Covid In China: చైనాలో రోజుకు 37 మిలియన్ కేసులు.. వణుకుతున్న ప్రజలు!

ABN , First Publish Date - 2022-12-23T18:37:57+05:30 IST

ప్రపంచాన్ని చైనా (China) మళ్లీ భయం గుప్పిట్లోకి నెట్టేసింది. కరోనా (Corona) ఖతమైందని అనుకుంటూ

Covid In China: చైనాలో రోజుకు 37 మిలియన్ కేసులు.. వణుకుతున్న ప్రజలు!
China Covid

బీజింగ్: ప్రపంచాన్ని చైనా (China) మళ్లీ భయం గుప్పిట్లోకి నెట్టేసింది. కరోనా (Corona) ఖతమైందని అనుకుంటూ మాస్కులను గాలికొదిలేసిన వేళ చైనాలో ఒక్కసారిగా కేసులు విజృంభించాయి. లక్షలాదిమంది ఆ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పుడా ప్రభావం అనేక ఇతర దేశాలపై పడింది. పొరుగుదేశంలో వెల్లువెత్తుతున్న కేసులతో భారత్ అప్రమత్తమైంది. రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

మరోవైపు, వెల్లువెత్తుతున్న కేసులతో చైనా వణికిపోతోంది. ఈ వారంలో అక్కడ రోజుకు 37 మిలియన్ కరోనా కేసులు వెలుగు చూసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో నమోదైన అత్యధిక రోజువారీ కేసులు ఇవేనని ‘బ్లూమ్‌బర్గ్’ పేర్కొంది.

డిసెంబరులో తొలి 20 రోజుల్లో ఏకంగా 248 మంది కరోనా బారినపడినట్టు నేషనల్ హెల్త్ కమిషన్‌ను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్’ పేర్కొంది. ఈ నెల 20న 37 మిలియన్ కేసులు నమోదైనట్టు తెలిపింది. అయితే, చైనా అధికారిక లెక్కలకు వీటికి ఏమాత్రం పొంతన ఉండడం లేదు. చైనా మాత్రం ఆ రోజున 3,049 కేసులు మాత్రమే నమోదైనట్టు అధికారికంగా పేర్కొంది.

ఇప్పటి వరకు జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తూ వచ్చిన చైనా.. ఒక్క కేసు వెలుగు చూసినా లాక్‌డౌన్‌లు, ఆంక్షలంటూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి ఇది ప్రభుత్వంపై తిరుగుబాటుకు కారణమైంది. ఆంక్షలు సడలించాలని, లాక్‌డౌన్‌లు ఎత్తివేయాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో ఆంక్షలు, లాక్‌డౌన్‌లు ఎత్తేసిన ప్రభుత్వం.. చాలా ప్రాంతాల్లో టెస్టింగ్ కేంద్రాలను కూడా మూసేసింది. ఆ తర్వాతి నుంచి కరోనా మరింతగా చెలరేగిపోయింది. వేలాదిమందిని తన కబంధ హస్తాల్లో బంధిస్తున్న మహమ్మారి ప్రాణాలను హరిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి ఉండడం కనిపిస్తోంది. ఇది అక్కడి కొవిడ్ తీవ్రతకు అద్దం పడుతోంది. రాబోయే కొన్ని నెలల్లో మిలియన్ల మంది ప్రజలు కరోనా బారినపడతారని అంటువ్యాధి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-12-23T19:34:53+05:30 IST