Covid-19: ప్రధాని కీలక సమావేశం.. తాజా పరిస్థితి, సన్నద్ధతపై సమీక్ష
ABN , First Publish Date - 2022-12-22T20:11:33+05:30 IST
కొవిడ్-19పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సమావేశం నిర్వహించారు.
న్యూఢిల్లీ: కొవిడ్-19పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ తదితరులు పాల్గొన్న ఈ వర్చువల్ సమావేశంలో కొవిడ్-19పై ప్రధాని సమీక్ష జరిపారు. ముఖ్యంగా వైద్య శాఖాధికారులతో తాజా పరిస్థితిని, సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికేసులున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమైన సూచనలు చేశారు.
జనసమర్థ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రధాని సూచించారు. ఎయిర్‌పోర్టుల వద్ద అప్రమత్తత పెంచాలని సూచించారు. వృద్ధులు, వయసులో పెద్దవారు ప్రికాషనరీ డోస్ తీసుకునేలా మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్‌తో పాటు వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను పెంచాలని చెప్పారు. కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే మందులు, తగినంత సంఖ్యలో వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు టెస్టులపై శ్రద్ధ పెంచాలని ప్రధాని అధికారులకు సూచించారు.
మరోవైపు మాస్కులు తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్, ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రుల్లో మాస్క్ తప్పనిసరి చేశారు.
అటు రాష్ట్రాలను కూడా కేంద్రం అప్రమత్తం చేసింది.
మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కూడా కోవిడ్‌పై అధికారులతో సమావేశాలు నిర్వహించారు.
చైనా సహా.. పలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా బీఎఫ్.7 వేరియంట్ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్(బీఎ్‌ఫ.5)కు సబ్-వేరియంట్ అయిన బీఎఫ్.7 అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో మూడు బీఎఫ్.7 కేసులు వెలుగు చూడగా.. బాధితులు హోంఐసోలేషన్‌లోనే కోలుకున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండే చైనీయుల విషయంలో ఇది కొంత ప్రమాదకారిగానే కనిపించినా.. ‘హైబ్రీడ్ ఇమ్యూనిటీ’ ఉన్న భారతీయులకు ఈ వేరియంట్ ఏమంత పెద్ద ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు.
చైనాలోని బీజింగ్‌లో అక్టోబరు నెలలో బీఎఫ్.7 వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గుజరాత్‌లోని ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ ఉన్నట్లు ‘బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్’ గుర్తించింది. గుజరాత్‌లోనే మరో వ్యక్తికి, ఒడిసాలో ఇంకో వ్యక్తికి బీఎఫ్.7 సోకినట్లు తేలినా.. ఆ ముగ్గురూ హోంఐసోలేషన్‌లోనే కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘‘రెండు నెలల క్రితమే కొత్త వేరియంట్ వెలుగుచూసినా.. కేసుల పెరుగుదలపై ప్రభావం చూపలేదు. ఇదంత ప్రమాదకారి కాదు. కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది’’ అని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా బీఎఫ్.7 భారత్‌లో వెలుగు చూసినా.. కేసుల పెరుగుదల లేదని వివరించారు. ప్రపంచ నిపుణులు కూడా ఒమిక్రాన్ సోకిన వారికి అంతకు మునుపటి వేరియంట్లు ఆల్ఫా, బీటాలను తట్టుకునే రోగనిధోక శక్తి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన బీఎఫ్.7తో ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. చైనాలో పౌరులను చాలాకాలం లాక్‌డౌన్లలో పెట్టారని, ఒక్కసారిగా అన్‌లాక్ అవ్వడంతో వైర్‌సకు త్వరగా ఎక్స్‌పోజ్ అవుతున్నారని, అక్కడి వ్యాక్సిన్లు అంత సమర్థవంతమైనవి కాదనే వాదనలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. అందుకే చైనాలో బీఎఫ్.7 వేగంగా విస్తరిస్తున్నా.. మన దగ్గర దాని ప్రభావం అంతగా లేదని చెబుతున్నారు. కాగా.. దేశంలో కేసుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేదని, 153 కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఒమిక్రాన్ సబ్-వేరియంటే బీఎఫ్.7. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్ ఆర్వో(ఆర్ నాట్) 10 నుంచి 18.6గా ఉంది. అంటే.. ఒకరికి ఈ వేరియంట్ సోకితే.. వారి నుంచి కనిష్ఠం సగటు 10 నుంచి గరిష్ఠం సగటు 18.6 మందికి వ్యాప్తిచెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఈ వేరియంట్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అతి కొద్ది కేసుల్లో వాంతులు, డయేరియా వంటి పొట్ట సంబంధ వ్యాధులు బయటపడవచ్చన్నారు.