YSRCP : సీఎం జగన్ ప్రకటనపై వైసీపీలో కలకలం.. ఆ 18 మంది ఎమ్మెల్యేలు వీరేనా..!?
ABN , First Publish Date - 2023-06-23T02:39:23+05:30 IST
వైసీపీలో ‘హిట్‌లిస్ట్’ కలకలం రేపుతోంది. వేటు ఎవరిపైన? అనే చర్చ జోరుగా సాగుతోంది. ‘గ్రాఫ్ పెంచుకోకుంటే నేనేం చేయలేను.
ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు?
‘గడప’ తొక్కడమే ప్రాతిపదికా?
మరి ఆ సీనియర్లనూ పక్కనపెడతారా?
సామాజిక సమీకరణాలను కాదనే ధైర్యముందా?
గ్రాఫ్‌తో ముడిపెట్టడంపై అసహనం
(అమరావతి - ఆంధ్రజ్యోతి):వైసీపీలో ‘హిట్‌లిస్ట్’ కలకలం రేపుతోంది. వేటు ఎవరిపైన? అనే చర్చ జోరుగా సాగుతోంది. ‘గ్రాఫ్ పెంచుకోకుంటే నేనేం చేయలేను. పనితీరు బాగలేని వాళ్లకు టికెట్ ఇవ్వను’ అని ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘గడప గడపకూ’ కార్యక్రమంపై సమీక్షలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. 18 మంది పని తీరు బాగలేదని, వారి పేర్లు మాత్రం బయటపెట్టనని ఆయన ‘సస్పెన్స్’ పెంచారు. దీంతో ఆ 18 మంది ఎవరనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ‘గడప గడపకూ’ కార్యక్రమంలో పాల్గొననిప ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్, పినిపె విశ్వరూప్, తానేటి వనిత, జోగి రమేశ్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, రోజా పేర్లు గతంలోనూ వినిపించాయి. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు, పాముల పుష్పశ్రీవాణి కూడా ‘గడపగడపకూ’లో పాల్గొనడంలేదని సీఎంకు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలలో గ్రంధి శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్, కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెడ్డి శాంతి ఉన్నారని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. జగన్ వీరిలో ఎవరిపై వేటు వేస్తారు? నిజంగా వేస్తారా? అనేదే సస్పెన్స్!
వీరిని పక్కన పెట్టగలరా?
నిజానికి... దాదాపు 65మంది ఎమ్మెల్యేలు ‘గడపగడపకూ’లో పాల్గొనడంలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడమే ప్రాతిపదిక అయితే... వీళ్లందరికీ టికెట్లు నిరాకరించాల్సిందే. రాయలసీమకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ‘గడప’లో పాల్గొనడంలేదు. బుగ్గన, బొత్సలకు ముఖ్యమంత్రే మినహాయింపు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక... గతంలో పెద్దిరెడ్డి పేరు అందరిముందూ చదివినా, ఆయనకు టికెట్ నిరాకరించేంత సాహసం జగన్ చేయలేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనడంలేదని ఐప్యాక్ టీమ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు. కొడాలి నాని, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో సరిగా పాల్గొనడంలేదు. అయితే... సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో వీరికీ టికెట్ నిరాకరించలేరని స్పష్టమవుతోంది.
ముసలం మొదలైందా?
‘గ్రాఫ్’ పేరుతో అధినేత జగన్ చేస్తున్న హెచ్చరికలపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘గడప గడప’లో పాల్గొనడమే ‘గ్రాఫ్’కు ప్రాతిపదిక ఎలా అవుతుందన్నది కొందరి ప్రశ్న! అలాగే... సామాజిక సమీకరణాలు, ఇతరత్రా కారణాలతో కొందరికి మాత్రం మినహాయింపు ఎలా ఇస్తారన్నది మరో ప్రశ్న! అన్నింటికీ మించి... ప్రజల నుంచి వస్తున్న నిరసనలు తట్టుకోలేక మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మానేశారు. గతంలో వీధుల్లోనే నిరసనలు వ్యక్తమయ్యేవి. ఇప్పుడు గ్రామాలకు గ్రామాలే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అధ్వాన్నంగా తయారైన రోడ్లు, మురుగునీటి కాలువలు, మంచినీటి కుళాయిలు, చెత్తపన్ను, పెరిగిన విద్యుత్తు చార్జీలు, పింఛన్లలో కోత, సంక్షేమ పథకాల్లో కోత వంటి వాటిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కానీ... వ్యక్తిగతంగా తమపైనే ప్రజలు ఆగ్రహిస్తున్నట్లుగా ఐప్యాక్ టీమ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు పంపుతోందని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు పనిచేయలేదంటూ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాగుడు మూతలు
‘గడపగడపకు’లో సరిగా పాల్గొనడంలేదంటూ తొలుత 60నుంచి 70మంది ఎమ్మెల్యేల పేర్లను బోర్డుపై ప్రదర్శించేవారు. క్రమంగా ఆ సంఖ్యను 42కు కుదించారు. అప్పుడు కూడా మంత్రులతో సహా సీనియర్ ఎమ్మెల్యేల పేర్లనూ వెల్లడించారు. కానీ బుధవారం సమీక్షలో 15నుంచి 20మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని.. 18 మంది ఎమ్మెల్యేలు గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనలేదని సీఎం జగన్ చెప్పారు. వారి పేర్లను గతంలో మాదిరిగా బోర్డుపై ప్రదర్శించబోనని.. వ్యక్తిగతంగా మాట్లాడతానని తెలిపారు. ఈ దాగుడు మూతలపైనా ఎమ్మెల్యేల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.