Mansukh Mandaviya: కోవిడ్‌పై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం
ABN , First Publish Date - 2022-12-21T16:14:11+05:30 IST
కోవిడ్‌పై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: కోవిడ్‌పై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జపాన్ యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్, చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. కేసుల పెరుగుదలకు అడ్డుకట్టవేసేందుకు వ్యూహాన్ని రూపొందించడానికి కేంద్ర ఆరోగ్యశాఖ న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. దేశంలో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి వారానికొకసారి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలో కోవిడ్ ఇంకా ముగియలేదని, అప్రమత్తంగా ఉండాలని, నిఘాను పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి కోవిడ్ సోకిందని మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారత్ జోడో యాత్ర కారణంగా రాజస్థాన్‌లో కోవిడ్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
భయపడాల్సిన అవసరం లేదని, తగిన పరీక్షలు నిర్వహిస్తున్నామని కోవిడ్‌పై జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఇంకా ఎలాంటి మార్పు లేదన్నారు.
కరోనా వైరస్‌కు పుట్టునిల్లయిన చైనాలో రానున్న మూణ్నెల్లలో కొవిడ్-19 విలయతాండవం చేయనుంది. ఆ దేశ జనాభాలో 60 శాతం మంది.. అంటే సుమారు 84 కోట్ల మంది వైరస్ బారిన పడతారని అమెరికాకు చెందిన ప్రజారోగ్య శాస్త్రవేత్త ఎరిక్ ఫీగ్ల్-డింగ్ అంచనా వేశారు. కేసుల డబ్లింగ్ దశ(రోజువారీ రెట్టింపు) మరెంతో దూరంలో లేదని, కొద్దిరోజుల్లోనే ఆ పరిస్థితిని చైనా ఎదుర్కోనుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో.. వచ్చే ఏడాది చివర్లోగా చైనాలో కొవిడ్‌తో 10 లక్షల మరణాలు సంభవించవచ్చని అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) ఇప్పటికే తన అధ్యయనంలో వెల్లడించింది. చైనాలో జీరో కొవిడ్ పాలసీని ఎత్తేస్తే కరోనాతో 21 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని లండన్‌కు చెందిన ఆరోగ్య నిఘా విభాగం ఎయిర్ఫినిటీ అంచనా వేసింది. శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగానే బీజింగ్, షాంఘై, హాంకాంగ్‌లో మరణాలు పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా చైనా.. మంగళవారం కేవలం 20 మరణాలు నమోదైనట్లు ప్రకటించింది.
పెరుగుతున్న రోజువారీ కేసులు
జీరో కొవిడ్ నిబంధనలను సడలించడంతో చైనాలో మహమ్మారి విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. చైనా ప్రభుత్వం దానిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ‘‘అన్‌లాక్ చేసేశాం.. కొవిడ్ బారిన పడేవారు పడండి..! చచ్చేవారు చావండి..! అన్నట్లుగా చైనా ప్రభుత్వం తీరు ఉంది’’ అని ఎరిక్ ఫీగ్ల్-డింగ్ విమర్శించారు. మూడు నెలల్లో చైనాలో 60ు జనాభా కొవిడ్ బారిన పడుతుందని ఆయన అంచనా వేశారు. ‘‘ఆంక్షల సడలింపు తర్వాత చైనాలోని ఆస్పత్రులన్నీ కొవిడ్ బాధితులతో కిక్కిరిసిపోయాయి. ఇది ఆరంభమే’’ అని ట్వీట్ చేశారు.
మరణాలను దాచిపెడుతున్న చైనా
చైనా ముందు నుంచి కొవిడ్ కేసుల సంఖ్యను, మరణాలను దాచిపెడుతోందని అమెరికా సహా.. ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి 5,327 మరణాలే సంభవించాయని చైనా ఇప్పటిదాకా చెబుతూ వచ్చింది. అయితే, ఇటీవల బీజింగ్‌లో ఒక్కరోజులో 2,700 మంది చనిపోయారని హాంకాంగ్ మీడియా కథనాలను ప్రసారం చేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ సైతం బీజింగ్‌లోని డోంగ్జియో శ్మశాన వాటికలో రోజుకు సగటున 200 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు జరుగుతున్నట్లు కథనాన్ని ప్రచురించింది. కొవిడ్ పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలకు, ఫార్మసీల్లో మందులకు తీవ్ర కొరత ఏర్పడింది.
నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్!
గడిచిన వారం రోజులుగా చైనాలో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మసీల్లో మాత్రల కొరతతో విటమిన్-సి కోసం పౌరులు నిమ్మకాయలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో రోజుకు 2 టన్నుల నిమ్మకాయల లోడ్ తీసుకువచ్చేవాడినని.. ఇప్పుడు 30 టన్నుల మేర డిమాండ్ పెరిగిందని బీజింగ్ మార్కెట్‌కు నిమ్మకాయలను సరఫరా చేసే ఓ వ్యాపారి వెల్లడించారు.
భారత్ అప్రమత్తం
చైనా సహా పలు దేశాల్లో కొవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు సంబంధించి ప్రతిరోజూ జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు నమూనాలను పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. చైనా సహా.. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని.. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కేసులు పెరుగుతున్నాయని ఆ లేఖల్లో గుర్తుచేశారు.