Corona Virus Chinaమూణ్నెల్లలో చైనాలో.. 84 కోట్ల కొవిడ్‌ కేసులు!

ABN , First Publish Date - 2022-12-21T01:18:11+05:30 IST

కరోనా వైర్‌సకు పుట్టునిల్లయిన చైనాలో రానున్న మూణ్నెల్లలో కొవిడ్‌-19 విలయతాండవం చేయనుంది. ఆ దేశ జనాభాలో 60ు మంది.. అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్‌ బారిన పడతారని అమెరికాకు చెందిన ప్రజారోగ్య శాస్త్రవేత్త ఎరిక్‌ ఫీగ్ల్‌-డింగ్‌ అంచనా వేశారు. కేసుల డబ్లింగ్‌ దశ(రోజువారీ రెట్టింపు) మరెంతో దూరంలో లేదని,

Corona Virus Chinaమూణ్నెల్లలో చైనాలో.. 84 కోట్ల కొవిడ్‌ కేసులు!

60 శాతం మంది పౌరులకు కొవిడ్‌

అమెరికా ప్రజారోగ్య శాస్త్రవేత్త అంచనా

ఏప్రిల్‌లోగా 10 లక్షల మరణాలు?

ఇప్పటికే ఐహెచ్‌ఎంఈ అధ్యయనం

భారత్‌ అప్రమత్తం.. రాష్ట్రాలకు లేఖలు.. నేడు సమీక్ష

శ్మశాన వాటికల వద్ద పెరిగిన రద్దీ

మరణాలను దాచిపెడుతున్న డ్రాగన్‌

బీజింగ్‌, డిసెంబరు 20: కరోనా వైర్‌సకు పుట్టునిల్లయిన చైనాలో రానున్న మూణ్నెల్లలో కొవిడ్‌-19 విలయతాండవం చేయనుంది. ఆ దేశ జనాభాలో 60ు మంది.. అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్‌ బారిన పడతారని అమెరికాకు చెందిన ప్రజారోగ్య శాస్త్రవేత్త ఎరిక్‌ ఫీగ్ల్‌-డింగ్‌ అంచనా వేశారు. కేసుల డబ్లింగ్‌ దశ(రోజువారీ రెట్టింపు) మరెంతో దూరంలో లేదని, కొద్దిరోజుల్లోనే ఆ పరిస్థితిని చైనా ఎదుర్కోనుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో.. వచ్చే ఏడాది చివర్లోగా చైనాలో కొవిడ్‌తో 10 లక్షల మరణాలు సంభవించవచ్చని అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌(ఐహెచ్‌ఎంఈ) ఇప్పటికే తన అధ్యయనంలో వెల్లడించింది. చైనాలో జీరో కొవిడ్‌ పాలసీని ఎత్తేస్తే కరోనాతో 21 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని లండన్‌కు చెందిన ఆరోగ్య నిఘా విభాగం ఎయిర్‌ఫినిటీ అంచనా వేసింది. శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగానే బీజింగ్‌, షాంఘై, హాంకాంగ్‌లో మరణాలు పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా చైనా.. మంగళవారం కేవలం 20 మరణాలు నమోదైనట్లు ప్రకటించింది.

పెరుగుతున్న రోజువారీ కేసులు

జీరో కొవిడ్‌ నిబంధనలను సడలించడంతో చైనాలో మహమ్మారి విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. చైనా ప్రభుత్వం దానిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ‘‘అన్‌లాక్‌ చేసేశాం.. కొవిడ్‌ బారిన పడేవారు పడండి..! చచ్చేవారు చావండి..! అన్నట్లుగా చైనా ప్రభుత్వం తీరు ఉంది’’ అని ఎరిక్‌ ఫీగ్ల్‌-డింగ్‌ విమర్శించారు. మూడు నెలల్లో చైనాలో 60ు జనాభా కొవిడ్‌ బారిన పడుతుందని ఆయన అంచనా వేశారు. ‘‘ఆంక్షల సడలింపు తర్వాత చైనాలోని ఆస్పత్రులన్నీ కొవిడ్‌ బాధితులతో కిక్కిరిసిపోయాయి. ఇది ఆరంభమే’’ అని ట్వీట్‌ చేశారు.

మరణాలను దాచిపెడుతున్న చైనా

చైనా ముందు నుంచి కొవిడ్‌ కేసుల సంఖ్యను, మరణాలను దాచిపెడుతోందని అమెరికా సహా.. ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి 5,327 మరణాలే సంభవించాయని చైనా ఇప్పటిదాకా చెబుతూ వచ్చింది. అయితే, ఇటీవల బీజింగ్‌లో ఒక్కరోజులో 2,700 మంది చనిపోయారని హాంకాంగ్‌ మీడియా కథనాలను ప్రసారం చేసింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సైతం బీజింగ్‌లోని డోంగ్జియో శ్మశాన వాటికలో రోజుకు సగటున 200 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరుగుతున్నట్లు కథనాన్ని ప్రచురించింది. కొవిడ్‌ పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలకు, ఫార్మసీల్లో మందులకు తీవ్ర కొరత ఏర్పడింది.

నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్‌!

గడిచిన వారం రోజులుగా చైనాలో నిమ్మకాయలకు డిమాండ్‌ పెరిగింది. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మసీల్లో మాత్రల కొరతతో విటమిన్‌-సి కోసం పౌరులు నిమ్మకాయలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో రోజుకు 2 టన్నుల నిమ్మకాయల లోడ్‌ తీసుకువచ్చేవాడినని.. ఇప్పుడు 30 టన్నుల మేర డిమాండ్‌ పెరిగిందని బీజింగ్‌ మార్కెట్‌కు నిమ్మకాయలను సరఫరా చేసే ఓ వ్యాపారి వెల్లడించారు.

భారత్‌ అప్రమత్తం

చైనా సహా పలు దేశాల్లో కొవిడ్‌ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు సంబంధించి ప్రతిరోజూ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలకు ఇన్సాకాగ్‌ ల్యాబ్‌లకు నమూనాలను పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. చైనా సహా.. జపాన్‌, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లో కేసుల సంఖ్య పెరుగుతోందని.. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కేసులు పెరుగుతున్నాయని ఆ లేఖల్లో గుర్తుచేశారు. అటు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ బుధవారం ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

Updated Date - 2022-12-21T10:45:21+05:30 IST