China Covid: క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాలను ఇలా చేస్తే.. కొవిడ్ రమ్మన్నా రాదు!
ABN , First Publish Date - 2022-12-23T19:55:07+05:30 IST
క్రిస్మస్ (Christmas), న్యూయర్ (New Year) సెలబ్రేషన్స్‌కు జనం సిద్ధమవుతున్న వేళ చైనా
హైదరాబాద్: క్రిస్మస్ (Christmas), న్యూయర్ (New Year) సెలబ్రేషన్స్‌కు జనం సిద్ధమవుతున్న వేళ చైనా (China)లో మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా వైరస్ వణుకుపుట్టిస్తోంది. దేశంలోని అక్కడక్కడా కేసులు వెలుగు చూస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. చైనాలో రోజుకు 37 మిలియన్ కేసులు వెలుగు చూస్తున్నట్టు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం రోజుకు దాదాపు 3 వేల కేసులు నమోదవుతున్నట్టు చెబుతోంది. ఒక్క చైనాలోనే కాదు జపాన్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, అమెరికాలోనూ మళ్లీ కేసులు వెలుగు చూస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
కరోనా మళ్లీ విరుచుకుపడుతుండడానికి ఒమిక్రాన్ (Omicron) వేరియంటే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బిఎఫ్7 (BF7) వేరియంట్‌ను గుర్తించారు. ఈ సబ్ వేరియంట్‌కు సంబంధించి ఇండియాలో ఇప్పటి వరకు 4 కేసులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి దేశంలోని కరోనా పరిస్థితిపై సమీక్షించింది. ప్రజలను మళ్లీ అప్రమత్తం చేయాలని అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
నిజానికి ఇండియాలో ఇప్పటికిప్పుడు భయపడే పరిస్థితి ఏమీ లేదు. ప్రభుత్వం కూడా కరోనా మళ్లీ దేశంలో కాలుమోపినట్టు స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే, వచ్చి కబళించాక బాధపడడం కంటే ముందే అప్రమత్తంగా ఉండడం మంచిది కదా. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ కరోనా బారినపడకుండా ఉండాలన్నా, అది వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. అందుకు ఏం చేయాలంటే..?
అతిథులు తక్కువగా ఉండేలా..
పెళ్లి వంటి పెద్ద పెద్ద ఫంక్షన్లు కానీ, చిన్నచిన్న పార్టీలు కానీ చేయాల్సి వస్తే అతిథుల సంఖ్యను వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవడం మేలు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు కూడా ఇది వర్తిస్తుంది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడం మర్చిపోవద్దు. ఎక్కువ మంది ఒకే చోట గుమికూడారంటే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని భావించాలి.
శానిటైజర్లు తప్పనిసరి
కరోనాను దూరంగా ఉంచడంలో శానిటైజర్లు కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. అయితే, గెస్టులు ఎవరూ వాటిని వెంట తీసుకెళ్లేందుకు ఇష్టపడరు. కాబట్టి హ్యాండ్ శానిటైజర్లను సిద్ధంగా ఉంచుకోవాలి. అంతేకాదు, చేతికి అందే దూరంలోనే అవి ఉండేలా చూసుకోవాలి. చేతులు కడుక్కునేలా అందరినీ ప్రోత్సహించాలి. కనీసం 40 శాతం ఆల్కహాల్ ఉండే శానిటైజర్లను కొనుగోలు చేయాలి.
బాక్స్ మీల్స్
పార్టీల్లో బఫే విధానం వల్ల వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ షేరింగ్ ద్వారా ప్రమాదం ఎక్కువ పొంచి ఉంటుంది. అంటే గ్రేవీలు, సాస్‌లు వంటి వాటి వల్ల వ్యాప్తి ముప్పు పెరుగుతుంది. కాబట్టి వైరస్‌కు దూరంగా ఉండేందుకు బాక్స్ మీల్స్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఆహారాన్ని ప్యాకెట్లలో అందించడం ద్వారా అతిథులు ఆహారాన్ని షేర్ చేసుకోకుండా ఉంటారు.
మాస్క్‌లు తప్పనిసరి
పార్టీ ప్రొటోకాల్‌లో భాగంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలి. మాస్కులు ధరించడం వల్ల కరోనా ముప్పు తగ్గుతుంది. పార్టీకి హాజరైన వారిలో కనీసం 80 శాతం మంది మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూసుకోవాలి. అవసరమైతే మాస్కులు ఉచితంగా అందివ్వాలి. ఇందుకోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సింది కూడా ఏమీ ఉండదు. మాస్కు ధరించి వస్తేనే అనుమతించే విషయంలో కఠినంగా ఉండాలి. మాస్కులు కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఉండేలా చూసుకోవడం ద్వారా ఫెస్టివ్ మూడ్‌ను కూడా తీసుకురావొచ్చు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నా..
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరైనా దగ్గుతున్నా, ముక్కు చీదుతున్నా, ఎవరైనా సౌకర్యంగా లేనట్టు అనిపించినా వారిపై ఓ కన్ను వేయాలి. వారిని అడిగి విషయం తెలుసుకోవాలి. వీలైతే జాగ్రత్తగా వారిని ఇంటికి చేర్చే ప్రయత్నం చేయాలి. అయితే, వారి కోసం సిద్ధం చేసిన ఫుడ్ ప్యాకెట్‌ను ఇవ్వడం మర్చిపోవద్దు సుమా!