పత్రికా స్వేచ్ఛతో ఎవరికి నష్టం?
ABN, First Publish Date - 2022-12-07T01:11:55+05:30
ప్రపంచ మీడియా సమ్రాట్ రూపర్ట్ మర్డోక్ 2005లో మన దేశానికి వచ్చారు. టాటా సంస్థతో కలిసి భారత దేశంలో డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) ప్రసారాలను...
ప్రపంచ మీడియా సమ్రాట్ రూపర్ట్ మర్డోక్ 2005లో మన దేశానికి వచ్చారు. టాటా సంస్థతో కలిసి భారత దేశంలో డీటీహెచ్ (డైరెక్ట్ టు హోమ్) ప్రసారాలను కైవసం చేసుకోవడం, ఒక పెద్ద టీవీ సంస్థలో మెజారిటీ వాటాలను స్వాధీనపరుచుకోవడం ఆయన లక్ష్యం. ఈ విషయమై నాటి సమాచార మంత్రి జైపాల్ రెడ్డితో చర్చించేందుకై రూపర్ట్ మర్డోక్ శాస్త్రిభవన్కు వచ్చారు. ఆయనతో పాటు స్టార్ సీఈఓ మిషేల్ గుత్రీ, టైమ్స్ పత్రిక సంపాదకుడు రాబర్ట్ థామ్సన్, న్యూస్ కార్పొరేషన్ సిఇఓ డేవిడ్ డెవో, స్టార్ ఇండియా సిఇఓ పీటర్ ముఖర్జియా ఉన్నారు. అపాయింట్ మెంట్ కోరిన సమయానికి గంట ముందు వచ్చిన మర్డోక్, తనను జైపాల్ ఎప్పుడంటే అప్పుడు కలుసుకుంటారని భావించారు. రూపర్ట్ మర్డోక్ వచ్చారని సమాచారం అందినప్పటికీ జైపాల్ అంతగా స్పందించలేదు. ‘లెట్ హిమ్ వెయిట్’ (వేచి ఉండనివ్వండి) అని ఆయన అధికారులతో అన్నారు. దాదాపు గంటసేపు వేచి ఉన్న తర్వాత రూపర్ట్ మర్డోక్ జైపాల్ను కలిశారు. ‘మీరు అనుకున్నట్లుగా మీడియా రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సడలించడం అంత సులభం కాదు’ అని జైపాల్ ఆయనకు చెప్పారు. ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్ల ప్రయోజనాలు మిన్న కావు అని జైపాల్ రెడ్డి విశ్వసించేవారు. ఆయన ఆ తర్వాతి కాలంలో పెట్రోలియం శాఖకు మంత్రి అయ్యారు. జైపాల్ను కలుసుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ స్వయంగా మంత్రి కార్యాలయానికి వచ్చేవారు.
రూపర్ట్ మర్డోక్ మీడియా సామ్రాజ్యం 1952లో అడిలైడ్లో ‘ద న్యూస్’ అనే ఒక చిన్న పత్రికతో ప్రారంభమయింది. దరిమిలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా దేశాలకు అది విస్తరించింది. రూపర్ట్ మర్డోక్ క్రమంగా పెద్ద పెద్ద వార్తాసంస్థల్ని స్వాధీనం చేసుకున్నారు. తన వ్యాపార ప్రయోజనాలకోసం, రాజకీయ మిత్రులకోసం వార్తల్ని వక్రీకరించేవారని, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలో ప్రధాన రాజకీయ పరిణామాలను ప్రభావితం చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మార్గరెట్ థాచర్, టోనీ బ్లెయిర్ వంటి ప్రధానమంత్రులతో, అనేకమంది దేశాధ్యక్షులతో ఆయనకు సంబంధాలు ఉండేవి. లలిత్ మోదీకి పోర్చుగల్ వీసా రావడానికి విదేశాంగమంత్రి హోదాలో సుష్మాస్వరాజ్ సహాయం చేశారని రూపర్ట్ మర్డోక్ పత్రిక ‘సండే టైమ్స్’లో వార్త రావడంతో ఆ ఇరువురికీ కష్టాలు మొదలయ్యాయి.
మీడియాపై కార్పొరేట్ల ప్రభావం నరేంద్ర మోదీ హయాంలోనే ప్రారంభమైందని చెప్పలేము. 1984 డిసెంబర్ 2న భోపాల్లోని యూనియన్ కార్బైడ్లో విషవాయువు లీక్ అయి వేలాది ప్రజలు మరణించడానికి ముందు ఆ ఫ్యాక్టరీలో పరిస్థితుల గురించి ప్రధాన స్రవంతి పత్రికల్లో కనీసం ఒక చిన్నపాటి వార్త కూడా రాలేదు. కార్బైడ్ కార్మికులు ఎన్నిసార్లు ప్రధాన పత్రికల వద్దకు వెళ్లినా ఫలితం ఉండేది కాదు. ప్రాంతీయ పత్రికల్లోనే ఆ ఫ్యాక్టరీలో నెలకొన్న కాలుష్య వాతావరణం గురించి వార్తలు వచ్చాయి. ‘రపట్’ అనే ఒక చిన్న పత్రికలో రాజ్కుమార్ కేస్వానీ అనే విలేఖరి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ‘హిట్లర్ గ్యాస్ చాంబర్’గా మారిందని ఒక విపుల వార్త రాశారు. అది వెలువడిన ఎంతో కాలం తర్వాత యూనియన్ కార్బైడ్లో మిథైల్ ఐసో సైనేట్ లీక్ అయి వేలాది ప్రజలు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. అనేక మంది శ్వాసకోశ వ్యాధులకు గురయ్యారు.
అంతకు ముందు ఎమర్జెన్సీలో పలువురు ఎడిటర్లు, జర్నలిస్టులు ఇబ్బందుల పాలయ్యారు. కొంతమంది జర్నలిస్టులు, కొన్ని పత్రికలు ఎమర్జెన్సీని సమర్థించిన ఉదంతాలూ ఉన్నాయి. అయితే తన వ్యాపార ప్రయోజనాలను సైతం విస్మరించి రామనాథ్ గోయెంకా లాంటి పారిశ్రామికవేత్తలు ఏటికి ఎదురొడ్డి పోరాడారు. తర్వాతి కాలంలో ప్రధాన మీడియాలో అధిక భాగం కాంగ్రెస్కు అనుకూలంగా మారింది. ఇప్పుడు మోదీ అనుకూల మీడియాను ‘గోదీ మీడియా’ అని విమర్శిస్తున్నారు కానీ యూపీఏ హయాంలో అనేకమంది జర్నలిస్టులు, పత్రికాధిపతులు కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలు లేకపోలేదు. వారికి పద్మ పురస్కారాలు, రాజ్యసభలోనూ, జాతీయ అభివృద్ధి మండలిలోను సభ్యత్వాలు కూడా లభించాయి. కొందరు జర్నలిస్టులు మంత్రిపదవుల విషయంలో కార్పొరేట్లతో బేరసారాలు చేశారని నీరారాడియా టేప్లు కూడా వెల్లడించాయి. గుజరాత్ అల్లర్ల తర్వాత మోదీకి జాతీయ మీడియాలో అధిక భాగం వ్యతిరేకంగా మారింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మోదీ చాలాకాలం ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. కార్పొరేట్లను తనకు అనుకూలంగా మళ్లించుకున్న తర్వాత ఆయన పని సులభమయింది.
‘ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి మీ మిత్రుడే కదా, నన్ను ఫెరా (విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం) కేసు నుంచి తప్పించండి’ అని 1998లో ఒక జాతీయ పత్రిక యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త తన పత్రికలో పనిచేస్తున్న ప్రముఖ ఎడిటర్ హెచ్కె దువాను కోరారు. వాజపేయి అలా సహాయం చేసేవారు కాదని దువాకు తెలియనిది కాదు. అదే విషయం దువా తన యజమానికి చెప్పారు, దీనితో ఆయనకు ఆ పత్రికనుంచి ఉద్వాసన పలికారు. ఈ ఉద్వాసనపై నాడు ప్రెస్ కౌన్సిల్లో తీవ్రంగా చర్చించారు. ప్రముఖ ఎడిటర్ వినోద్ మెహతా నేతృత్వంలోని ఎడిటర్స్ గిల్డ్ కూడా ఖండించింది. జస్టిస్ రాజేందర్ సచార్, గురుదాస్ దాస్ గుప్తా, రజనీ కొఠారి, కుల్దీప్ నయ్యర్, ఎంవి కామత్, బిజి వర్గీస్, హిరణ్మయ్ కార్లేకర్, ఎన్. భాస్కర రావు తదితరులు దువా ఉద్వాసనను విమర్శిస్తూ ఒక సంయుక్త ప్రకటన చేశారు.
కాంగ్రెస్ కాలానికీ, ఇప్పటి కాలానికీ పరిస్థితులు ఎంతో మారాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో అధిక భాగం కార్పొరేట్ అనుకూల వాతావరణమే కనపడుతోంది. రూపర్ట్ మర్డోక్ లాంటి మీడియా సామ్రాజ్యాధినేతలకు కానీ, ముఖేశ్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు కానీ ఇవాళ కేంద్రమంత్రులను కలుసుకోవాల్సిన పని లేదు. ఆ కుబేరులు తలుచుకుంటే వారి ఇళ్లకే కేంద్రమంత్రులు వెళ్లి కలుస్తారు. ప్రధానమంత్రిని కలుసుకోవడానికి కూడా ఆ భాగ్యచక్రవర్తులకు పెద్ద సమయం పట్టదు. ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి ఆధ్వర్యంలోని రిపబ్లిక్ టీవీకి ప్రముఖ పారిశ్రామికవేత్త, కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆర్థిక వనరులు సమకూర్చారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక్క ఫోన్ కాల్తో ఆ మీడియా సంస్థకు లైసెన్స్ నెలరోజుల లోపే వచ్చిందని నాడు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో పనిచేసిన అధికారులకు తెలుసు.
ఇటీవల రూబేన్ బెనర్జీ అనే సంపాదకుడు ‘ఎడిటర్ మిస్సింగ్’ అనే పేరుతో రాసిన పుస్తకంలో నేడు జాతీయ మీడియా సంస్థలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల గురించి చర్చించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియా టుడే, అల్జజీరా, హిందూస్తాన్ టైమ్స్ తదితర పత్రికల్లో పనిచేసిన తర్వాత ఆయన ‘అవుట్ లుక్’ అనే వార పత్రికకు ఎడిటర్ అయ్యారు. కరోనా రెండో ప్రభంజనం సమయంలో నెలకొన్న తీవ్ర పరిస్థితి గురించి ఒక సంచికలో ప్రత్యేక వ్యాసాలు రాయించిన రూబెన్ బెనర్జీ ఆ సంచిక కవర్ పేజీపై ‘మిస్సింగ్’ (కనపడుట లేదు) అని శీర్షిక పెట్టి దాని క్రింద ‘భారత ప్రభుత్వం, వయసు ఏడేళ్లు, సమాచారం తెలపాల్సిన వారు–భారత ప్రజలు’ అన్న వాక్యాలు రాయించారు. అంతే, ఇది జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా రూబేన్ తొలుత సెలవుపై వెళ్లారు. పిదప ఉద్వాసనకు గురయ్యారు. ఎంతైనా ‘అవుట్ లుక్’ పత్రిక రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త నడిపేది. మరి అది ఎలా ఒత్తిడికి తట్టుకోగలదు? ప్రధానమంత్రితో ఒక జాతీయ పత్రిక అధినేత కలిసిన తర్వాత మరో జాతీయ దినపత్రిక సంపాదకుడు కూడా ఉద్వాసనకు గురి కావల్సి వచ్చిందని రూబేన్ తన పుస్తకంలో రాశారు. భారత– చైనా సరిహద్దుల్లోని డోక్లామ్లో జరిగిన ఘటనల గురించి సదరు పత్రిక రాసిన తీరు ప్రభుత్వానికి నచ్చలేదని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్డీటీవీ యాజమాన్యం అత్యంత సంపన్నుడైన అదానీ చేతుల్లోకి మారిపోవడం, ఆ ఛానెల్ను నిర్వహిస్తున్న ప్రణయ్ రాయ్, రాధికారాయ్లతో పాటు ప్రముఖ జర్నలిస్టు రవీష్ కుమార్ రాజీనామా చేయడం ఢిల్లీ మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. బ్రోకర్లుగా వ్యవహరించకపోతే జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురికావల్సి వస్తుందని రామన్ మెగసేసే అవార్డు గ్రహీత రవీష్ కుమార్ వ్యాఖ్యానించారు. నిజానికి ఒక మీడియా సంస్థ వాటాల కొనుగోలు జరిగినప్పుడు దాని యాజమాన్యం మారిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అయినప్పటీ ఈ కొనుగోలుపై చర్చ జరగడానికి కారణం బిజెపికి అనుకూలంగా ఎన్డీటీవీ వ్యవహరించకపోవడం, ప్రధాని మోదీని రవీష్ కుమార్ మోదీని తీవ్రంగా విమర్శించడమే అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఈ కొనుగోలుతో భారతదేశంలో మీడియా పెనుభయానికి గురయిందని అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం 180 దేశాల్లో 150వ స్థానంలో ఉన్నదని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొన్నది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దేశంలో అత్యంత జనాదరణ గల వ్యక్తి. మెజారిటీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని బిజెపికి తిరుగులేని విజయాలు దక్కుతున్నాయి. నిజానికి వలస కార్మికుల దుస్థితితో పాటు అనేక దుష్పరిణామాల గురించి మీడియాలో వచ్చిన వార్తల వల్ల ఆయనకు పెద్దగా నష్టం జరగలేదని ఇప్పటికే తేలిపోయింది. అందువల్ల మీడియాకు మోదీ భయపడాల్సిన అవసరం కానీ, పత్రికలతో స్వేచ్ఛగా మాట్లాడకుండా తప్పించుకోవడం కానీ, మీడియాను లొంగదీసుకోవడం కోసం కార్పొరేట్లను ప్రయోగించడం కానీ చేయాల్సిన పనిలేదు. చాలా కాలం క్రితం ప్రముఖ జర్నలిస్టు హెరాల్డ్ ఎవన్స్ (1928–2020) ఢిల్లీలో ఒక సదస్సులో మాట్లాడుతూ భారతదేశంలో జాతీయ పత్రికలు ప్రాంతీయ భాషా పత్రికల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నదని చెప్పారు. ‘ఒక సంఘటన ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకునేంత వరకూ ఆ వార్తకు మరణం లేదు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట దాచేందుకు ప్రయత్నించేదే వార్త, మిగతావన్నీ ప్రకటనలే’ అన్నారు. అన్నీ ప్రకటనలే అయితే ఏమి బాగుంటుంది?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2022-12-07T01:11:59+05:30 IST