ఇక కుంట పడదేమో!
ABN , First Publish Date - 2023-06-17T00:57:22+05:30 IST
అనగనగా ఓ కొండ. దాని దిగువన ఓ నీటి కుంట. దాని చుట్టూ వందల ఎకరాల పచ్చని పంట పొలాలు. వర్షం వస్తే కొండపై నుంచి జాలువారే నీళ్లన్నీ కుంటలోకే చేరేవి. వచ్చిన నీరు పొంగి పొర్లిపోకుండా ఉండేందుకు చెక్‌డ్యాంను సైతం నిర్మించారు.
కంకర క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం
కనిపించకుండా పోతున్న ఓ కుంట
అడుగంటిన భూగర్భ జలాలు
చుట్టూ భూములున్న రైతులకు ఇబ్బందులు
ఫిర్యాదులను పట్టించుకోని సంబంధిత అధికారులు
ఇది మన్నీల కొటిమిగొందికుంట దుస్థితి
అనగనగా ఓ కొండ. దాని దిగువన ఓ నీటి కుంట. దాని చుట్టూ వందల ఎకరాల పచ్చని పంట పొలాలు. వర్షం వస్తే కొండపై నుంచి జాలువారే నీళ్లన్నీ కుంటలోకే చేరేవి. వచ్చిన నీరు పొంగి పొర్లిపోకుండా ఉండేందుకు చెక్‌డ్యాంను సైతం నిర్మించారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి చుట్టూ ఉన్న భూములన్నీ తంపుగా ఉండేవి. అయితే ఓ కంకర క్వారీ నిర్వాహకుల కన్ను ఆ కొండపై పడింది. అంతే ! ఎడా పెడా కొండను తవ్వేశారు. వచ్చిన మట్టి, పనికిరాని రాళ్లను కుంటలో పోసేశారు. దీంతో కుంట క్రమంగా మాయం అవుతోంది. క్వారీ నుంచి వచ్చే ధూళి పడి పండ్ల తోటల దిగుబడి తగ్గిపోయింది. సమస్యను పరిష్కరించమని రైతులు ఎందరిని వేడుకున్నా ‘స్పందన’ లేదు. ఇది జిల్లా కేంద్రానికి సమీపంలోని మన్నీల గ్రామం సమీపంలో ఉన్న కొటిమిగొందికుంట దుస్థితి.
అనంతపురం రూరల్, జూన 16: గ్రామ సర్వే నెంబరు 26లో 13.16ఎకరాల ప్రభుత్వ భూమిలో కొటిమిగొందికుంట ఉంది. వర్షాకాలంలో సమీపంలోని కొండలో నీరంతా ఆ కుంటలోకి వచ్చి చేరేది. ఆ కుంటలోని నీరు బయటకు వెళ్లకుండా ఉండేందుకు కొన్నేళ్ల కిందట కుంటలోనే చెక్‌డ్యాం కూడా నిర్మించారు. దీని వలన భూగర్భజలాలు వృద్ధి చెందటంతోపాటు రైతులు, గొర్రెలు, పశువుల కాపర్లకు ఉపయో గకరంగా ఉండేది. అయితే స్థానికంగా ఓ సంస్థ కంకర క్వారీ నిర్వహణకు అనుమతులు పొందింది. కొండను తవ్వే క్రమంలో వచ్చే వేస్ట్ మట్టి, రాళ్లను కుంటలో వేయటం ప్రారంభించారు. కొన్నేళ్లు ఇదే విధంగా సాగుతోంది. ఈక్రమంలోనే కుంట స్థలంలో నీళ్లకు బదులు పెద్ద పెద్ద మట్టికుప్పలు, రాళ్లగుట్టలు దర్శనమిస్తున్నాయి. దీనికితోడు సంస్థ సభ్యులు కుంటలోనే ఆఫీస్ భవనాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కుంట కాస్త కనుమరుగు అయింది.
రైతులకు తప్పని అవస్థలు..
కుంట చుట్టూ మన్నీల, చియ్యేడు, కృష్ణంరెడ్డి పల్లి తదితర గ్రామాలకు చెందిన చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన వందల ఎకరాలకు పైగా భూములున్నాయి. క్వారీ నిర్వాహకులు కుంటలో నీటి నిల్వలు లేకుండా చేయడం కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దీనికితోడు వర్షాకాలంలో కొండల్లో నుంచి వచ్చే నీరంతా భూముల్లో నుంచి బయటకు వెళ్లిపోతోంది. ముఖ్యంగా దానిమ్మ ఇతరత్ర పండ్లతోట రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. క్వారీలో నుంచి వెలువడే తెల్లటి దుమ్ము మొత్తం పండ్ల మొక్కలపై పడుతున్నట్లు చెబుతున్నారు. ఆ ప్రభావం పంట దిగుబడులపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్థానికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు..
స్థానికంగా నెలకొన్న సమస్యపై పలుమార్లు స్థానికంగా ఉన్న రైతులు, గ్రామస్థులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రీవెన్సలో గత రెండు మూడేళ్లుగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, మైనింగ్ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన ప్రయోజనం శూన్యం. అర్జీలు ఇచ్చిన సమయంలో రెవెన్యూ అధికారులు అక్కడికి రావడం పరిశీలించడం తప్ప సమస్యను పరిష్కరించిన పాపనపోలేదని రైతులు చెబుతున్నారు. ఇటీవల సర్వే కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు. అయినా ప్రయోజనం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కుంటలో మట్టిని తొలగించాలి
నాకు కుంటకు ఆనుకుని 4ఎకరాల భూమి ఉంది. ఏటా వేరుశనగ, అలసంద, కంది వంటి పంటలు సాగు చేసేవాడిని. కుంటలో నీటి నిల్వకు ఆస్కారం లేకపోవడంతో వర్షపు నీరంతా చేనులోకి వచ్చి చేరుతున్నాయి. నీటి నిల్వ లేకపోవడం కారణంగా భూగర్భజలాలు లేకుండా పోతున్నాయి. కుంటలో నీరుంటే భూమి తంపుగా ఉంటుంది. ఇటీవల గ్రామంలో క్వారీ నిర్వహణ అనుమతుల కోసం గ్రామ సభ నిర్వహించారు. ఇందులో జిల్లా ఉన్నతాధికారులకు స్థానికంగా ఉన్న సమస్యను తెలియజేశాం. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- రమేష్, రైతు, మన్నీల
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
అధికారుల నిర్లక్ష్యం వల్ల క్వారీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్వారీ నిర్వహణకు సర్వేనెంబరు-28లో ఉంటే.. సర్వే నెంబరు 26ను కూడా ఆక్రమించారు. అందులోనే ఆఫీసు భవనాలు నిర్మించారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కుంటలో మట్టిని తొలగించాలని జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చాం. లెక్కలేనన్ని సార్లు రెవెన్యూ అధికారులకు వినతులు ఇచ్చాము. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
- త్రిలోక్ నాయుడు, సర్పంచు, మన్నీల