China లో దారుణంగా తయారైన పరిస్థితి.. ఒక్క రోజే ఏకంగా 3.7 కోట్ల మందికి కరోనా..!
ABN , First Publish Date - 2022-12-24T13:17:03+05:30 IST
నమోదు అవుతున్కేన సులను, సంభవిస్తున్న మరణాలను ప్రకటించడం చైనా ప్రభుత్వం నిలిపివేసింది.
కరోనా పేరు బహూశా ఇంకొక వందేళ్ళు దాటినా ఎవరూ మరచిపోరేమో.. 2019సంవత్సరంలో మొదటిసారి కరోనా బయటపడినప్పటి నుండి మనుషుల ప్రాణాలు దానికి ఆహుతి అవుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది అదేదో చుట్టం చూపుగా వచ్చినట్టు కోవిడ్ వస్తూనే ఉంది. మానవ రోగనిరోధక శక్తి కంటే ఎంతో శక్తివంతమైన ఈ కోవిడ్ మళ్ళీ చైనాలో విజృంభించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే జనాభాలో అతిపెద్ద దేశమైన చైనాలో ప్రస్తుతం కరోనా విశ్వరూపం దాలుస్తోందట. దీని గురించి వివరాల్లోకి వెళితే..
చైనా జనాభాలో సుమారు 3.7కోట్లమందికి కేవలం ఒక్కరోజులోనే కరోనా వైరస్ వ్యాపించినట్టు అక్కడి ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ నెలలోని మొదటి 20రోజులలో చైనా జనాభాలో 18శాతం మంది వైరస్ బారిన పడి ఉండొచ్చని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తన సమావేశంలో వెల్లడించింది. 2022 సంవత్సరం జనవరిలో కూడా ఇదే విధంగా కరోనా వైరస్ విజృంభించగా అప్పుడు నలభై లక్షల మందికి వైరస్ సోకి అందరినీ భయపెట్టింది. అయితే ఆ రికార్డ్ ఇప్పుడు నమోదు అవుతున్న కేసులతో తుడిచిపెట్టుకుని పోతోందంటున్నారు.
ప్రస్తుతం చైనాలో ప్రజలు తమకు వైరస్ సోకిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి యాంటిజెన్ పరీక్షలను ఉపయోగిస్తున్నారు. రోజూ నమోదు అవుతున్న కేసుల సంఖ్యను, సంభవిస్తున్న మరణాలను ప్రకటించడం చైనా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే న్యూమోనియా వంటి సమస్యలు ఉన్నవారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అలాంటి కారణాల వల్ల ఎవరైనా మరణిస్తే వాటిని మాత్రమే కోవిడ్ మరణాలుగా పరిగణించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా వేలలో ఉన్న కేసులు ఒక్కసారిగా కోట్లు దాటిపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. తొందరగా వ్యాప్తి చెందే ఈ మహమ్మారి విషయంలో ప్రజలు చేయగలిగిందల్లా జాగ్రత్తలు తీసుకోవడమే..