BMC BJP: కరోనా కాలంలో బీఎంసీ స్టార్ హోటల్ ఖర్చు రూ.35 కోట్లు.. బీజేపీ సంచలన ఆరోపణ
ABN, First Publish Date - 2022-12-26T16:12:46+05:30
కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫైవ్ స్టార్ హోటల్‌లో...
ముంబై: కోవిడ్-19 (Covid-19) లాక్‌డౌన్ సమయంలో బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) అధికారులు ఫైవ్ స్టార్ హోటల్‌లో బస కోసం రూ.35 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును బీఎంసీ దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే మిహిర్ కోటేచా (Mihir Kotecha) మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 2020-2021 కాలంలో రూ.35 కోట్లు ఖర్చు చేసిన మున్సిపల్ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB)తో దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు రాసిన లేఖలో కోటేచా కోరారు.
''సామాన్య ప్రజల ప్రాణాల కంటే తమ అధికారులకు ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పించడం పైనే బీఎంసీ ఆసక్తి చూపించదనే అభిప్రాయానికి ఇది తావిస్తుంది'' అని ఆ లేఖలో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫైప్ స్టార్ హోటల్ ఖర్చు రూ.34.6 కోట్లుగా ఉందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా పనిచేసిన నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలను మనం మరిచిపోలేమని, అలాంటి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సకాలంలో జీతాలు కూడా అందలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి అవినీతి విధానాలతో బీఎంసీ కునారిల్లుతోందన్నారు.
మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరోనా మహమ్మారి సమయంలో కేటాయించిన పనులపై విచారణ జరపాల్సిందిగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం గత అక్టోబర్ 31న ఆదేశించింది. దీనిపై కాగ్ గత నెలలో దర్యాప్తు సైతం ప్రారంభించింది. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన అధీనంలోనే గత మూడు దశాబ్దాలుగా బీఎంసీ ఉంది. బీజేపీ తాజా ఆరోపణలతో శివసేన ఇరుకున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, బీజేపీ ఆరోపణలపై బీఎంసీ తక్షణ వివరణ ఇవ్వలేదు.
Updated Date - 2022-12-26T16:12:47+05:30 IST