NRI: కొవిడ్ కట్టడి కోసం అంతర్జాతీయ ప్రయాణికులకు త్వరలో..
ABN , First Publish Date - 2022-12-23T18:57:42+05:30 IST
కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు త్వరలో కరోనా పరీక్షలు తప్పనిసరి చేయనుంది.
ఎన్నారై డెస్క్: కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు(International Passengers) త్వరలో కరోనా పరీక్షలు తప్పనిసరి(Mandatory Covid Tests) చేయనుంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి శుక్రవారం ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాలేవో(High Case Load Countries) గుర్తిస్తామని ఆయన చెప్పారు. ఆయా దేశాల ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందే ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష(RT-PCR) రిపోర్టులను ప్రభుత్వ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. భారత్‌లో దిగాక థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష కూడా నిర్వహిస్తామన్నారు.
చైనాలో మళ్లీ మొదలైన కరోనా ప్రభంజనం భారత్‌ను ముంచెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం పలు కట్టడి చర్యలకు తెరలేపింది. విమానాశ్రయాల్లో ర్యాండమ్ టెస్టులు కూడా నిర్వహించేందుకు నిర్ణయించింది. శనివారం నుంచి దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల్లో రెండు శాతం మందికి ర్యాండమ్‌గా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారి రిపోర్టును సంబంధిత ఎయిర్‌పోర్టు అధికారులు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్‌తో పంచుకుంటారు. అంతేకాకుండా.. వారి శాంపిళ్లను జన్యు పరీక్షల నిమిత్తం పంపిస్తారు. కాగా.. భారత్ బయోటెక్ రూపొందించిన ‘ముక్కు’ టీకాను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది. ఈ టీకాకు సంబంధించిన అపాయింట్‌మెంట్ స్లాట్లు కొవిన్ పోర్టల్ శుక్రవారం అందుబాటులోకి రావచ్చు. ఇంజెక్షన్ అవసరం లేకుండా ముక్కు ద్వారా ఇచ్చే ఈ టీకా తొలుత ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులోకి రావచ్చు. కోవీషీల్డ్, కొవ్యాక్సిన్ టీకాల రెండు డోసులు పొందిన వారు ముక్కు టీకాను తీసుకోవచ్చు.