Corona Virus News: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు ఎన్నంటే?
ABN , First Publish Date - 2022-12-25T12:19:19+05:30 IST
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు ఎన్నంటే?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా (Corona Virus) కేసులు మళ్లీ వెలుగు చూస్తున్నాయి. వైరస్ చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. కరోనా నేపథ్యంలో ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అత్యవసరమైన వారికి వెంటనే ఆరోగ్య సేవలు అందేలా చూడాలని కోరింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఫంక్షనల్ లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది.
చైనా(China)లో కరోనా వైరస్ మళ్లీ బుసలు కొడుతున్న నేపథ్యంలో చైనాతోపాటు దక్షిణ కొరియా(South Korea), జపాన్(Japan), థాయిలాండ్(Thailand), హాంకాంగ్(Hongkong) నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలో ఆర్టీ పీసీఆర్ టెస్టులు(RT-PCR Test)నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ప్రజలు మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం(Social Distance) పాటించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.
దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని విమానాశ్రయాల్లోనూ అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు(Corona Test) నిర్వహిస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయం(Delhi Airport)లో ఇప్పటి వరకు 500 మంది ప్రయాణికులకు కొవిడ్ టెస్టులు చేశారు.
మహారాష్ట్రలోని థానే(Thane) జిల్లాలో కొత్తగా మూడు కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 7,47,391 పెరిగినట్టు ఆరోగ్య అధికారులు తెలిపారు. అయితే, జిల్లాలో కరోనా మృతుల విషయంలో ఎలాంటి మార్పు లేదు. అక్కడ ఇప్పటి వరకు 11,967 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 7,36,179 మంది కోలుకున్నారు.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 236 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశంలో యాక్టివ్ కేసుల(Active Corona Cases) సంఖ్య 3,424గా ఉంది. గత 24 గంటల్లో కేరళ(Kerala)లో ఒకరు, మహారాష్ట్ర(Maharashtra)లో ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,693కు పెరిగింది. మొత్తం కేసులో యాక్టివ్ కేసుల రేటు 0.01 శాతంగా ఉంటే జాతీయ కొవిడ్-19 రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది.