TRS MLAs poaching case: కీలక పరిణామం.. బండి సంజయ్ అనుచరుడిని ప్రశ్నిస్తున్న సిట్
ABN, First Publish Date - 2022-11-21T17:19:51+05:30
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు (TRS MLAs poaching case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు (TRS MLAs poaching case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. ఈ రోజు బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) అనుచరుడు శ్రీనివాస్‌ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్ చేశారని శ్రీనివాస్‌పై ఆరోపణలున్నాయి. అక్టోబర్ 26న తిరుపతి నుంచి హైదరాబాద్ (Hyderabad)కు సింహయాజీకి శ్రీనివాస్ విమాన టికెట్లు బుక్ చేసినట్టు సిట్ గుర్తించింది. సింహయాజీతో శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. అయితే సిట్ విచారణకు తుషార్, బీఎల్ సంతోష్, జగ్గు స్వామి గైర్హాజరయ్యారు.
నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారాల్సిందిగా బేరసారాలు జరుపుతూ మొయినాబాద్ ఫాంహౌస్ (Moinabad Farmhouse)లో రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి అక్టోబరు 26న పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా, విచారణలో వారు ముగ్గురు ఇచ్చిన సమాచారం, వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ విశ్లేషణ, వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన ఆధారాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నలుగురికి 41(ఏ) సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ను తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
అయితే నలుగురికి ఒకే ఫార్మాట్‌లో నోటీసులు జారీ చేసిన సిట్.. వారందరినీ ఒకేరోజు (సోమవారం), ఒకే సమయంలో (ఉదయం 10.30 గంటలకు) బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈ నలుగురిలో ఏ ఒక్కరికీ నేరుగా నోటీసులు ఇవ్వలేదని సమాచారం. వారి ఇళ్లు, కార్యాలయాలకు నోటీసులు అంటించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లో జారీ చేయడమో జరిగినట్లు తెలిసింది. కరీంనగర్‌లో న్యాయవాది శ్రీనివాస్ ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి తలుపునకు నోటీసులు అంటించారు.
Updated Date - 2022-11-21T17:19:53+05:30 IST