ఎన్ని లుకలుకలు ఉన్నప్పటికీ ప్రజలు తప్పనిసరి పరిస్థితిలో ఆ పార్టీకి ఓటు వేశారని అర్థమవుతోంది. నిజంగా కాంగ్రెస్ బలోపేతమై, ప్రజల్లో ఉధృతంగా ప్రవేశించి, ప్రజా సమస్యల్ని ప్రస్తావించి కోల్పోయిన అభిమానాన్ని చూరగొంటే ఆ పార్టీ పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదనడంలో సందేహం లేదు.

ఈ విషయం కాంగ్రెస్ పార్టీయే ఆలోచించుకోవాలి. ఇవాళ హిమాచల్ లో స్థానిక కారణాల వల్ల కాంగ్రెస్ గెలిచినప్పటికీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ చాలా దయనీయ స్థితిలో ఉన్నది. 2023లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, తెలంగాణతో పాటు పది రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ భవిష్యత్ ను తేల్చనున్నాయి. 2019లో కాంగ్రెస్ 421 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే 198 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఉత్తరప్రదేశ్ లో ఒకప్పుడు రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేదు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతైంది. భవిష్యత్ లో ఇక ఉత్తరప్రదేశ్ లో పోటీ చేసే విషయం గాంధీ కుటుంబం మరిచిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నిజానికి ప్రస్తుతం దేశంలోని 4033 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకున్న స్థానాలు కేవలం 650 మాత్రమే. 1182 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. 2017 గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటులో డిపాజిట్ కోల్పోగా, ఈ ఎన్నికల్లో 42 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. దాదాపు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేకపోవడమో, లేక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడమో గమనించవచ్చు. ఆప్ మూలంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు క్రమంగా క్షీణించే పరిస్థితి ఏర్పడింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసిన కేరళలోని వాయనాడులో కాంగ్రెస్ కు 64.81 శాతం ఓట్లు రాగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో ఆ పార్టీ ఓట్లు 27 శాతం తగ్గిపోయాయి. కేరళలో మోదీ హవా ఏమీ లేదు. మరి కాంగ్రెస్ ఓట్లు ఎందుకు తగ్గినట్లు? బిజెపి వైపు నుంచి చూస్తే 4033 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి గెలుచుకున్న స్థానాలు 1383 మాత్రమే. ఇందులో దాదాపు 830 సీట్లు గుజరాత్, ఏడు ఉత్తరాది రాష్ట్రాల్లోనే సాధించుకుంది. దేశ వ్యాప్తంగా బిజెపి కూడా దాదాపు 583 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. అసెంబ్లీ స్థానాల రీత్యా బిజెపి మొత్తం సీట్లలో 32 శాతమే గెలుచుకోగలింది, ఇప్పటికీ సగం అసెంబ్లీ సీట్లు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఉన్నాయి. మరి బిజెపి దేశవ్యాప్త పార్టీ అయ్యేందుకు మోదీ రానున్న రెండేళ్లలో మరింత కృషి చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కన్నా ప్రాంతీయ పార్టీలే ఆయనకు ఎక్కువ శిరోభారం అని చెప్పక తప్పదు.

మరో ఏడాదిన్నర కాలంలో సార్వత్రక ఎన్నికలున్న రీత్యా బిజెపి ముందు తీవ్రంగా ఆలోచించదగ్గ అంశాలు ఎన్నో ఉన్నాయి. హిందూత్వ ఎజెండా పనిచేస్తుందా, మోదీ చెప్పుకుంటున్న అభివృద్ధిని ప్రజలు విశ్వసిస్తారా, అవినీతి, వారసత్వ పాలనను వ్యతిరేకిస్తారా అన్నవి ఉండనే ఉన్నాయి. కాని అన్నిటికన్నా ప్రధానమైనది ఎల్లకాలమూ నరేంద్ర మోదీని చూసి ప్రజలు ఓటు వేస్తారా అన్నది. ఇల్లలుకగానే పండగ కానట్లు స్వంత గడ్డ అయిన గుజరాత్ లోనే ఘనవిజయం సాధిస్తే సరిపోదు. అన్ని రాష్ట్రాలు గుజరాత్ దారిలో పయనించాలని ఎక్కడా లేదు. నిజానికి పార్టీ నేతలకు మోదీ నిర్ణయించిన వయోపరిమితి రీత్యా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలే ప్రధానమంత్రిగా మోదీ చివరి ప్రచారం అనుకోవాల్సి ఉంటుంది. 2027 ఎన్నికల నాటికి ఆయన వయసు 75 సంవత్సరాలు దాటిపోతుంది. మోదీ హవా ఉన్నప్పుడే హిమాచల్ లో బిజెపి ఓడిపోయింది. మోదీ హవా పనిచేయకపోయినా, లేక మోదీ పదవీవిరమణ చేసినా బిజెపికి ఆలంబన ఎవరు?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-12-14T01:29:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising