BAN vs IND: విక్టరీని చేజార్చిన కేఎల్ రాహుల్.. బంగ్లాతో ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
ABN , First Publish Date - 2022-12-04T20:06:56+05:30 IST
బంగ్లాదేశ్‌లో (Bangladesh) జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India) పరాజయం పాలైంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును..
ఢాకా: బంగ్లాదేశ్‌లో (Bangladesh) జరిగిన తొలి వన్డేలో టీమిండియా (Team India) పరాజయం పాలైంది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును మెహిదీ హసన్ మిరాజ్ (Mehidy Hasan Miraz) ఒంటి చేత్తో గెలిపించాడు. కీలక సమయంలో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 38 పరుగులు చేసి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 186 పరుగులు చేసి 41.2 ఓవర్లకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో టీమిండియా పూర్తిగా విఫలమైంది. ఒక్క కేఎల్ రాహుల్ మాత్రమే 73 పరుగులతో రాణించాడు. కానీ.. అదే కేఎల్ రాహుల్ కీలక సమయంలో క్యాచ్ చేజార్చి టీమిండియా గెలిచే మ్యాచ్‌ను కాస్తా తలకిందులు చేశాడు. ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ జట్టు ఘన విజయం సాధించింది.
టీమిండియా బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ బౌలింగ్‌లో రాణించింది. కానీ.. పేస్ బౌలర్ దీపక్ చాహర్ బౌలింగ్ టీమిండియాకు చేటు చేసింది. కీలక సమయంలో నో బాల్స్ బౌలింగ్ చేసి టీమిండియా ఓటమి మూటగట్టుకోవడంలో ఒక కారకుడయ్యాడు. నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత వన్డేల్లో ఆడుతున్న రోహిత్, కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరీస్‌లో దుమ్ము రేపాలని అభిమానులు కోరుకున్నారు. కానీ.. ఈ ఇద్దరూ అభిమానులకు నిరాశే మిగిల్చారు. రోహిత్ శర్మ 27 పరుగులకు షకీబ్ బౌలింగ్‌లో బౌల్డ్‌గా వెనుదిరగగా, స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ 9 పరుగులకే షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కు క్యాచ్‌గా దొరికిపోయి పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఇద్దరితో పాటు శిఖర్ ధావన్ కూడా 7 పరుగులకే చేతులెత్తేశాడు. శ్రేయాస్ అయ్యర్ 24 పరుగులకే పరిమితమయ్యాడు. కేఎల్ రాహుల్ ఒక్కడే కలబడి నిలబడ్డాడు. 73 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఫలితంగా.. టీమిండియా 41.2 ఓవర్లకు 186 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది. బౌలింగ్‌లో బంగ్లా జట్టు అద్భుతంగా రాణించిందని చెప్పక తప్పదు. షకీబ్ అల్ హసన్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 ఓవర్లు మేడిన్ చేయడమే కాకుండా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. టీమిండియా కీలక వికెట్లను పడగొట్టి మన బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. ఎబాడాట్ హుస్సేన్ కూడా 4 వికెట్లతో రాణించాడు. మెహిదీ హసన్ మిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. టీమిండియా 200 పరుగులు కూడా పూర్తి చేయకుండా 186 పరుగులకే చేతులెత్తేయడంతో ఇక బౌలర్ల పైనే భారం పడిన పరిస్థితి కనిపిస్తోంది. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. ఈ మ్యాచ్‌తో కుల్దీప్ సేన్ అరంగేట్రం చేయడం గమనార్హం.