IND vs BAN: టాస్ ఓడిన టీమిండియా.. కానీ కలిసొచ్చే అంశం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-11-02T13:24:09+05:30 IST
టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై క్లిష్ట పరిస్థితులను తెచ్చుకున్న టీమిండియా బంగ్లాదేశ్‌తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ ఓడింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి..
అడిలైడ్: టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై క్లిష్ట పరిస్థితులను తెచ్చుకున్న టీమిండియా బంగ్లాదేశ్‌తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ ఓడింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో.. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే టీమిండియాకు కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఈ పిచ్‌పై ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు 16 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఛేజింగ్ జట్లు 9 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచాయి. బంగ్లా కూడా నాలుగు పాయింట్లతో సెమీస్ పోటీలో కొనసాగుతోంది. రన్‌రేట్‌లో మాత్రం భారత్‌దే పైచేయి. అయితే తామిక్కడికి వచ్చింది కప్ గెలవడానికి కాదని, కానీ భారత్ మాత్రం అందుకోసమే వచ్చిందంటూ బంగ్లా కెప్టెన్ షకీబల్ ఒత్తిడి పెంచేలా కామెంట్స్ చేశాడు. ప్రస్తుత ఫామ్ ప్రకారం భారత్ ముందు బంగ్లా ఏమాత్రం పోటీ కాకున్నా పొట్టి ఫార్మాట్‌లో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఓవరాల్‌గా 11 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌పై బంగ్లా ఒక్కసారే గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో ఉన్న రోహిత్ సేనకు సెమీస్ బెర్త్ ఖాయం కావాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది.
పెర్త్ బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్ల బలహీనతలను బయటపెట్టారు. సూర్యకుమార్ మినహా అంతా బ్యాట్లెత్తేశారు. దీనికి తోడు వైస్‌కెప్టెన్ రాహుల్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 4,9,9 పరుగులే చేసి దారుణంగా నిరాశపరిచాడు. అయినా కోచ్ ద్రవిడ్ అతడిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేయడంతో తుది జట్టులో స్థానానికి ఢోకా లేదు. పస లేని బంగ్లా బౌలింగ్‌లోనైనా అతను ఫామ్‌లోకి వస్తాడేమోనని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై బంగ్లాదేశ్ బ్యాటర్లు చెమటోడ్చుతున్నారు. గెలిచిన రెండు మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగానే ముగిశాయి. ఓపెనర్ షంటో125 స్ట్రయిక్ రేట్‌తో ఫర్వాలేదనిపిస్తున్నాడు. కెప్టెన్ షకీబల్ నిరాశపరుస్తుండడంతో భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. మిడిలార్డర్‌లో అఫీఫ్, మొసాద్దెక్ పదునైన భారత బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఎలా రాణిస్తారనేది వేచిచూడాల్సిందే. బౌలింగ్‌లో టస్కిన్, ముస్తాఫిజుర్‌లపై జట్టు ఎక్కువగా ఆధారపడి ఉంది.
తుది జట్లు
భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, షమి, అర్ష్‌దీప్ సింగ్
బంగ్లాదేశ్: షంటో, లిట్టన్ దాస్, షకీబల్ (కెప్టెన్), అఫీప్ హొస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, నురుల్ హసన్(వికెట్ కీపర్), ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహ్ముద్, టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం