YS Sharmila : సీబీఐ అంటే కేసీఆర్‌కు భయం ఎందుకు?
ABN, First Publish Date - 2022-10-31T05:15:21+05:30
‘సీబీఐ విచారణ అంటే సీఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? సీబీఐ అయినా, ఈడీ అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా విచారణకు ..
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిజాయితీపరులైతే
విచారణను ఎదుర్కొనే దమ్ముండాలి కదా?
వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
జగిత్యాల, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘సీబీఐ విచారణ అంటే సీఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? సీబీఐ అయినా, ఈడీ అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా విచారణకు వస్తే ఏమిటి? టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిజాయితీపరులైతే విచారణ ఎదుర్కోవాలి. వారు తప్పు చేశారు కాబట్టే భుజాలు తడుముకుంటున్నారు’ అని వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆమె ప్రజాప్రస్థానం పాదయత్ర నిర్వహించారు. కోరుట్లలో నిర్వహించిన సభ, రోడ్‌షోలో మాట్లాడారు. మునుగోడులో టీఆర్‌ఎ్‌సను గెలిపించాలని కేసీఆర్ నానా పాట్లు పడుతున్నారని, ఒక్కో గ్రామాన్ని ఒక్కో ఎమ్మెల్యేకు అప్పగించారన్నారు. అది సరిపోలేదన్నట్టు సానుభూతి ఓటు కోసం కొత్త సినిమాకు తెరలేపారని, అది సస్పెన్స్ థ్రిల్లర్‌లా ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తున్నదని రోజుకో ట్విస్టు ఇస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై కేసీఆర్ రోజుకో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ బాగోతం బయటపెడుతామన్న టీఆర్‌ఎస్ ఇప్పటివరకు ఏమీ చేయలేదన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తుంటే కేసీఆర్ ఎప్పుడో రహస్యంగా విడుదల చేసిన జీవోను బయటకు తీసి రాష్ట్రంలో సీబీఐ అడుగుపెట్టడానికి వీలు లేదని అంటున్నారన్నారు. ఇలా ఎన్ని రహస్య జీవోలు ఉన్నాయో కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్ వాళ్లు మంచోళ్లు అయితే విచారణను ఎదురొనే దమ్ము ఉండాలి కదా అన్నారు. ఇన్నేళ్లూ బీజేపీ, టీఆర్‌ఎ్‌సలకు మునుగోడు కనిపించలేదా అని నిలదీశారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ దొర బయటకొస్తారని, ప్రజలను మాయమాటల్లో ముంచి ఓట్లు వేయించుకొని ఫాం హౌస్‌కు వెళ్తారన్నారు. కేసీఆర్ తెలంగాణలో చేసిందేమీ లేదు కానీ ఇప్పుడు దేశాలు ఏలబోతాడట అని విమర్శించారు. ‘నక్కలు ఎరగని బొక్కలు లేవు, పాములు ఎరగని పుట్టలు లేవు’ అన్నట్టు కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదన్నారు.
Updated Date - 2022-10-31T05:18:29+05:30 IST