Covid Drugs : భారతీయ కోవిడ్ ఔషధాల కోసం బ్లాక్ మార్కెట్‌కు ఎగబడుతున్న చైనీయులు

ABN , First Publish Date - 2022-12-28T16:38:58+05:30 IST

చైనాలో కోవిడ్-19 మహమ్మారి మరోసారి విజృంభించడంతో ఔషధాల కోసం ప్రజలు బ్లాక్ మార్కెట్‌కు ఎగబడుతున్నారు.

Covid Drugs : భారతీయ కోవిడ్ ఔషధాల కోసం బ్లాక్ మార్కెట్‌కు ఎగబడుతున్న చైనీయులు
Chinese

బీజింగ్ : చైనాలో కోవిడ్-19 మహమ్మారి మరోసారి విజృంభించడంతో ఔషధాల కోసం ప్రజలు బ్లాక్ మార్కెట్‌కు ఎగబడుతున్నారు. ముఖ్యంగా భారత దేశం నుంచి అనధికారికంగా తమ దేశంలోకి వచ్చే కోవిడ్ డ్రగ్స్‌ను కొంటున్నారు. ఈ భారతీయ మందులకు చైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, వీటిని చైనాలో అమ్మడం శిక్షించదగిన నేరం కూడా.

చైనా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్ఫైజర్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న పాక్స్‌లోవిడ్, చైనా కంపెనీ జెన్యూన్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న హెచ్ఐవీ డ్రగ్ అజ్వుడైన్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రెండు కోవిడ్-19 యాంటీవైరల్స్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అనూహ్యంగా విజృంభించిన కోవిడ్‌ బారి నుంచి బయటపడేందుకు ప్రజలు మందుల కోసం బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.

ముఖ్యంగా భారత దేశం నుంచి వస్తున్న చౌకగా లభించే జనరిక్ డ్రగ్స్‌వైపు చైనీయులు మొగ్గు చూపుతున్నారు. ‘యాంటీ కోవిడ్ ఇండియన్ జనరిక్ డ్రగ్స్ ఒక బాక్స్ 1,000 యువాన్లకు (144 అమెరికన్ డాలర్లకు) అమ్ముడుపోయాయి’ వంటి వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రిమోవిర్, పాక్సిస్టా, మొల్నునట్, మొల్నట్రిస్ (Primovir, Paxista, Molnunat and Molnatris) అనే నాలుగు రకాల యాంటీ కోవిడ్ జనరిక్ మందులు భారత దేశం నుంచి చైనాకు ఎగుమతి అవుతున్నాయి. వీటిని కొనడం కోసం చైనీయులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇండియన్ జనరిక్ ఔషధాలకు చైనా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. వీటిని చైనాలో అమ్మడం శిక్షించదగిన నేరం.

చట్టవిరుద్ధమైన ఔషధాలను కొనవద్దని చైనా ప్రజారోగ్య శాఖాధికారులు, వైద్యులు గతంలో ప్రజలను హెచ్చరించారు. ఇండియన్ ఫార్మాస్యుటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సాహిల్ ముంజల్ ఇటీవల ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇబుప్రోఫెన్, పారాసిటమాల్ కోసం భారతీయ ఔషధాల తయారీదారులను అడుగుతున్నారని చెప్పారు. ఫీవర్ మెడిసిన్స్‌ను చైనాకు ఎగుమతి చేసేందుకు మన దేశంలో ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-12-28T16:39:02+05:30 IST