IMD: నేడు, రేపు చెన్నై సహా 14 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
ABN , First Publish Date - 2022-12-08T08:47:35+05:30 IST
దక్షిణ అండమాన్‌లో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి మంగళవారం రాత్రికి వాయుగుండంగా మారింది.
- తుపానుగా మారిన వాయుగుండం
- హెచ్చరించిన వాతావరణ కేంద్రం
ప్యారీస్(చెన్నై), డిసెంబరు 7: దక్షిణ అండమాన్‌లో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి మంగళవారం రాత్రికి వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలై తూర్పు ఆగ్నేయంగా 770 కి.మీ దూరంలో బుధవారం ఉదయం బలపడిందని, దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో చెన్నై(Chennai) సహా 14 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాత్రికి తుపానుగా మారే అవకాశమున్నందువల్ల తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్, కోస్తా ప్రాంతాల్లో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. చెన్నైకి దక్షిణాన తుపాను తీరం దాటే అవకాశముందని, ఇందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, బుధవారం ఉదయం నుంచే బంగాళాఖాతం ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు గంటగంటకు వేగం పుంజుకుంటున్నాయని, ఈ నెల 10వ తేది వరకు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం సూచించింది.
24 సెం.మీ వర్షపాతం...
రాష్ట్రంలోని 13 సముద్రతీర జిల్లాలు, డెల్టా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ‘మాండస్’ తుఫాను ప్రభావంత్లో దాదాపు 24 సెం.మీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. నుంగంబాక్కంలోని వాతావరణ పరిశోధన కేంద్రం దక్షిణ మండల అధికారి బాలచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, తీవ్ర వాయుగుండం తుపానుగా మారనున్న కారణంగా, గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాలు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని తెలిపారు. చెన్నై, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ముందుగానే జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు సమాచారం అందించినట్టు తెలిపారు. రాణిపేట, కాంచీపురం, తిరువణ్ణామలై, కళ్లకుర్చి, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, తిరువారూరు, పుదుకోట, శివగంగ, రామనాధపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. 9వ తేది ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కోస్తా ప్రాంతాల్లో కురుస్తుందని, 10వ తేది వరకు 14 జిల్లాలకు భారీవర్ష సూచన హెచ్చరిక జారీచేసినట్లు ఆయన తెలిపారు.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం...
‘మాండస్’ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తుల నివారణ బృందాలు (ఎన్డీఆర్‌ఎప్) బుధవారం ఉదయమే రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సహాయ శిబిరాలకు ముందుగానే ఆ బృందాలు తరలిస్తున్నాయి. నాగపట్టినం, తిరువారూరు, తంజావూరు, కడలూరు, మైలాడుదురై, విల్లుపురం, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, చెన్నై జిల్లాల్లో వెయ్యిమంది సభ్యులు కలిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.