China Covid: కరోనాతో కలిసి జీవించేందుకు సిద్ధమైన చైనా!
ABN , First Publish Date - 2022-12-27T16:27:01+05:30 IST
కరోనా(Corona) మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా కొవిడ్‌తో కలిసి జీవించేందుకు
బీజింగ్: కరోనా(Corona) మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనా కొవిడ్‌తో కలిసి జీవించేందుకు సిద్ధమైపోయింది. 2019లో వుహాన్(Wuhan)లో కరోనా వెలుగు చూసిన తర్వాత విధించి అమలు చేస్తున్న ఆంక్షలను నెమ్మదిగా తొలగించేస్తోంది. చైనాలో ల్యాండయ్యే విదేశీయులు ఇకపై క్వారంటైన్(Quarantine)కు వెళ్లాల్సిన పనిలేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) సోమవారం కీలక ప్రకటన చేసింది. జనవరి 8 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఐదు రోజులపాటు హోటల్‌లో, ఆ తర్వాత మూడు రోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇప్పటి వరకు ‘జీరో కొవిడ్’(Zero Covid) విధానాన్ని అనుసరిస్తూ వస్తున్న చైనా తాజా నిర్ణయం పెద్ద యూటర్నేనని చెబుతున్నారు. చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయని, శ్మశాన వాటికల ముందు శవాలతో ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిన తర్వాత రోజువారీ కరోనా లెక్కలను కూడా ప్రకటించడం మానేసింది. ప్రస్తుతం దేశంలో నమ్మశక్యం కాని రీతిలో కేసులు నమోదవుతున్నాయి. విదేశీ పర్యాటకులకు కరోనా టెస్టులు అవసరం లేదని, జ్వరం, ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్న వారికి మాత్రం విమానాశ్రయాల్లో యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారని ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది.
విదేశీయుల కోసమే
విదేశీయుల కోసమే కరోనా నిబంధనలను సడలించినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. అయితే, ఇందులో పర్యాటకులను చేర్చలేదు. పర్యాటకం కోసం విదేశాలకు వెళ్లేందుకు చైనా పౌరులను క్రమంగా అనుమతిస్తామని పేర్కొంది. కరోనా పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి కావడంతో ప్రజలు పర్యాటకానికి దూరమై ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నిబంధనల వల్ల పనుల కోసం, చదువుల కోసం వచ్చే విదేశీయుల సంఖ్య కూడా తగ్గింది. అయితే, విమాన ప్రయాణికులకు మాత్రం 48 గంటల ముందు చేయించుకున్న కరోనా టెస్టు నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. అలాగే, విమానంలో మాస్కులు ధరించడం కూడా తప్పనిసరి చేసింది.
ఫైజర్ టీకా పంపిణీ
కరోనా కేసులతో అల్లాడిపోతున్న చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫైజర్(Pfizer) కొవిడ్ టీకా ‘ప్యాక్స్‌లోవిడ్’(Paxlovid)ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో రాజధాని బీజింగ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ఈ టీకాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. చైనాలో పంపిణీ చేస్తున్న కరోనా టీకాల్లో ప్యాక్స్‌లోవిడ్ ఒక్కటే విదేశీ టీకా కావడం గమనార్హం.