Maharashtra : ఉచిత వాగ్దానాలిచ్చే షార్ట్‌కట్ పొలిటీషియన్లపై మోదీ ఆగ్రహం
ABN , First Publish Date - 2022-12-11T13:59:33+05:30 IST
షార్ట్‌కట్ పొలిటీషియన్లను తిరస్కరించాలని, అవినీతి నేతల బండారం బయటపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
నాగపూర్ (మహారాష్ట్ర) : షార్ట్‌కట్ పొలిటీషియన్లను తిరస్కరించాలని, అవినీతి నేతల బండారం బయటపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. షార్ట్‌కట్ పొలిటీషియన్లు పన్ను చెల్లింపుదారులకు శత్రువులని, వారు దేశ ఆర్థిక సంక్షేమం కన్నా తమ పార్టీ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారని దుయ్యబట్టారు. మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక దృష్టి, స్వప్నం అవసరమని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు, రాయితీలు, తాయిలాలను ప్రకటిస్తూ, వేగంగా అధికార పగ్గాలను చేపట్టాలని తహతహలాడేవారిని షార్ట్‌కట్ పొలిటీషియన్లుగా మోదీ పరోక్షంగా చెప్పారని భావించవచ్చు. కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లకు ద్రోహం చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. మన అదృష్టాన్ని నిర్దేశించే అవకాశం షార్ట్‌కట్ రాజకీయాలకు ఇవ్వకూడదన్నారు. ఓటు బ్యాంకు కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేసే పార్టీల బండారాన్ని బయటపెట్టాలన్నారు. షార్ట్‌కట్ పాలిటిక్స్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తున్నానని తెలిపారు. షార్ట్‌కట్ మార్గంలో వెళ్లే రాజకీయ నేతలు దేశానికి శత్రువులని పేర్కొన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారాన్ని పొందలేరన్నారు. అభివృద్ధి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని అలాంటి నేతలను కోరారు.
నాగపూర్‌లో ఎయిమ్స్ (అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ-AIIMS)ను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల (infrastructure) ప్రాజెక్టులకు మానవీయతను అద్దిన ప్రభుత్వం నేడు మొట్టమొదటిసారి మన దేశంలో ఉందని చెప్పారు. సమగ్ర దృక్పథం, వైఖరులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనే తన ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఆదివారం ప్రారంభమైన ప్రాజెక్టులు మహారాష్ట్ర అభివృద్ధికి నూతన దిశను ఇస్తాయన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల సమగ్ర విజన్‌ను ఇస్తాయని తెలిపారు. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంత వేగంగా పని చేస్తోందో చెప్పడానికి ఇదే సరైన రుజువు అని చెప్పారు.
నాగపూర్ ఎయిమ్స్ విదర్భ ప్రాంతంలో అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను అందజేస్తుంది. గడ్చిరోలి, గోండియా, మేల్‌ఘాట్ గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇది గొప్ప వరం. నాగపూర్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆయనకు స్వాగతం పలికే బృందంతో కలిసి ఆయన ఓ డోలును వాయించారు. ఎయిమ్స్‌ను ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన తిలకించారు. మోదీ అంతకుముందు హిందూ హృదయసామ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ఫేజ్-1ను ప్రారంభించారు. 520 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నాగపూర్-షిరిడీలను అనుసంధానం చేస్తుంది.
నాగపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1ను కూడా మోదీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన టిక్కెట్ కౌంటర్‌లో టిక్కెట్ కొని, మెట్రో రైలులో ప్రయాణించారు. విద్యార్థినీ, విద్యార్థులతోనూ, సమాజంలోని వివిధ రంగాలకు చెందినవారితోనూ, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతోనూ ఆయన ముచ్చటించారు. ఈ రైలు ప్రాజెక్టు రెండో దశకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.6,700 కోట్లు.
మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde), ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) పాల్గొన్నారు.
మోదీ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం 6వ వందే భారత్ రైలును ప్రారంభించారు. రైలులోని ప్రయాణికులను చేతులు ఊపుతూ పలుకరించి, ఉత్తేజపరచారు. ఈ రైలు నాగపూర్-బిలాస్‌పూర్ మధ్య నడుస్తుంది.
మోదీకి నాగపూర్‌లో స్వాగతం పలికినవారిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు.