Tanmay Manjunath: చిన్నోడు చితక్కొట్టేశాడు.. 165 బంతుల్లో 407 పరుగులు బాదేశాడు!
ABN , First Publish Date - 2022-11-14T19:26:24+05:30 IST
ఆ కుర్రాడి పేరు తన్మయ్ మంజునాథ్ (16). క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడీ పేరు మార్మోగుతోంది. కారణం అతడి విధ్వంసకర బ్యాటింగే
బెంగళూరు: ఆ కుర్రాడి పేరు తన్మయ్ మంజునాథ్ (16). క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడీ పేరు మార్మోగుతోంది. కారణం అతడి విధ్వంసకర బ్యాటింగే. కర్ణాటక క్రికెట్ సంఘం అండర్-16 టోర్నీలో మంజునాథ్ (Tanmay Manjunath) సృష్టించిన విధ్వంసం అంతా ఇంతాకాదు. శివమొగ్గలోని సాగర్‌కు చెందిన మంజునాథ్ భద్రావతి ఎన్‌టీసీసీతో జరిగిన వన్డే మ్యాచ్‌లో వీర విజృంభణ చేశాడు. ఊచకోతకు పర్యాయ పదంలా నిలిచాడు. అతడి బాదుడుతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బంతిని అందివ్వడానికే పరిమితమయ్యారు. తన్మయ్ 165 బంతుల్లోనే ఏకంగా 407 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడి స్కోరులో 48 ఫోర్లు, 24 సిక్సర్లు ఉన్నాయంటే అతడి విధ్వంసం ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సాగర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన తన్మయ్ క్రీజులోకి వచ్చింది మొదలు బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాడు. అతడి దెబ్బకు అలుపు సొలుపు లేకుండా పరుగులు తీసిన సాగర్ క్రికెట్ క్లబ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 583 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం 584 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భద్రావతి జట్టు 73 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తన్మయ్ తన బాదుడుతో ఏకంగా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాడు. వన్డేల్లో ప్రపంచంలోనే ఇది అత్యధిక స్కోరు. ఐసీసీ లెక్కల ప్రకారం చూసుకుంటే వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. శ్రీలంకపై రోహిత్ 173 బంతుల్లో 264 పరుగులు సాధించాడు.