ఫోన్ రింగ్ అవగానే పోలీసులే భయపడుతున్నారు.. వారిని అంతగా భయపెడుతున్నది ఏంటంటే..
ABN, First Publish Date - 2022-12-10T10:46:38+05:30
పోలీసులనే భయపెట్టిన ఫోన్ కాల్స్... ఒకటి రెండు కాదు.. ఏకంగా 2000...
పోలిస్ స్టేషన్ లో ఫోన్ రింగ్ అయ్యంది. స్టేషన్ లో ఉన్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 'మళ్ళీ అతనేనేమో' అన్నారు సిబ్బందిలో ఒకరు. 'ఏమో కావచ్చు కానీ లిఫ్ట్ చేయకపోతే ఎలా ఎవరో ఒకరు లిప్ట్ చేయండి' అని సలహా ఇచ్చారు ఒకరు. 'చెప్పడం వరకు బానే ఉంటుంది కానీ మాట్లాడేవారికి తెలుస్తుంది' అని విసుక్కుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసారు ఒకరు. నిమిషం సేపు కూడా గడవకనే ఫోన్ పెట్టేసి 'వీడెక్కడ దొరికాడు మన ప్రాణానికి' అని తల కొట్టుకున్నారు. పోలీసులకే చిరాకు, అసహనం తెప్పించి వారిని ఓ రేంజ్ లో ఆడుకున్నాడో వ్యక్తి. ఇంతకూ అతను ఎవరు? ఫోన్ చేసి ఏం చేశాడు? వంటి వివరాల్లోకి వెళితే..
జపాన్ కు చెందిన 67సంవత్సరాల వ్యక్తి పోలీసులకు ప్రతి రోజు వందలకొద్ది ఫోన్ లు చేసేవాడట. అతను ఫోన్ చేసేది తన సమస్య ఏదో చెప్పుకోవడానికేమో అనుకుంటే పొరపాటే.. పోలీసులు అతని కాల్ లిఫ్ట్ చేయగానే వారిని చాలా దారుణంగా తిట్టడం మొదలుపెడతాడు. అలా సుమారు పోన్ చేసిన ప్రతిసారి 5 నుండి 6 నిమిషాల పాటు పోలీసులను తిడుతూనే ఉంటాడట. 'మీరు మూర్ఖులు, పన్నులు ఎగ్గొడతారు, లంచాలు తీసుకుంటారు, అవినీతి చేస్తారు' అని ఏకధాటిగా పోలీసుల మీద తనకున్న అసంతృప్తి మొత్తం వెళ్ళగక్కుతున్నాడట. ఇలా 9రోజుల్లో ఏకంగా 2000సార్లు పోన్ చేసేసరికి పోలీసులకు ఓ రేంజ్ లో విసుగుతో పాటు అతని పోన్ కాల్ లిఫ్ట్ చేయాలంటే వణుకు కూడా వచ్చేసింది. అతని ఫోన్ ఎత్తాలంటేనే పోలీసు సిబ్బంది భయపడేలా తయారయ్యింది పరిస్థితి. అయితే కాల్ డేటా ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
'ఏదో ఒకరోజు పోలీసులు నన్ను వెతికి పట్టుకుంటారని నాకు తెలుసు' అని అతను పేర్కొన్నాడు. అతను అలా ఫోన్ చేసి తిట్టడం వెనుక గల కారణాల గురించి తమకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని తొందరలోనే తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసి కూడా అతను ఇలా చేశాడంటే పోలీసులకు అతని మీద మనసులో ఎంత కోపముందో ఏంటో అని అంటున్నారు ఈ విషయం గురించి తెలిసిన నెటిజన్లు.
Updated Date - 2022-12-10T10:46:40+05:30 IST