Lokesh: జబర్దస్త్‌గా రోజా ఆంటీ ల్యాండ్ కబ్జాలు: లోకేష్
ABN , First Publish Date - 2023-02-13T21:19:31+05:30 IST
యువగళం (Yuvagalam) పాదయాత్రలో భాగంగా టీడీపీ (TDP) నేత నారా లోకేష్ (Nara Lokesh) వైసీపీ మంత్రి రోజా (Roja)పై విమర్శలు గుప్పించారు.
నెల్లూరు: వైసీపీ కీలక నేత, మంత్రి రోజా (Roja)పై నారా లోకేష్ (Nara Lokesh) విమర్శల దాడి చేశారు. జబర్దస్త్‌గా రోజా ఆంటీ ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ జబర్దస్త్ ఆంటీకి ఊరికో విల్లా ఉంది. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన స్థలం దళితులది. వారి పరిహారంలో 20 శాతాన్ని కమిషన్ అడిగారు’’ అని పేర్కొన్నారు. యువగళం (Yuvagalam) పాదయాత్రలో భాగంగా గంగాధర నెల్లూరు (Nellore) నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేనేతలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానన్న హామీని జగన్ మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు సీఎం అయిన వెంటనే 500 యూనిట్లు చేనేతలకు ఉచితమని అన్నారు. టీడీపీ వచ్చాక ఏడాదిలో గాలేరు-నగరి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
యువగళం పాదయాత్రతో వైసీపీ అంతిమయాత్ర మొదలైందన్నారు. ‘‘నన్ను ఆపడానికి వెయ్యి మంది పోలీసులు, 20 మంది ఎంపీలు ప్రయత్నం చేశారు. పోలీసులకు చెప్పాను నా పేరు లోకేష్.. నేను నక్సలైట్‌ను కాదు’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా తాను తగ్గేది లేదన్నారు. జగన్ (CM Jagan) తన మైక్ లాక్కున్నా.. నా గొంతు లాక్కోలేరని చెప్పారు. వైఎస్ కుటుంబీకుల పాదయాత్రల్లో మైక్‌లను చంద్రబాబు ఎప్పుడైనా లాక్కున్నారా? అని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పటికి తనపై చాలా కేసులు పెట్టారని, కేసులకు భయపడనని స్పష్టం చేశారు. జగన్‌కు ఆఫర్ ఇస్తున్న.. 400 రోజుల పాదయాత్రలో 400 కేసులు పెట్టుకోండని సవాల్ విసిరారు.
‘‘ మూడున్నరేళ్లలో జగన్ ఏం పీకాడో తెలుసా?.. అన్న క్యాంటీన్లు, సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలను పీకేశారు’’ అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో డ్రోన్ పెట్టి ఏం పీకుతారని మండిపడ్డారు. నిరుద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. మోదీని చూస్తే జగన్‌కు ప్రత్యేక హోదా కాదు.. కేసులు గుర్తుకువస్తాయని విమర్శించారు. వివేకా (Viveka) హత్య కేసులో జగన్, భారతి పీఏలను సీబీఐ (CBI) పిలిచిందన్నారు. బాబాయ్‌ను చంపిన సైకో సీఎం జగన్ రెడ్డి అన్నారు. జిల్లాలో సైకోను తయారు చేస్తున్న సీఎం.. ఇక్కడి సైకో పెద్దిరెడ్డి (Peddi Reddy) అని విమర్శించారు.