కొనసాగుతున్న గజ దాడులు
ABN , First Publish Date - 2023-07-25T01:34:08+05:30 IST
వి.కోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో పంట పొలాలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి.
కేపీ బండ వద్ద అరటి తోటపై స్వైరవిహారం
వి.కోట, జూలై 24: వి.కోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో పంట పొలాలపై ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి అడ్డంకి చెరువు మీదుగా ఆదివారం రాత్రి వచ్చిన 14 ఏనుగులు సమీపంలోని యాలక్కి అరటి తోటలకు చేరి.. తొక్కి నాశనం చేశాయి. తిమ్మరాజుపురానికి చెందిన సోమాచ్చారి, కుమారాచ్చారికి చెందిన మూడు ఎకరాల అరటి తోటలోకి ఏనుగుల గుంపు జొరబడి అరటి పంటను తిని, తొక్కి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగులను గమనించిన గ్రామస్తులు చప్పుడు చేస్తూ.. బాణసంచా పేల్చడంతో అవి వెనుదిరిగాయి. అప్పులు చేసి అరటి పంటను సాగు చేశామని గెలలు దిగుబడి వచ్చి కోతకోసేందుకు సిద్ధమైన తరుణంలో ఒకే రాత్రి ఏనుగుల గుంపు తమ ఆశలను అడియాశలు చేశాయని బాధిత రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్న అప్పులకు తోడు తోట ధ్వంసం కావడంతో తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల దాడుల నుంచి తమ పంటలకు రక్షణ కల్పించడంలో అటవీశాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం పెంచాలని డిమాండు చేస్తున్నారు.
ఆవులపల్లెలో ఒంటరి ఏనుగు సంచారం
సోమల: సోమల మండలం ఆవులపల్లె పంచాయతీ మల్లేశ్వరపురం సమీప మామిడి తోటలో ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి సంచరించినట్లు రైతు కపిల సుబ్రహ్మణ్యం తెలిపారు. నీలం రకం మామిడి కాయలను కోయకుండా చెట్లలోనే ఉంచారు. ఈ క్రమంలో ఏనుగు ఆ కాయలను తిన్నంతా తిని చెట్లను ధ్వంసం చేసిందని ఆ రైతు ఆవేదన చెందారు. రెండు రోజులుగా ఈ పరిసరాల్లోనే ఏనుగు తిరుగుతోందన్నారు. ఆవులపల్లె, చిన్నఉప్పరపల్లె, పేటూరు, పెద్దఉప్పరపల్లె, అన్నెమ్మగారిపల్లె పంచాయతీలో వందల ఎకరాల్లో నీలం రకం మామిడి కాయలు కోయాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఆ రకం కాయలు టన్ను రూ.50 వేల వరకు ధర పలుకుతోంది. ఇలాంటి సమయంలో ఏనుగు బెడదతో తాము నష్టపోవాల్సి వస్తోందని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.