UK: యూకేలో భారతీయ నర్సు హత్య.. భర్తపై హత్యానేరం కింద కేసు నమోదు..
ABN, First Publish Date - 2022-12-18T20:58:25+05:30
ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్‌షైర్ ప్రాంతంలో భారతీయ నర్సు, ఆమె ఇద్దరు పిల్లలు హత్యకు గురైన కేసులో పోలీసులు శనివారం మృతురాలి భర్త సాజూ చెలావేల్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
ఎన్నారై డెస్క్: ఇంగ్లండ్‌లోని(UK) నార్తాంప్టన్‌షైర్(Northamptonshire) ప్రాంతంలో భారతీయ నర్సు(Indian Nurse), ఆమె ఇద్దరు పిల్లలు హత్యకు గురైన కేసులో పోలీసులు శనివారం మృతురాలి భర్త సాజూ చెలావేల్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. సోమవారం అతడిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘ఈ కేసులో న్యాయం జరిగేలా అన్ని చర్యలూ తీసుకుంటాం’’ అని నార్తాంప్టన్‌షైర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
కేరళకు చెందిన అంజూ, ఆమె ఇద్దరు పిల్లలు జాన్వీ(4), జీవా(6) తమ నివాసంలో గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు బాధితులు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని కాపాడేందుకు వైద్యులు శ్రమించినా ఉపయోగం లేకపోయింది. ఆస్పత్రికి తరలించిన కొద్ది సేపటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆమె భర్త సాజూను అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ఊపిరిఅందక ఆ ముగ్గురూ మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.
కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన అంజూ ఏడాది నుంచి కెట్టరింగ్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ విభాగంలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె మరణ వార్త ఆస్పత్రి వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అంజూ నిబద్ధత కలిగిన ఉద్యోగి అంటూ వారు నివాళులు అర్పించారు. అంజూ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యం కూడా నివాళులు అర్పించింది. వారి మరణవార్త తమను కలిచివేసిందని స్కూల్ హెడ్ టీచర్ సారా పావెల్ ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2022-12-18T21:00:56+05:30 IST