Corona BF-7: దేశంలో తాజాగా 4 కరోనా బీఎఫ్-7 కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-12-22T11:06:20+05:30 IST

ఢిల్లీ: చైనా (China) సహా.. పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా బీఎఫ్‌-7 (Corona BF-7) వేరియంట్‌ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది.

Corona BF-7: దేశంలో తాజాగా 4 కరోనా బీఎఫ్-7 కేసులు నమోదు

ఢిల్లీ: చైనా (China) సహా.. పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా బీఎఫ్‌-7 (Corona BF-7) వేరియంట్‌ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో తాజాగా 4 కరోనా బీఎఫ్-7 కేసులు నమోదయ్యాయి. బాధితులు హోంఐసోలేషన్‌లోనే కోలుకున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై ఉన్నతాధికారులతో మోదీ సమీక్ష చేయనున్నారు. చైనా సహా పలు దేశాల్లో అనూహ్యంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గుంపుల్లో ఉన్నప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరలించాలని కేంద్రం సూచించింది.

ఒమిక్రాన్‌(బీఎఫ్-5)కు సబ్‌-వేరియంట్‌ అయిన బీఎఫ్‌-7 అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే చైనీయుల విషయంలో ఇది కొంత ప్రమాదకారిగానే కనిపించినా.. ‘హైబ్రీడ్‌ ఇమ్యూనిటీ’ ఉన్న భారతీయులకు ఈ వేరియంట్‌ ఏమంత పెద్ద ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు.

చైనాలో వెలుగు చూసిన వెంటనే..

చైనాలోని బీజింగ్‌లో అక్టోబరు నెలలో బీఎఫ్‌-7 వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గుజరాత్‌లోని ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ ఉన్నట్లు ‘బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌’ గుర్తించింది. గుజరాత్‌లోనే మరో వ్యక్తికి, ఒడిసాలో ఇంకో వ్యక్తికి బీఎఫ్‌-7 సోకినట్లు తేలినా.. ఆ ముగ్గురూ హోంఐసోలేషన్‌లోనే కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘‘రెండు నెలల క్రితమే కొత్త వేరియంట్‌ వెలుగుచూసినా.. కేసుల పెరుగుదలపై ప్రభావం చూపలేదు. ఇదంత ప్రమాదకారి కాదు. కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది’’ అని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కూడా బీఎఫ్‌-7 భారత్‌లో వెలుగు చూసినా.. కేసుల పెరుగుదల లేదని వివరించారు. ప్రపంచ నిపుణులు కూడా ఒమిక్రాన్‌ సోకిన వారికి అంతకు మునుపటి వేరియంట్లు ఆల్ఫా, బీటాలను తట్టుకునే రోగనిధోక శక్తి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ సబ్‌-వేరియంట్‌ అయిన బీఎఫ్-7తో ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. చైనాలో పౌరులను చాలాకాలం లాక్‌డౌన్లలో పెట్టారని, ఒక్కసారిగా అన్‌లాక్‌ అవ్వడంతో వైరస్‌కు త్వరగా ఎక్స్‌పోజ్‌ అవుతున్నారని, అక్కడి వ్యాక్సిన్లు అంత సమర్థవంతమైనవి కాదనే వాదనలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. అందుకే చైనాలో బీఎఫ్‌-7 వేగంగా విస్తరిస్తున్నా.. మన దగ్గర దాని ప్రభావం అంతగా లేదని చెబుతున్నారు. కాగా.. దేశంలో కేసుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేదని, గడిచిన 24 గంటల్లో 129 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

బీఎఫ్‌-7 లక్షణాలు..

ఒమిక్రాన్‌ సబ్‌-వేరియంటే బీఎఫ్‌-7. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్‌ ఆర్వో(ఆర్‌ నాట్‌) 10 నుంచి 18.6గా ఉంది. అంటే.. ఒకరికి ఈ వేరియంట్‌ సోకితే.. వారి నుంచి కనిష్టం సగటు 10 నుంచి గరిష్టం సగటు 18.6 మందికి వ్యాప్తిచెందుతుంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్‌ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతి కొద్ది కేసుల్లో వాంతులు, డయేరియా వంటి పొట్ట సంబంధ వ్యాధులు బయటపడవచ్చన్నారు.

Updated Date - 2022-12-22T11:06:23+05:30 IST