ఆర్డర్ చేసిన 30 ఏళ్ళ తరువాత డెలివరీ ఇస్తారట.. ఇంతకీ ఈ వంటకం ఏమిటంటే..
ABN, First Publish Date - 2022-11-19T15:11:38+05:30
ఇంతకీ ఆ వంటకం ఏంటీ.. అసలు దానికెందుకంత సమయం పడుతుంది
సాధారణంగా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే మన ఆర్డర్ అందుకోవడానికి ఎంతసేపు పడుతుంది ఆ.. ఏముంది కనీసం అంటే ఓ 20నిమిషాలు, మహా అయితే ఓ గంట అంతే.. అంటారు చాలామంది. కానీ అది చాలా తప్పండోయ్.. ఓ ఆర్డర్ గురించి పరిచయం చెయ్యాలిప్పుడు. దాన్ని ఈరోజు ఆర్డర్ చేశారంటే అది మీ చేతికి అందడానికి, మీరు దాన్ని తినడానికి అక్షరాలా 30సంవత్సరాల కాలం పడుతుందట. అయ్యబాబోయ్ ముప్పై సంవత్సరాలా.. అని ఆశ్చర్యపోతున్నారా అవును నిజంగానే ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది. ఇంతకీ ఆ వంటకం ఏంటీ.. అసలు దానికెందుకంత సమయం పడుతుంది వంటి విషయాలలోకి వెళితే..
జపాన్ లో ఓ ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. ఆ వంటకం పేరు క్రోక్విట్స్. చూడడానికి ఆలూ కట్లెట్ ఆకారంలో కనిపించే ఈ క్రోక్విట్స్ చాలా పాత వంటకం అంట. జపాన్ లో 'ఆషియా' అనే ఫ్యామిలీ మాత్రమే ఈ వంటకాన్ని గత 96సంవత్సరాలుగా తయారుచేస్తోందట.
దీని ప్రత్యేకత ఏమిటంటే...
ఇది నాన్ వెజ్ డిష్. ప్రపంచంలో కేవలం జపాన్ లో ఆషియా కుటుంబం మాత్రమే వీటిని తయారు చేస్తుంది. ప్రస్తుతం వీరి కుటుంబంలో షిగేరు నిట్టా అనే వ్యక్తి ఈ వంటకాన్ని తయారు చేస్తున్నాడు. ఇతడు వీరి కుటుంబంలో మూడవ తరం వాడు. ఈ వంటకం తయారు చేయడానికి స్థానికంగా వారు పండించే బంగాళాదుంపలు, జపాన్ కు చెందిన మూడు సంవత్సరాల వయసు గల నల్లజాతి పశువుల గొడ్డు మాంసాన్ని ఉపయోగిస్తారట. ఇవి వారంలో కేవలం రెండువందలు మాత్రమే తయారు చేస్తారట. అందువల్ల ఇవి ఎక్కువగా పంపిణీ చేయలేకపోతున్నారు. జపాన్ కు చెందిన నల్లజాతి పశువులను కోబ్ అని పిలుస్తారు. ఇవి భారతీయ గేదెలను పోలి ఉంటాయి. 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ క్రోక్విట్స్ ను అమ్మడానికి ఆన్లైన్ స్టోర్ ను ఓపెన్ చేశారు. అప్పటి నుండి వీటిని ఆర్డర్ చేసుకోవడం మొదలు పెట్టారు చాలామంది. అన్ని సంవత్సరాల తరువాత నిజంగానే డెలివరీ ఇస్తారా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. 2013 సంవత్సరంలో ఓ మహిళ ఈ డిష్ ను ఆర్డర్ చేయగా తాజాగా ఆమెకు డెలివరీ ఇచ్చినట్టు పేర్కొంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఇంత కథ చెప్పుకున్నాం కానీ దీని ధర ఎంతో చెప్పలేదు కదూ.. దీని ధర 1600 రుపాయలు. ఇందులో అయిదు కట్లెట్ లాంటి పీస్ లు ఉంటాయి. ఓ ఖరీదైన రెస్టారెంట్ కు వెళితే అయ్యే ఖర్చు కంటే తక్కువే.. మొదట్లో దీని గురించి ఎవరికీ సరిగా తెలియదు కానీ 2000 సంవత్సరంలో ఈ క్రోక్విట్స్ గురించి ఓ న్యూస్ పేపర్ ప్రచురించడంతో ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి తెలిసింది. ఓపిక ఉన్న మాంసాహార ప్రియులు ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి. అయితే.. 30ఏళ్ళ తరువాత మాత్రమే దాని రుచి చూడగలరు సుమీ..
Updated Date - 2022-11-19T15:11:42+05:30 IST