Covid Case : చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్
ABN, First Publish Date - 2022-12-25T18:26:56+05:30
చైనా నుంచి శుక్రవారం మన దేశానికి వచ్చిన 40 ఏళ్ళ వయసుగల వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణ అయింది.
ఆగ్రా : చైనా నుంచి శుక్రవారం మన దేశానికి వచ్చిన 40 ఏళ్ళ వయసుగల వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని నిర్థరణ అయింది. ఈ వేరియంట్ గురించి తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ (genome sequencing) కోసం ఆయన శాంపిల్‌ను లక్నో పంపించారు. ఆగ్రాలో నవంబరు 25 తర్వాత కోవిడ్ పాజిటివ్ కేసు నమోదవడం ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఆగ్రా ప్రధాన వైద్యాధికారి (CMO) డాక్టర్ ఏకే శ్రీవాస్తవ ఆదివారం తెలిపారు.
చైనాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు శుక్రవారం వచ్చినట్లు తెలిపారు. ఆయనకు రోగ లక్షణాలు కనిపించలేదన్నారు. ఆయనను షాగంజ్ ప్రాంతంలోని తన ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. నగరంలో నవంబరు 25 తర్వాత నమోదైన మొదటి కోవిడ్ పాజిటివ్ కేసు ఇదేనని చెప్పారు. నగరంలో ఏకైక యాక్టివ్ కేసు కూడా ఇదేనన్నారు.
ఈ వ్యక్తితో కలిసి చైనా నుంచి వచ్చినవారిని సంప్రదించినట్లు ఆగ్రా ఆరోగ్య శాఖాధికారులు చెప్పారు. కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని వారిని కోరినట్లు తెలిపారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగ్రా రైల్వే స్టేషన్, బస్టాండ్లలో టెస్టింగ్‌ను పెంచారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆగ్రాలోని హోటళ్లు క్రిక్కిరిసి ఉన్నాయి.
చైనా తదితర దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) అత్యున్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాజ్ మహల్ సందర్శకులను ఆగ్రా ఆరోగ్య శాఖాధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు.
Updated Date - 2022-12-25T18:27:01+05:30 IST